భళా.. చిత్రకళా..!

9 Nov, 2021 09:40 IST|Sakshi

మనసులో మెదిలే భావాలకు రంగులరూపం దిద్దుతూ.. ప్రకృతి అందాలని మనసులో నిక్షిప్తం చేసుకుని సృజనాత్మకత జోడించి కుంచెతో అద్భుతంగా తీర్చిదిద్దే ప్రాచీన కళ పెయింటింగ్‌.. ప్రాచీనకళగా గుర్తింపు పొందిన చిత్రలేఖనం నేడు ఆధునిక హంగులు అందుకున్న కార్పొరేట్‌ అవకాశాలను సైతం దక్కించుకుంటూ తన ప్రత్యేకతను చాటుతోంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ కోర్సు డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ విశ్వవిద్యాలయంలో అందుబాటులో ఉంది.

ఏఎఫ్‌యూ : వైఎస్సార్‌ జిల్లా కడప నగరంలో ఏర్పాటైన డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ విశ్వవిద్యాలయంలో బీఎఫ్‌ఏ పెయింటింగ్‌ అందుబాటులో ఉంది. 40 సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్మీడియట్, డిప్లొమా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఇందులో ప్రవేశం పొందేందుకు అర్హులు.  ప్రస్తుతం సమాజంలో కళాభిలాష పెరిగిన నేపథ్యంలో పెయింటింగ్‌ యువతకు మంచి కెరీర్‌ మార్గంగా నిలుస్తోంది.  ఆయిల్‌పెయింట్, వాటర్,   ఆక్రిలిక్‌ పెయింట్, టెంపెరా పెయింట్‌ వంటి రకాలు ప్రాచుర్యం పొందుతున్నాయి.

ఉద్యోగావకాశాలు..

ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో చిత్రలేఖనానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. సృజనాత్మకత కలిగిన ప్రతిరంగానికి ఇది విస్తరించింది.  కాలానికి అనుగుణంగా చిత్రలేఖనంలో సైతం మార్పులు చోటుచేసుకుని సాఫ్ట్‌వేర్‌ రంగం వరకు విస్తరించింది. వెబ్, గ్రాఫిక్‌డిజైనర్‌గా, యానిమేటెడ్‌ ఆర్టిస్ట్‌గా, త్రీడీ, టూడీ కన్సల్టెంట్‌గా, ఆర్ట్‌గేమ్‌ డిజైనర్, టెక్స్‌టైల్‌ డిజైనర్, ఆర్ట్‌ డైరెక్టర్, ఫ్యాషన్‌ డిజైనర్, ఫాంట్‌ డిజైనర్, మ్యూరల్‌ ఆర్టిస్ట్, ఆర్ట్‌ హిస్టారియన్, బుక్‌ ఇలస్ట్రేటర్, కామిక్‌ ఆర్టిస్ట్, ఫర్చీనర్‌ డిజైనర్, పోలీస్‌ స్కెచ్‌ ఆర్టిస్ట్‌ ఇలా విభిన్న రంగాల్లో వీరికి కొలువులు లభిస్తాయి. విద్యార్థిదశ నుంచే ఫ్రీలాన్స్‌ ఆర్టిస్టుగా ఆర్జన ప్రారంభించవచ్చు. వీటితో పాటు ప్రభుత్వ విద్యాసంస్థల్లో డ్రాయింగ్‌ టీచర్‌గా, అధ్యాపకులుగా రాణించవచ్చు. తమ చిత్రకళా ప్రదర్శనల ద్వారా ఆర్థిక పరిపుష్టి, పేరు ప్రఖ్యాతులు సాధించవచ్చు.

ఉన్నతవిద్యలో అవకాశాలు..

బీఎఫ్‌ఏ పూర్తి చేసిన వారికి మాస్టర్‌ ఆఫ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ పెయింటింగ్, ఆర్ట్‌హిస్టరీ, ప్రింట్‌మేకింగ్‌లలో పీజీ చేసే అవకాశం ఉంది. వీటితో పాటు బెంగుళూరు ఐఐఎస్‌సీ, యూఉడీ, ఐడీసీ, నిఫ్ట్, ఎన్‌ఐడీ వంటి ప్రతిష్ఠాత్మకమైన సంస్థల్లో పీహెచ్‌డీలు, ఫెలోషిప్‌లు పొందే అవకాశం ఉంది.

ఉజ్వల భవిష్యత్‌కు మార్గం..
విభిన్నంగా ఆలోచించగలగడం, సృజనాత్మకత కలిగిన వారికి ఈ కోర్సు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఈ కోర్సును పూర్తి చేయడం ద్వారా సాఫ్ట్‌వేర్, కార్పొరేట్‌ సంస్థల్లో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. ఈ చిత్రలేఖనం ద్వారా ఉపాధి మార్గాలతో పాటు చక్కటి పేరు ప్రఖ్యాతులు అందించే కోర్సు.
– వై. మనోహర్‌రావు, కోఆర్డినేటర్, బీఎఫ్‌ఏ పెయింటింగ్,
డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ఆర్ట్స్‌

మరిన్ని వార్తలు