ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం 

4 May, 2022 04:17 IST|Sakshi
బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ డాక్టర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌తో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

ఆర్థిక, వ్యవసాయ, ఆక్వా, పర్యాటక రంగాల్లో సహకరిస్తాం  

తీరంలో పునరుత్పాదక విద్యుత్‌పై యూకే కంపెనీల ఆసక్తి 

ఐటీ రంగానికి విశాఖ అనువైన నగరం  

మంత్రి గుడివాడతో భేటీలో బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ 

దొండపర్తి (విశాఖ దక్షిణ): ఆర్థిక, వ్యవసాయ, ఆక్వా, పర్యాటక రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ డాక్టర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ చెప్పారు. విశాఖలో మంగళవారం ఆండ్రూ ఫ్లెమింగ్, ముంబైలోని బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషన్‌ దక్షిణాసియా కమిషనర్‌ అలన్‌ గెమ్మెల్‌ ఓబీఈ, ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ హెడ్‌ వరుణ్‌మాలి తదితరులతో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులకు సహకరించాలని మంత్రి బ్రిటీష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ను కోరారు. దీనిపై ఫ్లెమింగ్‌ మాట్లాడుతూ ఏపీలో సుదీర్ఘ తీరప్రాంతం ఉందని, ఇక్కడ పవన విద్యుత్‌ ఉత్పత్తికి అనేక అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇందులో పెట్టుబడులు పెట్టేందుకు యూకేకు చెందిన కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిపారు. విశాఖలో ఐటీ రంగానికి అనువైన అన్ని మౌలిక సదుపాయాలు, మానవవనరులు ఉన్నాయని చెప్పారు.

అలన్‌ గెమ్మెల్‌ ఓబీఈ మాట్లాడుతూ మెరైన్, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ అగ్రగామిగా ఉందన్నారు. ఏపీ, బ్రిటిష్‌ ప్రభుత్వాల మధ్య వాణిజ్య సంబంధాలను పెంపొందించేందుకు ఇక్కడ ఏపీతో కలిసి ష్రింప్‌ సమ్మిట్‌ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఏపీ ఆర్థికాభివృద్ధి మండలి నుంచి కె.రామేశ్వర్, అముక్తామెహర్‌ పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు