ఇంద్రకీలాద్రిపై విరిగిపడ్డ కొండ చరియలు

22 Oct, 2020 03:43 IST|Sakshi
ప్రమాదస్థలిని పరిశీలిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌

ముగ్గురికి గాయాలు

తృటిలో తప్పిన పెను ప్రమాదం

సాక్షి, అమరావతి బ్యూరో/ఇంద్రకీలాద్రి: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ ఆలయ ఆవరణలో బుధవారం కొండ చరియలు విరిగిపడ్డాయి. ప్రమాదంలో ఇద్దరు ఆలయ ఉద్యోగులు, ఒక కానిస్టేబుల్‌ గాయపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే సమయానికి గంట ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో అవధూత మౌన మునిస్వామి విగ్రహం వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. అదే ప్రాంతంలో దసరా ఉత్సవాలకు దేవస్థానం భారీ షెడ్డు ఏర్పాటు చేసింది. అందులో మీడియా, పోలీస్, పారిశుధ్య సిబ్బందితో పాటు కాంట్రాక్టర్ల వద్ద పని చేసేందుకు వచ్చిన సుమారు 20 మంది కూర్చుని ఉన్నారు. సీఎం కాన్వాయ్‌ వచ్చే సమయం దగ్గర పడిందని పోలీస్‌ సిబ్బంది అక్కడున్న వారిని పక్కకు పంపే ప్రయత్నం చేస్తుండగా.. ఇంతలో భారీ శబ్దంతో కొండరాళ్లు విరిగిపడ్డాయి. షెడ్డులోని వారంతా బయటకు పరుగులు తీయగా.. క్యూలైన్ల వద్ద విధుల్లో ఉన్న సివిల్‌ ఏఈ సత్యసాయి చరణ్‌ కాలికి తీవ్ర గాయమైంది.
ఘటనాస్థలం వద్ద విరిగిపడిన కొండచరియలు  

అటెండర్‌ సుధాకర్‌తో పాటు ఏఆర్‌ కానిస్టేబుల్‌ కె.కిరణ్‌కు స్వల్ప గాయాలయ్యాయి.  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలయం కొండపైకి ఘాట్‌ రోడ్డులోనే వెళ్లేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. సీఎం రాకను దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా అధికారులు అమ్మవారి దర్శనాలను నిలిపివేసి, ఆ ప్రాంతంలోకి భక్తులు రాకుండా నిలువరించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదంలో ధ్వంసమైన షెడ్డును యుద్ధ ప్రాతిపదికన తొలగించారు. షెడ్యూల్‌ ప్రకారం సాయంత్రం 3.30 గంటలకు ముఖ్యమంత్రి ఇంద్రకీలాద్రికి చేరుకోవాల్సి ఉండగా.. 5.05 గంటలకు మార్పు చేశారు. కొండ చరియలు విరిగిపడిన ప్రదేశంలో ఆలయ అర్చకులు శాంతి పూజలు నిర్వహించారు. 

భక్తుల రక్షణకు తగిన చర్యలు తీసుకోండి 
ఇంద్రకీలాద్రిపై భక్తుల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. దుర్గ గుడి ఘాట్‌రోడ్‌లో కొండ చరియలు విరిగి పడిన ప్రాంతాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. అమ్మవారికి పట్టు వ్రస్తాలు సమరి్పంచి, తిరిగి వెళ్లే సమయంలో కాసేపు అక్కడ ఆగారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని చెప్పారు. దుర్గగుడి మాస్టర్‌ ప్లాన్‌కు అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.    

మరిన్ని వార్తలు