సీఎం ప్రోత్సాహంతో కాంస్య పతకం

28 Apr, 2022 05:20 IST|Sakshi
రవికుమార్‌ను అభినందిస్తున్న జవ్వాది

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రోత్సాహంతో ప్రపంచస్థాయి దేహదారుఢ్య పోటీలో కాంస్య పతకం సాధించినట్లు బాడీబిల్డర్‌ రవికుమార్‌ తెలిపారు. బాడీ బిల్డింగ్‌ పోటీకి సీఎం ఆర్థికంగా సాయం అందించి ప్రోత్సహించారని తెలిపారు. ఈ మధ్యనే దక్షిణ కొరియాలో జరిగిన 170కి పైగా దేశాలు పాల్గొన్న మిస్టర్‌ యూనివర్స్‌–2022 పోటీలో 70 కేజీల విభాగంలో రవికుమార్‌ కాంస్యపతకం సాధించారు.

ఈ సందర్భంగా ఏపీఐఐసీ వైస్‌ చైర్మన్, ఎండీ జవ్వాది సుబ్రమణ్యంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. 2020 అక్టోబర్‌లో సీఎం జగన్‌ను కలిసి ఆర్థికసాయం అందించాల్సిందిగా కోరగా, సీఎం ఆదేశాల మేరకు స్వర్గీయ మేకపాటి గౌతమ్‌రెడ్డి చొరవ తీసుకొని ఆర్జాస్‌ స్టీల్‌ కంపెనీ ద్వారా రూ.9 లక్షల సాయాన్ని అందించారని గుర్తు చేశారు. ఈ కాంస్య పతకాన్ని మేకపాటి గౌతమ్‌రెడ్డికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు. రవికుమార్‌ను ఏపీఐఐసీ ఎండీ సత్కరించి అభినందించారు. మరిన్ని అంతర్జాతీయ పతకాలను సాధించాలని ఆకాంక్షించారు. 

మరిన్ని వార్తలు