వింత మనుషులు.. చీకటి గదిలో నుంచి వెలుగులోకి..

18 Sep, 2022 17:14 IST|Sakshi

అనంతపురం శ్రీకంఠంసర్కిల్‌: మూడేళ్లుగా చీకటి గదిలో మగ్గిన జీవితాల్లో వెలుగులు నిండాయి. స్వీయ నిర్బంధంలో ఉన్న అన్నా చెల్లెళ్లు పోలీసుల చొరవతో జనంలోకి వచ్చారు. అనంతపురం నగరంలోని వేణుగోపాల్‌ నగర్‌ ఆటోస్టాండ్‌ సమీపంలో నివాసముండే అన్నా చెల్లెళ్లు తిరుపాల్, కృష్ణవేణి, లక్ష్మి తల్లిదండ్రుల మరణంతో తీవ్రంగా కుంగిపోయి స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఇంటి నుంచి వచ్చే దుర్గంధాన్ని భరించలేక స్థానికులు పోలీసులకు తెలపడంతో ఈ అన్నా చెల్లెళ్ల దయనీయ స్థితి వెలుగులోకి వచ్చింది.
చదవండి: ఛీ..ఛీ..ఇదేం పాడు పని...ఫ్యామిలీ రెస్టారెంట్‌లో...

శుక్రవారం సాయంత్రం పోలీసులు వారి ఇంటికి వచ్చి అన్నా చెల్లెళ్లతో మాట్లాడారు. తిరిగి శనివారం ఉదయం స్థానిక కార్పొరేటర్‌ సుజాత, ఇన్‌చార్జి డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, మునిసిపల్‌ కమిషనరు కె.భాగ్యలక్ష్మి వారి ఇంటికి వెళ్లారు. మురికి కూపంగా ఉన్న బాధితుల ఇంటిని శుభ్రం చేయించారు. విద్యుత్తు, నీటి సరఫరాను పునరుద్ధరించారు. అన్నా చెల్లెళ్లకు ఆహారం, కొత్త దుస్తులు అందజేశారు. అన్నా చెల్లెళ్లకు స్నానం చేయించి, దుస్తులు మార్చి జన జీవన స్రవంతిలోకి తెచ్చారు. ఇన్నాళ్లూ ఆ ఇంటిని చూసి భయపడిన వీధిలోని చిన్నారులు సైతం వారితో మాట్లాడేలా పోలీసులు మమేకం చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో వీరికి ఈ సహాయం చేసినట్లు ఇన్‌చార్జి డీఎస్పీ తెలిపారు.

నాడెంతో వైభవం
శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం దంపెట్ల చెర్లోపల్లికి చెందిన అంబటి రామయ్య, అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం మదిగుబ్బకు చెందిన లక్ష్మిదేవి దంపతులు 50 ఏళ్ల క్రితం అనంతపురానికి వచ్చి స్థిరపడ్డారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక కుమారుడు సంతానం. స్థానిక పాతూరు పూల మండీల పక్కనే ఉన్న వీధిలో అంబటి రామయ్య హోటల్‌ నడిపేవారు. బాగానే సంపాదించారు. పెద్ద కుమార్తెను కనగానపల్లి మండలం భానుకోటకు చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. అప్పటికే అల్లుడికి మరో మహిళతో పెళ్లయిందని తెలిసి కుమార్తెను ఇంటికి తెచ్చుకున్నారు.

చిన్న కుమార్తె ప్రేమ వివాహం చేసుకుంది.  రామయ్య వయసు మళ్లి కొన్నేళ్ల క్రితం చనిపోయారు. మూడేళ్ల క్రితం భార్య లక్ష్మీదేవి కూడా మృతి చెందింది.  తల్లిదండ్రుల మరణం తర్వాత అన్నా చెల్లెళ్లు తిరుపాల్, కృష్ణవేణి, లక్ష్మి కుంగిపోయారు. పిల్లలను చిన్నప్పటి నుంచి పెద్దగా బయటకు పంపకపోవడంతో అటు బంధువులు, ఇటు ఆత్మీయులు పెద్దగా లేరు. చిన్న చెల్లెలు, ఆమె భర్త ఎప్పుడైనా ఇంటికి వెళ్లినా, అన్నా చెల్లెళ్లు వారిని కూడా పెద్దగా పట్టించుకోలేదు. దీంతో క్రమేణా వారూ దూరమయ్యారు. తిరుపాల్‌ బయటకు వెళ్లినప్పుడు ఏదో ఒకటి తేవడం, దాంతోనే ముగ్గురూ సరిపెట్టుకోవడంతో బక్కచిక్కిపోయారు. చివరకు స్థానికుల సమాచారంతో పోలీసులు స్పందించి వారికి కొత్త వెలుగు ప్రసాదించారు.

మరిన్ని వార్తలు