తమ్ముడూ.. నేనూ నీవెంటే!

19 Feb, 2023 10:08 IST|Sakshi

రాఖీ పండుగ వస్తేనే అక్కచెల్లెళ్లు గుర్తుకు వచ్చే సోదరులుండొచ్చు. మొక్కుబడిగా చేతికి దారం కట్టించుకొని ఆశీర్వదించే బంధాలూ ఉండొచ్చు. ఆమె తోడపుట్టిన తమ్ముడికి అన్నీ తానైంది.. తల్లిలా చూసుకుంది. తమ్ముడికి పెళ్లై సమీపంలో మరో ఇంట్లో  వేరుగా ఉంటున్నా..వారి     మధ్య అదే అనురాగం కొనసాగింది. ఇంటికి వచ్చిన తమ్ముడు కాసేపు మాట్లాడి తిరిగి నడిచి వెళ్తుండగా.. ఫర్లాంగు వెళ్లాడోలోదో..అంతలోనే పిడుగులాంటి వార్త చెవిన పడింది. ఉన్నపళంగా తమ్ముడు కుప్పకూలాడని తెలిసి గుండెపగిలినంత పనైంది. పరుగు పరుగున ఘటనాస్థలికి చేరుకుంది. నిశ్చేషు్టడిలా పడి ఉన్న తమ్ముడిని ఒళ్లోకి వాల్చుకుంది. చేతుల్లోనే ఊపిరి వదిలాడని తెలుసుకొని బోరున విలపించింది. తమ్ముడిని భౌతికంగా ఇక చూడలేననుకుంది. 24 గంటలు గడవనేలేదు.. తమ్ముడూ...నేనూ నీ వెంటేనంటూ ఆ సోదరి కూడా శ్వాస వదిలింది. ఈ హృదయ విదారక ఘటన విద్యారణ్య నగర్‌లో జరిగింది.  

రాప్తాడు రూరల్‌: తమ్ముడి మరణం ఆ అక్కను కలచివేసింది. తమ్ముడిని తలచుకుంటూ అక్క కూడా ప్రాణం కోల్పోయింది. ఒక రోజు వ్యవధిలోనే ఇద్దరి మరణం రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. వివరాల్లోకెళ్తే.. అనంతపురం రూరల్‌ మండలం విద్యారణ్యనగర్‌కు చెందిన వీరభద్రయ్య, మాధవి (46) దంపతులు. వీరికి కుమారుడు, కుమార్తె సంతానం. కిరాణా దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. మాధవి తమ్ముడు తిప్పేస్వామి (44) సమీపంలోని గణేష్నగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఈయనకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.

 తిప్పేస్వామి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. శుక్రవారం ఉదయం విద్యారణ్యనగర్‌లోని అక్క మాధవి ఇంటికి వెళ్లాడు. అక్కతో కాసేపు మాట్లాడి తన ఇంటికి నడుచుకుంటూ బయల్దేరాడు. కాస్త దూరం నడవగానే గుండె పట్టుకుని కుప్పకూలి పడిపోయాడు. ప్రత్యక్ష సాక్షులు మాధవికి సమాచారం అందించారు. ఆమె పరుగెత్తుకుంటూ వచ్చి తమ్ముడిని తన పొత్తిళ్లలో పెట్టుకుని బోరున విలపించింది. అప్పటికే తిప్పేస్వామిలో ఎలాంటి చలనమూ లేదు. ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

 తిప్పేస్వామి సొంతూరు కుందుర్పి మండలం ఎనుమలదొడ్డిలో సాయంత్రం అంత్యక్రియలు పూర్తి చేశారు. అంత్యక్రియల్లో పాల్గొన్న మాధవి ఆరోజు రాత్రి అక్కడే ఉంది. శనివారం ఉదయం ఆమె శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండడంతో హుటాహుటిన కళ్యాణదుర్గం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గుండెపోటుతో మృత్యువాత పడింది. తమ్ముడి విషాదాన్ని మరవకముందే ఆ ఇంట మరో విషాదం చోటు చేసుకుంది.    

మరిన్ని వార్తలు