ఎంత ఘోరం.. తల్లడిల్లిన తల్లిదండ్రులు

11 Sep, 2020 09:13 IST|Sakshi

నాతవరం(విశాఖ జిల్లా): కారు నడపాలన్న సరదా వారి ప్రాణం తీసింది. డ్రైవింగ్‌ నేర్చుకునే ప్రయత్నంలో ఒకేసారి అన్నదమ్ములు మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. కారు అదుపు తప్పి చెట్టును బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. నవ్వుతూ తుళ్లుతూ ఉదయాన్నే వెళ్లిన ఇద్దరు కొడుకులూ విగత జీవులై రావడం తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చింది. ఎస్సై జె.రమేష్‌ అందించిన వివరాలు.. విశాఖపట్నం జిల్లా నాతవరం గ్రామానికి చెందిన ఆశపు శ్రీనివాస్‌ (32), ఆశపు హనుమాన్‌సాయి (28) అన్నదమ్ములు. కారు నడపడం నేర్చుకునేందుకు అదే గ్రామానికి చెందిన తమ స్నేహితుడు అంకంరెడ్డి వంశీకుమార్‌తో గురువారం తెల్లవారుజామున వెళ్లారు.

కారులో తాండవ జంక్షన్‌ వరకు వెళ్లి తిరిగి వస్తుండగా నాతవరం పంచాయతీ శివారు ఏకే అగ్రహారం సమీపంలో ఉన్న మలుపు వద్ద కారు అదుపు తప్పి పక్కనే ఉన్న జీడిచెట్టును బలంగా ఢీకొట్టింది. డ్రైవింగ్‌ నేర్చుకుంటున్న అన్నదమ్ములిద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన వారి స్నేహితుడు వంశీని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు విశాఖ కేజీహెచ్‌కు రిఫర్‌ చేశారు. కారు ప్రమాదంలో మృతి చెందిన అన్నదమ్ముల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (పోలీసుల కస్టడీకి మధుప్రియ)

తల్లడిల్లిన తల్లిదండ్రులు
మృతుల తల్లిదండ్రులు మాణిక్యం, నాగలక్ష్మిలను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. వీరికి నలుగురు సంతానం. గతంలో పెళ్లి ఈడుకు వచ్చిన కూతురు, కొడుకు అనారోగ్యంతో మృతి చెందారు. అప్పటి నుంచి ఇద్దరు కుమారులను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. పెద్ద కుమారుడు శ్రీనివాస్‌ విశాఖలో ఓ ప్రైవేట్‌ కంపెనీలో జాబ్‌ చేస్తున్నాడు. చిన్న కుమారుడు హనుమాన్‌ సాయి ఇంటి వద్ద కిరణా షాపు చూసుకుంటూ తల్లిదండ్రులకు తోడుగా ఉంటున్నాడు. ఇంతలోనే అన్నదమ్ములను  కారు రూపంలో మృత్యువు కబళించింది. పేగుబంధం దూరం కావడంతో వృద్ధ దంపతులు జీర్ణించుకోలేకపోతున్నారు.
 

మరిన్ని వార్తలు