జలమార్గంలో చేరుకున్న ఆక్సిజన్‌ ట్యాంకర్లు

6 May, 2021 05:33 IST|Sakshi
ఐఎస్‌ఎస్‌ ఐరావత్‌లో ఆక్సిజన్‌ ట్యాంకర్లు

సింగపూర్‌ నుంచి విశాఖకు.. 

సాక్షి, విశాఖపట్నం: దేశంలో విజృంభిస్తున్న కోవిడ్‌–19 సెకండ్‌ వేవ్‌పై జరుగుతున్న సమరంలో భారత నౌకాదళం ఓ అడుగు ముందుకేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశాన్ని పట్టి పీడిస్తున్న ఆక్సిజన్‌ కొరతని అధిగమించేందుకు తన వంతు ప్రయత్నం ప్రారంభించింది. సముద్రసేతు–2లో భాగంగా సింగపూర్‌ నుంచి ఆక్సిజన్‌ని తీసుకొచ్చింది. ఈ నెల 2న సింగపూర్‌ చేరుకున్న ఐఎన్‌ఎస్‌ ఐరావత్, ఐఎన్‌ఎస్‌ తల్వార్‌ యుద్ధ నౌకల ద్వారా పెద్ద ఎత్తున మెడికల్‌ ఆక్సిజన్‌ నిల్వల్ని తూర్పు నౌకాదళ ప్రధాన స్థావరం విశాఖకు బుధవారం తీసుకొచ్చాయి. ముందుగా ఐఎన్‌ఎస్‌ తల్వార్‌ బుధవారం ఉదయం 54 టన్నుల ద్రవపు ఆక్సిజన్‌తో విశాఖ తీరానికి చేరుకుంది. అనంతరం.. అతి పెద్ద ల్యాండింగ్‌ షిప్‌ ఐఎన్‌ఎస్‌ అవతార్‌ భారీ స్థాయిలో ఆక్సిజన్‌ని సింగపూర్‌ నుంచి తీసుకొచ్చింది. 27 టన్నుల సామర్థ్యం ఉన్న 8 ఆక్సిజన్‌ ట్యాంకర్లతో పాటు 3,600 ఆక్సిజన్‌ సిలిండర్లు,  పెద్ద ఎత్తున కోవిడ్‌–19కి సంబంధించిన మెడికల్‌ సామగ్రిని తీసుకొచ్చింది.  

ఆక్సిజన్‌ కోసం విమానాల్లో ట్యాంకర్ల తరలింపు
ఒడిశాకు 4 ట్యాంకర్లు
గన్నవరం: ఒడిశా నుంచి రాష్ట్రానికి ఆక్సిజన్‌ దిగుమతి చేసుకునేందుకు బుధవారం ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ విమానంలో నాలుగు ఖాళీ ట్యాంకర్లను భువనేశ్వర్‌కు పంపించారు. తొలుత తెల్లవారుజామున 3 గంటలకు వచ్చిన ఐఏఎఫ్‌ సీ–17 కార్గో విమానంలో రెండు ట్యాంకర్లను, భువనేశ్వర్‌ నుంచి మధ్యాహ్నం వచ్చిన మరో విమానంలో రెండు ట్యాంకర్లను తరలించారు. ఒడిశాలోని టాటా స్టీల్, ఏఎస్‌డబ్ల్యూ స్టీల్‌ ప్లాంట్‌ల నుంచి అంగూరులోని ఫిల్లింగ్‌ స్టేషన్‌ ద్వారా ట్యాంకర్లలో మెడికల్‌ ఆక్సిజన్‌ లోడ్‌ చేయనున్నారు. అనంతరం ఈ ట్యాంకర్లు రోడ్డు మార్గంలో గ్రీన్‌చానల్‌ ద్వారా విజయవాడకు చేరుకుంటాయని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. సాధారణంగా ట్యాంకర్లను అంగూరు పంపించేందుకు మూడు నుంచి 4 రోజుల సమయం పడుతుందని చెప్పారు ట్యాంకర్లను విమానాల్లో పంపించడం ద్వారా గంటన్నర వ్యవధిలోనే అక్కడికి చేరుకుని ఆక్సిజన్‌ను తక్కువ సమయంలో రాష్ట్రానికి తీసుకువస్తాయని తెలిపారు. ట్యాంకర్ల తరలింపు ఏర్పాట్లను ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ జి.మధుసూదనరావు పర్యవేక్షించారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు