జాతీయ మహమ్మారి ‘బ్రూసెల్లోసిస్‌’: పశువులతో పాటు మనుషులకూ ప్రమాదమే

13 Apr, 2022 13:15 IST|Sakshi

 పురుషులకు వృషణాల వాపుతో పాటు నపుంసకత్వం 

మహిళలకు సోకితే అబార్షన్‌ జరిగే ప్రమాదం 

అందుబాటులోకి వ్యాక్సినేషన్‌

సాక్షి, పాలకొల్లు అర్బన్‌: బ్రూసెల్లోసిస్‌ అనేది పశు సంపదను నిర్వీర్యం చేసే ప్రమాదకరమైన వ్యాధి. బ్రూసిల్లా అబార్టస్‌ అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి పశువులకు సోకుతుంది. ఇది పశువుల నుంచి మనుషులకు కూడా సోకే అతి ప్రమాదకరమైన బ్యాక్టీరియా. దీనిని బ్యాంగ్స్‌ వ్యాధి అని కూడా పిలుస్తారు. ఇది అంటువ్యాధి. బ్రూసెల్లా సూక్ష్మజీవులు పశువుల జననేంద్రియాలను, పొదుగును ఆశించి వ్యాధిగ్రస్తం చేస్తాయి. ఈ వ్యాధి సోకితే చూడి పశువుల్లో గర్భస్రావాలు జరుగుతాయి. ఈ వ్యాధి సోకడం వల్ల కోడెలు, దున్నల్లో సంతానోత్పత్తి శక్తి తగ్గిపోతుంది.  

జాతీయ ప్రాజెక్టుగా వ్యాధి నివారణ... 
ఈ వ్యాధి పశువులకు చాలా కాలం నుంచి వస్తున్నప్పటికీ దీని నివారణకు వ్యాక్సిన్‌ ఇటీవలే కనుగొన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది. ఈ వ్యాధి నివారణను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి దశల వారీగా దేశంలోని నాలుగు నెలల వయస్సు దాటి ఎనిమిది నెలల లోపు ఉన్న పెయ్య దూడలన్నింటికీ ఈ వ్యాక్సిన్‌ అందించే ప్రక్రియను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించాయి.

ఏడాదిలో మూడు సార్లు ఈ వ్యాక్సిన్‌ ఒక్కొక్క మోతాదు చొప్పున పశువులకు అందించాలని కార్యాచరణ రూపొందించాయి. ఈ వ్యాక్సిన్‌ ఒకసారి పశువులకు చేస్తే జీవిత కాలంలో బ్రూసెల్లోసిస్‌ వ్యాధి సోకదని పశువైద్య నిపుణులు చెబుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటివరకు 29,159 పశువులకు ఈ వ్యాక్సిన్‌ అందించినట్టు అధికారులు వెల్లడించారు. ఈ వ్యాక్సిన్‌ పశువులకు వేసేటప్పుడు రక్షణ పరికరాలు వినియోగించాలి. లేనిపక్షంలో ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా ఈ వ్యాక్సిన్‌ చుక్కలు మనిషి శరీరంపై పడితే బోద మాదిరిగా వాపులు వస్తాయని పశువైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 

పాలకొల్లు మండలం గోరింటాడలో ఆవుదూడకి బ్రూసెల్లోసిస్‌ వ్యాక్సిన్‌ వేస్తున్న సిబ్బంది 

వ్యాధి వ్యాప్తి ఇలా.. 
వ్యాధిగ్రస్తమైన పశువుల్లో గర్భస్రావం జరిగినప్పుడు పిండం ద్వారా గర్భకోశ స్రవాల ద్వారా సూక్ష్మజీవులు బయటకు వచ్చి పశువులు మేసే మేతను, నీటిని ఆశించి కలుషితం చేస్తాయి. ఈ మేతను, నీటిని ఇతర పశువులు తీసుకోవడం ద్వారా వాటికి వ్యాధి సోకుతుంది. గర్భస్రావం జరిగిన పశువులు చెరువుల్లో, నీటి కుంటల్లో పొర్లినప్పుడు గర్భకోశ స్రవాలు బయటకు వచ్చి నీటిని కలుషితం చేయడం ద్వారా సూక్ష్మ జీవులు వ్యాపిస్తాయి. వ్యాధిగ్రస్తమైన కోడెలు, దున్నలు ఆరోగ్యకరమైన ఆవులు, గేదెలను దాటినప్పుడు వీర్యం ద్వారా సూక్ష్మజీవులు వ్యాపిస్తాయి.  

వ్యాధి లక్షణాలు 
చూడి పశువుల్లో గర్భస్రావాలు సాధారణంగా చూడి ఆఖరి దశలో సంభవించడం వ్యాధి ప్రధాన లక్షణం. చూడి మోపగానే సూక్ష్మజీవుల మాయను గర్భకోశాన్ని ఆశించి వ్యాధిగ్రస్తం చేస్తాయి. కాటిలెడెన్సు కుళ్లిపోవడం వల్ల పిండం మరణించి గర్భస్రావం అవుతుంది. గర్భస్రావాలు ఈ విధంగా రెండు, మూడు ఈతల్లో సంభవిస్తాయి.  

మనుషులకు వ్యాప్తి ఇలా..  
బ్రూసెల్లోసిస్‌ సూక్ష్మజీవులు మనిషి కంటి పొరల ద్వారా లేదా ఈ వ్యాధి సోకిన పశువుల పాలు, వెన్న, మాంసం ఆహారంగా భుజించడం వల్ల వ్యాప్తి చెందుతుంది. పురుషులకు ఈ వ్యాధి సోకితే వృషణాలు వాపు చెందుతాయి. వీర్యం సక్రమంగా విడుదల కాక సంతానోత్పత్తి జరగదు. పురుషులకు నపుంసకత్వం వచ్చే ప్రమాదం ఉంది. మహిళలకు అబార్షన్‌ జరుగుతుంది. పిల్లలు పుట్టే అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. 

రైతులు అవగాహన పెంచుకోవాలి 
బ్రూసెల్లోసిస్‌ వ్యాధి చాలా కాలం నుంచి పశువులకు సోకుతోంది. ఈ ఏడాది జనవరిలో వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడంతో మొదటి దశలో కొన్ని పశువులను గుర్తించి వ్యాక్సిన్‌ అందించాం. ఈ వ్యాధిపై రైతులు అవగాహన పెంచుకోవాలి. వ్యాక్సిన్‌ వేసే సిబ్బంది కూడా జాగ్రత్తలు పాటించాలి.  
– డాక్టర్‌ కె.మురళీకృష్ణ, జిల్లా పశుసంవర్థక శాఖాధికారి, భీమవరం   

మరిన్ని వార్తలు