పుస్తకమే కాదు పొలము కూడా వారికి పాఠాలు చెబుతుంది!

7 Mar, 2022 05:54 IST|Sakshi
కూరగాయల సాగులో విద్యార్థులు

బీఎస్సీ అగ్రికల్చర్‌ విద్యార్థుల వ్యవసాయం

కలల పంటలు పండిస్తున్న నైరా విద్యార్థులు 

వ్యవసాయ ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్‌

పాదాలకు అంటుకున్న మట్టి అక్కడ పాఠాలు చెబుతుంది. అరచేతికి పూసుకున్న బురద అక్షరమై వికసిస్తుంది. పుస్తకమే కాదు పొలము, హలము కూడా వారికి చదువు చెబుతుంది. పిల్లలంతా పట్టభద్రులై వ్యవసాయానికి దూరమైపోతున్న కాలంలో.. విద్యార్థి నికార్సయిన రైతుగా మారే అపురూప అవకాశం ఆ కోర్సు కల్పిస్తుంది. మట్టికి మనిషికి ఉన్న బాంధవ్యాన్ని అపూర్వ రీతిలో వివరిస్తుంది. సిలబస్, పరీక్షలతో పాటు పంట, మార్కెటింగ్‌లు కూడా ప్రత్యక్షంగా నేర్పుతుంది. ఆ చదువు ఎలా ‘సాగు’తుందంటే..?   

శ్రీకాకుళం రూరల్‌: ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వ్యవసాయ కళాశాల శ్రీకాకుళం జిల్లా నైరాలో విద్యార్థులు అన్నదాతలుగా మారుతున్నారు. పట్టాలు పొందే నాటికి మట్టిపై పూర్తిస్థాయి అవగాహన పెంచుకుంటున్నారు. అందులో భాగంగానే ఈఎల్‌పీ అనే ప్రొగ్రాంను అనుసరిస్తున్నారు. ఈఎల్‌పీ అంటే ఎక్స్‌పీరియన్సల్‌ లెర్నింగ్‌ ప్రొగ్రాం. అనుభవం ద్వారా నైపుణ్యాన్ని పెంచే ఈ కార్యక్రమం ద్వారా ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు పంటలు పండిస్తున్నారు. దీనికి కావాల్సిన పెట్టుబడిని కాలేజీ యాజమాన్యమే అందిస్తుంది.

ఇందులో రాబడి తీసుకురాగలిగితే 75 శాతం విద్యార్థులే తీసుకోవచ్చు. మిగిలిన డబ్బు ప్రాజెక్టు, గైడ్‌కు వెళ్తుంది. పంటలే కాదు వర్మీకంపోస్ట్, వర్మీటెక్, విత్తనోత్పత్తి, కూరగాయల పెంపకం, జీవ శిలీంద్రాలు, పుట్టగొడుగుల పెంపకంతో పాటు పూలు, పుచ్చకాయలు యూనిట్లు నెలకొల్పి వాటిని మార్కెటింగ్‌ కూడా చేస్తున్నారు. ఈ కాలేజీలో పండించిన పంటలను దగ్గరలో గల పరిశోధన కేంద్రాలకు, రైతులకు, క్షేత్రస్థాయిలో వినియోగిస్తున్నారు. ప్రధానంగా వర్మీకంపోస్ట్, వర్మీటెక్‌ యూనిట్ల ద్వారా జీవన ఎరువులను తయారు చేసి రైతులకు, వినియోగదారులకు తక్కువ ధరకే ఈ కళాశాల నుంచి విక్రయిస్తున్నారు. 

వర్మీ కంపోస్టు.. 
ఎండిన ఆకులు, ఎండిన గడ్డి, కూరగాయల చెత్త, పశువుల గెత్తంతో దీన్ని తయారు చేస్తారు. దీన్ని కాలేజీ విద్యార్థులు తయారు చేసి కిలో రూ.12 చొప్పున అమ్ముతున్నారు. ఇందులో రెండో రకం వర్మీ వాస్‌ కూడా ఉంది. వానపాములు విడుదల చేసే సిలోమిక్‌ ఫ్లూయిడ్‌ను వర్మీవాస్‌గా వాడుతుంటారు. లీటర్‌ బాటిల్‌ రూ.100 చొప్పున విక్రయిస్తారు.  

పుట్టగొడుగులు..  
పుట్టగొడుగు తయారీ, సంరక్షణ, ఎరువుతో పాటు మార్కెటింగ్‌పై కూడా విద్యార్థులకు క్షణ్ణంగా వివరిస్తున్నారు. ఈ విధానాల ద్వారా విద్యార్థులు సొంతంగా పుట్టగొడుగు సాగు చేసి మార్కెట్‌కు  కేజీ రూ.220 చొప్పున అమ్ముతున్నారు. 

పుచ్చకాయలు.. 
నైరా కాలేజీలో 60 సెంట్లు విస్తీర్ణంలో పుచ్చకాయలు, 10 సెంట్లు విస్తీర్ణంలో వివిధ రకాల ఆకుకూరలను విద్యార్థులు పండిస్తున్నారు. పంట చేతికి వచ్చినప్పుడు విద్యార్థులు స్వయంగా రోడ్డు మీదకు వచ్చి కూరగాయలు అమ్ముతుంటారు. పుచ్చకాయలకైతే పెట్టుబడి రూ.20వేలు పెడితే లాభం రూ.80వేలకు పైగా వస్తోంది. వీటిని కూడా విద్యార్థులే రోడ్డుకు ఇరువైపులా నించుని విక్రయిస్తున్నారు.  

విత్తనాలు కూడా..  
ఇక్కడి విద్యార్థులు పంటలే కాదు నువ్వులు, పెసలు, ఉలవలు, రాగులు, కందులు, వరి విత్తనాలను తయారు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. విత్తనాలను కృషి విజ్ఞాన కేంద్రాలకు, రైతు భరోసా కేంద్రాలకు, రైతులకు తక్కువ ధరకు విక్రయిస్తారు. కిలో రకాన్ని బట్టి రూ.50 నుంచి రూ.200 వరకూ అమ్ముతారు.

పెట్టుబడి ఇస్తాం.. 
రకరకాల పంటలు పండించేందుకు విద్యార్థులకు కళాశాల యాజమాన్యం కేవలం పెట్టుబడి మాత్రమే అందిస్తుంది. పండిన పంటలో 75 శాతం విద్యార్థులే తీసుకుంటారు. ఆఖరి సంవత్సరం విద్యార్థులకు ఆరు నెలలు ఇలా శిక్షణ ఉంటుంది.   
– సురేష్‌కుమార్, అసోసియేట్‌ డీన్, నైరా  

రైతులతో మమేకం 
అగ్రి బీఎస్సీ నాలుగేళ్ల కోర్సు. ఆఖరి ఏడాది ఆరు నెలల్లో మేము రైతులతో మమేకమవుతాం. పండించిన పంటను అమ్ముతాం కూడా. గ్రామాల్లో తిరిగి రైతులతో మమేకమవుతూ కొత్త పద్ధతులు కూడా నేర్పుతున్నారు.  
– మహమ్మద్‌ అబ్దుల్‌ రఫీ, అగ్రి బీఎస్సీ ఫైనల్‌ ఇయర్‌ 

మరిన్ని వార్తలు