ఫలించిన ఎంపీ మిథున్‌రెడ్డి కృషి.. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు

18 Aug, 2022 18:34 IST|Sakshi

మదనపల్లె బీటీ కళాశాల ప్రభుత్వ పరం  

ఫలించిన ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే నవాజ్‌బాషా కృషి 

బిసెంట్‌ థియోసాఫికల్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా పేరుమార్పు 

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన పూర్వవిద్యార్థులు, పట్టణ ప్రముఖులు

సాక్షి, మదనపల్లె: ఎప్పుడెప్పుడా అని మదనపల్లె పట్టణ ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న చిరకాల స్వప్నం సాకారమైంది. స్వాతంత్య్రోద్యమంలో కీలకభూమిక పోషించి, పట్టణానికే తలమానికంగా నిలిచిన చరిత్రాత్మక బిసెంట్‌ థియోసాఫికల్‌ ఎయిడెడ్‌ కళాశాల ప్రభుత్వ పరమైంది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ పోలా భాస్కర్‌ బీటీ కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్నట్లుగా మంగళవారం రాత్రి జీఓ విడుదల చేశారు.

ఇప్పటివరకు బిసెంట్‌ సెనెటరీ ట్రస్ట్‌(బీసీటీ) ఆధ్వర్యంలో కార్యకలాపాలు కొనసాగించిన కళాశాల ఇకపై ప్రభుత్వం నియమించిన స్పెషల్‌ ఆఫీసర్‌ పర్యవేక్షణలో బిసెంట్‌ థియోసాఫికల్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా సేవలందించనుంది. బుధవారం బీటీ కళాశాల స్పెషల్‌ ఆఫీసర్‌గా డాక్టర్‌ నాగలింగారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలుపుకుని బీటీ కళాశాలను ప్రభుత్వపరం చేసినందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి, ప్రజల ఆకాంక్షను సీఎం దృష్టికి తీసుకెళ్లి కార్యరూపం దాల్చడంలో విశేషంగా కృషిచేసిన ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే నవాజ్‌బాషాకు పూర్వవిద్యార్థులు, పట్టణ ప్రముఖులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.  

ఎంపీ.. ఎమ్మెల్యే చొరవతో.. 
బీటీ కళాశాలను ప్రభుత్వపరం చేసి విలువైన ఆస్తులను పరిరక్షించాల్సిందిగా 2015లో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని పూర్వవిద్యార్థులు, పట్టణ ప్రముఖులు విన్నవించారు. స్పందించిన మిథున్‌రెడ్డి వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యారంగంలో తీసుకువచ్చిన సంస్కరణల నేపథ్యంలో ఎయిడెడ్‌ కళాశాలలు, పాఠశాలలను ప్రభుత్వంలో విలీనం దిశగా జీఓ వెలువరించారు.

అయితే బీసీటీ ట్రస్ట్‌సభ్యులు ప్రభుత్వ ప్రతిపాదనలకు విముఖత తెలపడంతో బీటీ కళాశాల విద్యార్థులు ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే నవాజ్‌బాషాను కలిసి ప్రభుత్వ స్వాధీనానికి చొరవచూపాల్సిందిగా కోరారు. ఈ విషయమై ఎంపీ మిథున్‌రెడ్డి ప్రత్యేకశ్రద్ధ కనబరిచి బిసెంట్‌ సెనెటరీ ట్రస్ట్‌ సభ్యులను వ్యక్తిగతంగా కలుసుకుని ప్రభుత్వానికి అప్పగించేందుకు ఒప్పించారు. అంగీకారపత్రాన్ని తీసుకుని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వపరం చేయడంలో కీలకభూమిక పోషించారు. ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలుపుకున్నారు.  

బీటీ కళాశాల ఘనచరిత్ర
బిసెంట్‌ థియోసాఫికల్‌ కళాశాల రాయలసీమలో మొట్టమొదటి కళాశాల. 1915 జూలై 19న  స్వాతంత్య్రసమరయోధురాలు, హోంరూల్‌లీగ్‌  ఉద్యమకారిణి డాక్టర్‌ అనిబిసెంట్‌ చేతులమీదుగా స్థాపించబడింది. రాయలసీమ విద్యారంగంలో మైలురాయిగా నిలిచిన బీటీ కళాశాల ప్రజాఉద్యమాలకు, స్వాతంత్య్రపోరాటానికి స్ఫూర్తిగా నిలిచింది. మొదట మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా బీటీ కళాశాల నడిచింది. అయితే స్వాతంత్రోద్యమంలో బీటీ కళాశాల విద్యార్థులు పాల్గొనడం, ఉద్యమాలు చేయడంతో బ్రిటీష్‌ ప్రభుత్వం మద్రాసు విశ్వవిద్యాలయ గుర్తింపును రద్దుచేసింది. తర్వాత 1919లో రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ బీటీ కళాశాలను సందర్శించారు. జనగణమణ గేయాన్ని బెంగాలీ నుంచి ఇంగ్లీషులోకి ఇక్కడే అనువదించారు.

రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ చాన్సలర్‌గా వ్యవహరిస్తున్న నేషనల్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలోకి బీటీ కళాశాల మారింది. 1927లో ఆంధ్ర విశ్వవిద్యా లయం ప్రారంభమైన తర్వాత దానికి అనుబంధంగా ఉంటూ వచ్చింది. 1929లో అధికారపరిధి పునర్విభజనతో మళ్లీ మద్రాసు విశ్వవిద్యాలయ పరిధిలోకి వచ్చింది. 1956 శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపించినప్పటి నుంచి దానికి అనుబంధంగా విద్యా సేవలందిస్తోంది. మహోన్నత వ్యక్తుల ఉన్నత ఆశయాలతో స్థాపించిన 106 సంవత్సరాల చరిత్ర కలిగిన బిసెంట్‌ దివ్యజ్ఞాన కళాశాల ఎందరో భావిభారత పౌరులను తీర్చిదిద్ది, ఉన్నతమైన వ్యక్తులుగా సమాజానికి అందించింది. రాష్ట్రగీతమైన మా తెలుగుతల్లికి మల్లెపూదండ రచయిత శంకరంబాడి సుందరాచారి, మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి, కర్నాటక మాజీ గవర్నర్‌ పెండేకంటి వెంకటసుబ్బయ్య, సీపీఐ జాతీయనాయకుడు నారాయణ బీటీ కళాశాల పూర్వవిద్యార్థులు.  


బీటీ కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటిస్తున్న స్పెషల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌.రామలింగారెడ్డి 

అనిబిసెంట్‌ ఆశయ సాధనకు కృషి...  
బీటీ కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించిన స్పెషల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ నాగలింగారెడ్డి బాధ్యతల స్వీకరణ సందర్భంగా  బుధవారం కళాశాల ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ మహోన్నత ఆశయంతో బీటీ కళాశాలను స్థాపించిన డాక్టర్‌ అనిబిసెంట్‌ ఆశయ సాధనకు కృషిచేస్తూ ప్రభుత్వ ఆధ్వర్యంలో విద్యార్థులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు. చరిత్రాత్మక నేపథ్యం కలిగి, విలువైన కోట్లరూపాయల భవనాలను, స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించి సహృదయతను చాటుకున్న బిసెంట్‌ సెనెటరీ ట్రస్ట్‌ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

కళాశాల స్వాధీనం తర్వాత ప్రభుత్వ ఆధ్వర్యంలో సిబ్బంది, నిర్వహణకు సంబంధించి విధి విధానాలు ఖరారు కావాల్సి ఉందన్నారు. కళాశాల అభివృద్ధికి పూర్వవిద్యార్థులు, పట్టణ ప్రజలు, మేధావులు, విద్యావేత్తలు తమవంతు సహకారం అందించి తోడ్పాటునందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో చిత్తూరు ఐడీ కాలేజి ప్రిన్సిపాల్‌ ఆనందరెడ్డి, కరస్పాండెంట్‌ వైఎస్‌.మునిరత్నం, ప్రిన్సిపాల్‌ వెంకటశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు