భవనంపై నుంచి దూకి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

6 Jan, 2021 12:22 IST|Sakshi
ఆత్మహత్య చేసుకున్న తిరుమలేష్‌

భవనంపై నుంచి దూకి బీటెక్ విద్యార్థి బలవన్మరణం

ఆత్మహత్య చేసుకునే ముందు సెల్ఫీ వీడియో

చదవలేకపోతున్నా, క్షమించండంటూ తల్లిదండ్రులకు వేడుకోలు

సాక్షి, పెనుగంచిప్రోలు (కృష్ణా): ఒక్కగానొక్క కుమారుడు.. అల్లారుముద్దుగా పెంచుకున్నారు. పెద్ద చదువులు చదివిస్తున్నారు. కానీ ఓ పరీక్ష ఫెయిలయ్యానన్న మనస్థాపంతో ఆ కుమారుడు ఆత్మహత్య చేసుకుని కన్నవారికి కడపుకోతను మిగిల్చాడు. పుట్టెడు దుఃఖంలోనూ ఆ తల్లిదండ్రులు నేత్రదానం చేసేందుకు ముందుకు వచ్చారు. వివరాలు... పెనుగంచిప్రోలుకు చెందిన వడ్డెల్లి గోపాలరావు, తులసి దంపతుల ఏకైక కుమారుడు తిరుమలేష్‌(23) ఏలూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లేందుకు రాసే ప్రవేశ పరీక్షలో క్వాలిఫై కాలేదని మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. (చదవండి: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం)

ఈ క్రమంలో సోమవారం సెల్ఫీ వీడియో తీసుకుని కళాశాల భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. "అమ్మా... నేను ఫెయిల్యూర్​గా మిగిలిపోయా. ఎంత ప్రయత్నించినా ముందుకు సాగలేక పోతున్నా.. చదువులో ముందుకు వెళ్లలేకపోతున్నానమ్మా. నాలాంటి ఎదవకు జన్మనిచ్చి మీరు తప్పు చేశారమ్మా.. మీ ఆశల్ని నెరవేర్చలేక పోతున్నందుకు బాధగా ఉంది. మీరు కష్టపడి పెంచిన ఈ జీవితానికి ఇక సెలవమ్మా, నన్ను క్షమించండి" అంటూ వీడియో తీసి మిత్రులకు పంపాడు. తీవ్ర గాయాలపాలై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న తిరుమలేష్‌ను విజయవాడ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుమారుడి నేత్రాలను ఆయన కుటుంబ సభ్యులు ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రికి దానం చేశారు. (చదవండి: జీవితం నాశనం అయింది, బతికింది చాలు)

మరిన్ని వార్తలు