ఏపీకి బుద్ధుడి ధాతువు

16 Jan, 2021 07:59 IST|Sakshi
స్టేట్‌ మ్యూజియంలో ఉన్న బుద్ధుడి ధాతువు

 తెలుగు రాష్ట్రాల మధ్య పురావస్తు సంపద బట్వాడా షురూ

1956కు ముందున్న పురాతన సంపద తెలంగాణకే...

ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడ్డాక ఎక్కడ లభించినవి ఆ ప్రాంతానికే..

ఖరీదు చేసినవి 58:42 దామాషా ప్రకారం పంపిణీ

‘కాలచక్ర’కు వెళ్లిన వస్తువులు తిరిగి తెలంగాణకు

నాంపల్లిలోని స్టేట్‌ మ్యూజియంలో బుద్ధుడి ధాతువు(ఎముక) ప్రధాన ఆకర్షణ. బుద్ధ గ్యాలరీలో ఇది ఉంది. ఇది ఏపీకి తరలనుంది. అలాగే గుంటూరులో జరిగిన ‘కాలచక్ర’ఉత్సవాలకు వెళ్లిన తెలంగాణ వస్తువులు తిరిగి ఇక్కడికి రానున్నాయి. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పురావస్తు సంపద బట్వాడా మొదలైంది. రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాల అధీనంలో ఉన్న పురాతన సంపద పంపకం జరుగుతోంది. రెండు రాష్ట్రాల వైపు నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీల ఆధ్వర్యంలో ఈ పంపకం సాగుతోంది. 1956కు ముందున్న వస్తువులన్నీ తెలంగాణకే చెందుతాయని కమిటీలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఆ తర్వాత సమకూరిన వాటిలో.. ఏ ప్రాంతంలో లభించినవి ఆ ప్రాంతం ఉన్న రాష్ట్రానికి చెందనున్నాయి. 1956 తర్వాత ఖరీదుకు సమకూర్చుకున్నవి 58:42 దామాషా ప్రకారం (ఏపీకి 58.. తెలంగాణకు 42) పంచనున్నారు. తొలుత స్టోర్లలో ఉన్న వాటిని పంచుతున్నారు. ఆ తర్వాత ప్రదర్శనలో ఉన్నవాటిని బట్వాడా చేయనున్నారు. హైదరాబాద్‌లోని డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి స్టేట్‌ మ్యూజియంలో ఉన్న నాణేలకు సంబంధించి ఏపీకి ఇప్పటికే 30 వేల నాణేలను కేటాయించారు. వాటిని విడిగా ఏపీ అధికారులు స్థానికంగా భద్రపరుచుకున్నారు. మొత్తం 3.65 లక్షల వస్తువులను పంచుకోవాల్సి ఉంది.  

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి పురావస్తు సంపద పంపకాలకు కసరత్తు జరుగుతున్నా ఏకాభిప్రాయం కుదరక కొలిక్కి రాలేదు. ఆరున్నరేళ్ల తర్వాత ఓ నిర్ణయానికి రావడంతో బట్వాడా ప్రక్రియ మొదలైంది. 1956కు ముందు తెలంగాణతో ఏపీకి సంబంధం లేనందున అంతకుముందున్న పురాతన సంపదపై పూర్తిగా తెలంగాణకే హక్కు ఉం టుందన్న విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు పురావస్తు పంపక కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ రాజారెడ్డి, కన్వీనర్‌ రాములు స్పష్టం చేశారు. ఆ తర్వాత రెండు ప్రాంతాలు ఒకే రాష్ట్రంగా ఉన్నం దున ఏ ప్రాంతంలో లభించిన వస్తువులపై ఆ ప్రాం తానికే హక్కు ఉంటుందని తేల్చినట్టు తెలంగాణ కమిటీ సభ్యుడు రంగాచార్యులు తెలిపారు. చదవండి: ఉచితంగా వృత్తి విద్యా కోర్సులు

నాణేలే ఎక్కువ..
ప్రపంచంలో బ్రిటిష్‌ మ్యూజియం తర్వాత అత్యధిక నాణేలు ఉన్నది హైదరాబాద్‌ స్టేట్‌ మ్యూజియంలోనే. ఇక్కడ 3.45 లక్షల నాణేలున్నాయి. వీటిల్లో ఆంధ్రప్రదేశ్‌కు 53 వేలు చెందుతాయని తాజాగా అధికారులు లెక్కలు తేల్చారు. వీటిల్లోంచి 30 వేలను గత పక్షం రోజుల్లో దశలవారీగా అందజేశారు. నాణేల్లో బంగారువి 17 వేలుంటే, ఏపీకి ఇచ్చేవి 5 వేలుగా గుర్తించారు. ఇక తెలంగాణలో లభించినా.. కొన్ని ఏపీ ప్రాంత సామ్రాజ్యాలకు సంబంధించినవి ఉన్నాయి. దీంతో వాటిని ఏపీకి ఇవ్వాలన్న యోచనలో తెలంగాణ అధికారులున్నట్లు సమాచారం. నల్లగొండ ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో బయటపడినవి ఏపీ ప్రాంతానికి చెందిన వెంగీ చాళుక్యుల సామ్రాజ్యానికి చెందినవి కావటంతో వాటిని ఏపీ కోరుతోంది.

బుద్ధుడి ధాతువు ఆంధ్రప్రదేశ్‌కే..
నాంపల్లిలోని స్టేట్‌ మ్యూజియంలో ప్రధాన ఆకర్షణల్లో బుద్ధుడి ధాతువు ఒకటి. బుద్ధ గ్యాలరీలో ఇది ఉంది. ఇది బుద్ధుడి ఎముక. దీంతోపాటు ఆయన చితాభస్మం కూడా ఉంది. ఇది విశాఖపట్నం సమీపంలోని బావికొండలో 1980లో జరిపిన తవ్వకాల్లో వెలుగుచూసింది. ఇవి ఉన్న పాత్రలో బుద్ధుడి కాలానికి సంబంధించి చిన్న బంగారు, వెండి వస్తువులున్నాయి. ఆ పాత్రను నాంపల్లి మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. ఇప్పుడది ఏపీకి తరలివెళ్లనుంది. తెలంగాణలో మరెక్కడా బుద్ధుడి ధాతువు లేనందున దీన్ని హైదరాబాద్‌లోనే ఉంచేలా ఏపీని కోరాలని అధికారులు నిర్ణయించారు. అలాగే కృష్ణాజిల్లా మోటుపల్లిలో చోళుల కాలానికి చెందిన నటరాజ, పార్వతి, నాయనార్ల తామ్ర విగ్రహాలున్నాయి. ఇవి కూడా మ్యూజియంలో ప్రధానాకర్షణ. ఇవీ ఏపీకి వెళ్లనున్నాయి. 

అమరావతి శిల్పాలు తెలంగాణకు..
చెన్నై రాజధానిగా 1953కు ముందు ఏపీ కొనసాగినప్పుడు ఆంధ్రాలోని అమరావతిలో లభించిన అద్భుతశిల్పాలు చెన్నై, తంజావూరు మ్యూజియంలలో ఉంచారు. 1917లో నాటి తెలంగాణ స్టేట్‌ పురావస్తు అధికారులు పరస్పర మార్పిడిలో భాగంగా తమిళనాడు నుంచి కొన్ని శిల్పాలు తెచ్చారు. ఇందులో అమరావతివి కూడా ఉన్నాయి. అవి 1956కు ముందు వచ్చినందున ఇప్పుడవి తెలంగాణ లోనే ఉంటాయని అధికారులు చెబుతున్నారు. అలాగే ఫణిగిరి, నేలకొండపల్లి సహా వివిధ ప్రాంతాల్లో లభించిన కొన్ని వస్తువులు ఏపీలో ఉన్నాయి. అవి తెలంగాణకు రానున్నాయి. ఇక దలైలామా ఆధ్వ ర్యంలో గుంటూరులో జరిగిన కాలచక్ర ఉత్సవాల సమయంలో కూడా తెలంగాణ నుంచి పెద్ద సం ఖ్యలో శిల్పాలు, ఇతర పురాతన వస్తువులు గుంటూరుకు తరలాయి. అవి తెలంగాణకు వస్తాయి. 

మరిన్ని వార్తలు