పెండింగ్‌ నిధులు విడుదల చేయండి

23 Jun, 2021 04:58 IST|Sakshi
న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో మంత్రి బుగ్గన భేటీ

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు మంత్రి బుగ్గన విజ్ఞప్తి

సాక్షి, న్యూఢిల్లీ: తమ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్‌ నిధులు త్వరితగతిన విడుదల చేయాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌కు ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ విజ్ఞప్తి చేశారు. ఆయన మంగళవారం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ భావనా సక్సేనాలతో కలిసి న్యూఢిల్లీలో కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  ప్రజాప్రతినిధులు అన్ని అంశాల్లో భాగంగా రాష్ట్ర ఆర్థిక అంశాలు కూడా తెలుసుకోవాలని మంత్రి బుగ్గన సూచించారు. అనవసర విమర్శలు చేయడం తగదన్నారు.

కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా పేదలు, మధ్యతరగతి వారిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. వైద్యంపై అధిక మొత్తంలో ఖర్చుచేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆరోగ్యశ్రీ ద్వారా కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నామని చెప్పారు. బ్లాక్‌ఫంగస్‌ చికిత్సలకు ఒక్కోరోగిపై రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలు ఖర్చు అవుతోందని తెలిపారు. ప్రజాభివృద్ధికి వనరులు ముఖ్యమన్నారు. పేద, మధ్యతరగతి వర్గాలను ఆదుకుని అభివృద్ధి దిశగా ముందడుగు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. పన్నులు, జీఎస్టీ నిధులు, కేంద్ర ప్రాయోజిత పథకాల్లో ఎక్కువ వాటా తగిన అంశాలు చర్చించడానికి కేంద్రమంత్రులు, అధికారులతో భేటీ అవుతున్నట్లు వివరించారు. రాష్ట్రానికి సంబంధించిన పనులపై ఢిల్లీ వస్తే రాజకీయం తగదని ఆయన పేర్కొన్నారు.   

>
మరిన్ని వార్తలు