ఏపీ వాణిజ్య శాఖ పనితీరు దేశంలోనే అత్యుత్తమం

7 Apr, 2022 04:51 IST|Sakshi
వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్‌ అసోసియేషన్‌ స్వర్ణోత్సవాల్లో మాట్లాడుతున్న మంత్రి బుగ్గన

ఆర్థిక మంత్రి బుగ్గన 

ఉద్యోగులంటే సీఎం వైఎస్‌ జగన్‌కు ప్రత్యేక అభిమానం: మంత్రి పేర్ని నాని 

ఘనంగా వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్‌ అసోసియేషన్‌ స్వర్ణోత్సవాలు

భవానీపురం(విజయవాడ): దేశ వాణిజ్య పన్నుల్లో ఆంధ్రప్రదేశ్‌ అత్యుత్తమ పనితీరు కనబర్చడం ద్వారా ఉన్నత స్థితిలో ఉందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ తెలిపారు. రెవెన్యూ అనేది పాలనలో కీలకమని, ఇందుకోసం వాణిజ్య పన్నుల శాఖ అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. విజయవాడలో బుధవారం జరిగిన వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్‌ అసోసియేషన్‌ స్వర్ణోత్సవాల్లో ఆర్థిక మంత్రి మాట్లాడుతూ 2019లో వైఎస్సార్‌సీపీ భారీ మెజార్టీ సాధించడంలో ఉద్యోగుల పాత్ర కీలకమని, ఉద్యోగుల సంఘ నేతగా సూర్యనారాయణ మంచి పనితీరు కనబర్చారని ప్రశంసించారు. కార్యక్రమంలో పాల్గొన్న సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ఉద్యోగులంటే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రత్యేక అభిమానమని, కానీ కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక పరిస్థితులు కారణంగా పీఆర్‌సీ విషయంలో వారితో సంప్రదింపులు చేయాల్సి వచ్చిందన్నారు. 50 ఏళ్లుగా ఒకే యూనియన్‌గా వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్‌ అసోసియేషన్‌ పనిచేయడం అభినందనీయమన్నారు.  
 
అలాంటి పార్టీలతో జాగ్రత్త : సజ్జల  

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులు అడగకుండానే సీఎం వైఎస్‌ జగన్‌ 27% మధ్యంతర భృతి ఇచ్చారని గుర్తు చేశారు. రెండు, మూడు దశాబ్దాలుగా ఎన్నికల సమయంలో హామీలివ్వడం ఆ తర్వాత మర్చిపోవడం ఆనవాయితీగా వస్తోందని, సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం, అభివృద్ధిని ప్రజా సంక్షేమంతో కలిసి చూస్తోందని చెప్పారు. ఇవ్వగలమన్న ఉద్దేశంతోనే సీపీఎస్‌ రద్దు వంటి హామీలిచ్చామని, కానీ రాష్ట్ర ఆదాయంపై కోవిడ్‌ తీవ్ర ప్రభావం చూపిందని, అయినా ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ఎప్పుడూ పెద్దపీట వేస్తోందని చెప్పారు. ఎన్నికలు వస్తుండటంతో ఉద్యోగులను వాడుకునేందుకు పార్టీలు వస్తున్నాయని.. వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సుమారుగా 10 రాష్ట్రాల నుంచి హాజరైన అధికారులు జీఎస్టీ సంబంధిత అంశాలపై చర్చించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి 2,000 మందికిపైగా ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. 

మరిన్ని వార్తలు