కాగ్‌ లెక్కలు.. కాకి లెక్కలా? ఈనాడు, ఆంధ్రజ్యోతిపై ఆర్థిక మంత్రి బుగ్గన మండిపాటు

22 Sep, 2022 04:20 IST|Sakshi

రాష్ట్రానికి సాయం అందకూడదనే బాబు బృందం వక్రీకరణలు

సభను, కేంద్ర సంస్థలను కించపర్చే తప్పుడు వార్తలపై చర్యలు తీసుకోవాలి

ఏపీ గురించి క్రిసిల్‌ ప్రత్యేకంగా ఏమీ చెప్పకపోయినా అసత్య కథనాలు 

రాష్ట్ర సొంత ఆదాయం బాగుంది.. అప్పులు తక్కువని నిపుణులే చెపుతున్నారు 

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ఎలాంటి ఆర్థిక సాయం అందకూడదనే దురుద్దేశంతో ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు వక్రీకరణ లెక్కలతో కథనాలు ప్రచురిస్తున్నాయని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం జగన్‌ కూలంకషంగా బడ్జెట్‌ ప్రతులు, కాగ్, కేంద్ర ఆర్థిక శాఖ నివేదికలతో వాస్తవ గణాంకాలను వివరిస్తే కాకి లెక్కలంటూ తప్పుడు కథనాలు ప్రచురించారని మండిపడ్డారు.

ఏపీకి ఆర్థిక సాయం అందించవద్దంటూ మూడేళ్లుగా ప్రతిపక్ష నాయకులు వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు, బ్యాంకులకు పలుదఫాలు లేఖలు రాశారన్నారు. పారదర్శక ప్రభుత్వంగా ప్రజలకు వాస్తవాలను తెలియజేయాల్సిన బాధ్యత తమపై ఉందని బుధవారం ఆయన అసెంబ్లీలో పేర్కొన్నారు. ఆ వివరాలివీ..

► రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ రేటింగ్‌ సంస్థ క్రిసిల్‌ పేర్కొన్నట్లు ఈనాడు తప్పుడు కథనాలు రాసింది. క్రిసిల్‌ జూలై, ఆగస్టు నివేదికలు పరిశీలిస్తే అందులో ఎక్కడా రాష్ట్రం గురించి ప్రత్యేకంగా ఏమీ రాయలేదు. ఆగస్టు నివేదికలో ఏపీ గురించి ఒక్క ముక్క లేదు. జూలై నివేదికలో కోవిడ్‌ ప్రభావం గురించి వివరిస్తూ అన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను ప్రస్తావించారు.

బిహార్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఏపీ, పశ్చిమ బెంగాల్, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు కోవిడ్‌ తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అందులో ఉంది. ఏపీ గురించి ప్రత్యేకంగా చెప్పలేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి మాత్రం ఏపీ పరిస్థితి దిగజారిందంటూ రాసేశారు. రాష్ట్రం 15వ ఆర్థిక సంఘం నిబంధనలకు లోబడే అప్పులు చేస్తోందని ఎకనమిక్‌ పాలసీ రీసెర్చ్‌ నిపుణులు స్పష్టం చేశారు. 

► ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ అతి తక్కువ రేటుకు అప్పు చేస్తోంది. రెవెన్యూ ఖర్చులో 70 శాతం ఏదో ఒక రూపంలో అభివృద్ధిపైనే వెచ్చిస్తోంది. అప్పు చేసినా దాన్ని తట్టుకునే సామర్థ్యం ఉంది. 2018–19లో టీడీపీ దిగిపోయే నాటికి ద్రవ్యలోటు 4.06 శాతంగా ఉంటే మేం 2.1 శాతానికి తగ్గించాం. దేశంలో చాలా రాష్ట్రాల ద్రవ్యలోటు పెరిగితే మన రాష్ట్రంలో తగ్గింది. 2018–19లో రాష్ట్ర ద్రవ్యలోటు రూ.35,466గా ఉంటే దాన్ని రూ.25,195 కోట్లు తగ్గించాం. కాగ్‌ ముందస్తు అంచనాలకు, తుది అంచనాలకు చాలా మార్పులు జరుగుతాయి. 2018–19 ఫిబ్రవరిలో రూ.47,650 కోట్లుగా ఉన్న ద్రవ్యలోటు మార్చి నాటికి రూ.33,700 కోట్లకు తగ్గగా ఇప్పుడు మరింత తగ్గింది.

► సీఎం జగన్‌ 2019 మే నాటికి రూ.2,69,462 కోట్లు అప్పు ఉందని స్పష్టంగా చెబితే ఈనాడు మాత్రం మార్చి నాటికి ఉన్న అప్పు రూ.2,57,509 కోట్లు తీసుకొని సీఎంవి తప్పుడు గణాంకాలు అంటూ అసత్య కథనాన్ని రాసింది. ఆపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు ఏప్రిల్, మే నెలల్లో ఏకంగా రూ.7,346 కోట్లు అప్పులు చేసిన సంగతి దాచేసింది. ఎన్నికల ముందు పసుపు కుంకుమ కోసం ఒకే రోజు రూ.5,000 కోట్లు అప్పు తీసుకున్న ఏకైక వ్యక్తి చంద్రబాబు.

చంద్రబాబు దిగిపోతూ 2019 మార్చి చివరి నాటికి రూ.40,172 కోట్లు బిల్లులు పెండింగ్‌ పెడితే ఆ మొత్తాన్ని రూ.21,673 కోట్లకు మా ప్రభుత్వం తగ్గించింది. గత ప్రభుత్వం విచ్చలవిడిగా బిల్లులు పెండింగ్‌ పెట్టిపోతే వాటిలో మా ప్రభుత్వం రూ.20,000 కోట్లు చెల్లిస్తే ఎల్లో మీడియా మాత్రం వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో అంటూ తప్పుడు కథనాలు రాస్తోంది.

► గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దడంతోపాటు అనేక ప్రాజెక్టులు, గ్రాంట్‌లను తెస్తుంటే అప్పుల కోసం ఢిల్లీ చుట్టూ ఆర్థిక మంత్రి అంటూ రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చే విధంగా రాతలు రాస్తున్నారు. గత ప్రభుత్వం అనుమతికి మించి రూ.16,418 కోట్ల అప్పుచేస్తే వాటిని ఇప్పుడు సరిదిద్దుతున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఏపీకి రూ.6,400 కోట్ల విద్యుత్‌ బకాయిలను వెంటనే చెల్లించాలన్న ఆదేశాలతోపాటు 900 కి.మీ జాతీయ రహదారులు, రెండు ఐడీటీఆర్‌లు, రూ.33,500 కోట్ల గ్రాంట్లు, హైదరాబాద్‌–బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ను సాధించాం.

గత సర్కారు నిర్ణయంతో రస్‌ అల్‌ ఖైమా ఇన్వెస్ట్‌మెంట్‌ అథార్టీ రూ.1200 కోట్ల పెనాల్టీ వేస్తే దాన్ని లండన్‌ కోర్టులో గెలిచాం. రాష్ట్రం ఇచ్చిన గణాంకాలే తీసుకుంటున్నారంటూ సభను, కాగ్‌ లాంటి సంస్థల ప్రతిష్టను దిగజార్చేలా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు కథనాలు రాస్తున్నాయి. సభా గౌరవాన్ని కించపరిచే ఇలాంటి కథనాలకు అడ్డుకట్ట వేసేలా చర్యలపై సభ ఒక నిర్ణయం తీసుకోవాలి.  

మరిన్ని వార్తలు