ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’లో మూడేళ్లుగా అగ్రస్థానంలో ఏపీ

11 Oct, 2022 09:33 IST|Sakshi

సాక్షి అనంతపురం : రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో వ్యాపారులది కీలక పాత్ర అని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. అందుకే వారితో తమ ప్రభుత్వం స్నేహపూర్వకంగా ఉంటోందన్నారు. అనంతపురం వాణిజ్య సలహా కమిటీ సమావేశం తొలిసారిగా జిల్లా పరిషత్‌ కార్యాలయ సమావేశ భవన్‌లో సోమవారం నిర్వహించారు.

రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్, ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ చీఫ్‌ కమిషనర్‌ గిరిజా శంకర్, ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, ఏడీసీసీబీ చైర్‌ పర్సన్‌ లిఖిత, నాటక అకాడమీ చైర్‌పర్సన్‌ హరిత, పాలసీ కమిషనర్‌ రవిశంకర్, సేల్స్‌ ట్యాక్స్‌ జాయింట్‌ కమిషనర్‌ నీరజ, వ్యాపార సంస్థలు, సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. మంత్రి బుగ్గన మాట్లాడుతూ గతంలో జై జవాన్‌ – జై కిసాన్‌ వంటి నినాదాలతో సైనికులు, రైతులను సమాజంలో ఉన్నతంగా చూసినట్లుగానే తమ ప్రభుత్వం వ్యాపారులనూ అంతే ఉన్నతంగా చూస్తోందన్నారు.

రాజుల కాలం నుంచి పన్నుల వసూలు ప్రక్రియ కొనసాగుతోందని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్‌   జగన్‌మోహన్‌రెడ్డి విధానపర నిర్ణయాలతో ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’లో భాగంగా రాష్ట్రాన్ని మూడేళ్లుగా నంబర్‌–1 స్థానంలో నిలుపుతున్నందుకు చాలా గర్వంగా ఉందన్నారు. ఎగుమతుల్లో ఏడో స్థానం నుంచి 4వ స్థానానికి తేవడం సీఎం చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. వ్యాపారవేత్తలకు నైపుణ్యం కలిగిన సిబ్బందిని అందించాలన్న సంకల్పంతో నియోజకవర్గానికో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ హబ్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. తొలి దశలో 66 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ హబ్‌లను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. జిల్లాకో సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.  

పన్నుల భారం మోపం 
వ్యాపారులపై పన్నుల భారం ఎట్టి పరిస్థితుల్లోనూ మోపేది లేదని మంత్రి బుగ్గన హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఉన్న పన్నుల భారాన్ని సైతం తగ్గించాలన్న పట్టుదలతో సీఎం జగన్‌ ఉన్నట్లు తెలిపారు. గోవాలో జరిగిన 35వ జీఎస్టీ మీటింగ్‌లో అన్ని రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొనగా.. కేంద్రంతో మాట్లాడి చింతపండు, నాపరాయి, మామిడి గుజ్జుపై జీఎస్టీ లేకుండా చేసుకోవడంలో విజయం సాధించామని గుర్తు చేశారు. రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని, పెద్ద పన్ను చెల్లింపుదారుల కోసం రాష్ట్ర స్థాయిలో, డివిజినల్‌ స్థాయిలో ఎల్‌టీఓలను నియమించామని తెలిపారు. ఆడిటింగ్‌ విభాగాన్ని వేరు చేసి, నూతన సర్కిళ్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇక నుంచి జిల్లా స్థాయిలో ప్రతి మూడు నెలలకోసారి వాణిజ్య సలహా మండలి సమావేశాలు నిర్వహించి, పన్ను చెల్లింపుదారుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపుతామన్నారు.  

‘అనంత’పై జగన్‌కు ప్రత్యేక అభిమానం 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు అనంతపురం జిల్లా అంటే ప్రత్యేక అభిమానమని మంత్రి బుగ్గన పేర్కొన్నారు. అనంతపురం – కర్నూలు జిల్లాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, హైదరాబాద్‌ – బెంగళూరు ఇండస్ట్రియల్‌ కారిడార్‌ను జిల్లాకు తీసుకువచ్చామని తెలిపారు. దేశంలో కేవలం రెండు జిల్లాల కోసం ఏర్పాటవుతున్న పారిశ్రామిక కారిడార్‌ ఇంకెక్కడా లేదని వెల్లడించారు. ఇప్పటికే అనంత, శ్రీసత్యసాయి జిల్లాల్లో కియా, సిమెంట్, స్టీల్‌ పరిశ్రమలు ఉండగా, కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఇండ్రస్టియల్‌ హబ్‌ తరహాలో పారిశ్రామిక అభివృద్ధి కనిపించనున్నట్లు ప్రకటించారు.  

అభివృద్ధిలో గణనీయమైన ప్రగతి 
‘మా ప్రభుత్వం వచ్చాక అనేక సంస్కరణలు తీసుకొచ్చి, విజయవంతంగా అమలు చేస్తోంది. వ్యాపారులకు పన్నుల భారం తగ్గించడం మొదలు, వారికి అన్ని విధాలా అండగా నిలుస్తోంది. అభివృద్ధిలో గణనీయమైన ప్రగతి సాధిస్తోంది. అందుకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న సూచికలే నిదర్శనమని’ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. అయినా రాష్ట్రంలోని ప్రతిపక్షానికి ఇవేవీ కనిపించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాలతో పాటు కొన్ని చానళ్లు, పత్రికల్లో ప్రతికూల వార్తలు రాయిస్తూ, ప్రసారం చేయిస్తూ బురద జల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఇది  మంచిది కాదంటూ హితవు పలికారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో వ్యాపారులను భాగస్వాములుగా తమ ప్రభుత్వం చూస్తోందన్నారు. 

నాసిన్‌ అభివృద్ధికి సహకారం 
గోరంట్ల : శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ నార్కోటిక్స్‌ (నాసిన్‌) అకాడమీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా సహకారం అందిస్తుందని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. నాసిన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన  గిరిజాశంకర్, ఇతర ఉన్నతాధికారులతో కలసి పరిశీలించి..పురోగతిపై సమీక్షించారు. ఈ అకాడమీలో భారతదేశంతో పాటు ఆగ్నేయాసియా దేశాల ఉద్యోగులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 

ఇబ్బంది పెట్టొద్దు 
గార్మెంట్స్‌ పరిశ్రమకు రాయదుర్గం ప్రసిద్ధి   చెందింది. అనంతపురం 100 కిలోమీటర్ల దూరం ఉండగా, కర్ణాటకలోని బళ్లారి కొద్ది దూరంలోనే ఉంది. రాయదుర్గం వాసులందరూ బళ్లారి నుంచి ముడి వస్త్రం తెచ్చుకొని కూలికి బట్టలు కుట్టి, తిరిగి బళ్లారికి తీసుకెళ్తారు. బట్ట తెచ్చేటప్పుడు, తీసుకెళ్లేటప్పుడు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు వారిపై దాడులు చేసి, పెద్ద ఎత్తున జరిమానా విధిస్తున్నారు. ఉప్పు, పప్పు వంటి కిరాణా సరుకులు తెచ్చుకునే వారిపైనా దాడులు ఆపడం లేదు. ఇలాగైతే సామాన్యులు ఎలా బతకాలి? అటువంటి వారిపై అధికారులు దాడులు చేయడం గానీ, కేసులు పెట్టడం గానీ  చేయకుండా చూడండి. 
– కాపు రామచంద్రారెడ్డి, ప్రభుత్వ విప్, 

పన్నులు తక్కువ ఉంటేనే చెల్లింపులు 
పామిడిలో జీన్స్, నైటీలు కుట్టి అమ్ముకునే కూలీలు ఎక్కువ. ఉరవకొండలో నేత కారి్మకులు ఎక్కువ. వీరందరూ కూలికి వస్త్రం తెచ్చుకొని కుట్టి, మళ్లీ కర్ణాటకకు తీసుకెళ్లి యజమానులకు ఇస్తుంటారు. కొందరు అతి తక్కువ ధరకు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి కుటుంబాలు వేలల్లో ఉన్నాయి. వారు ఈ పని తప్ప మరే పనీ చేయలేరు. అటువంటి వారిని అధికారులు పన్నులు కట్టాలంటూ వేధిస్తున్నారు. పన్నులను విపరీతంగా పెంచి ఆదాయం పెంచుకోవాలనుకుంటేనే సమస్యలొస్తాయి. పన్ను భారం తక్కువగా ఉంటే ప్రతి ఒక్కరూ నిజాయితీగా పన్ను కట్టేందుకు మొగ్గు చూపుతారు.  
– వై.శివరామిరెడ్డి, ఎమ్మెల్సీ 

(చదవండి: పరిటాల పాపం.. రైతులకు శాపం)

మరిన్ని వార్తలు