కడపలో అర్ధరాత్రి కూలిన భవనం 

23 Sep, 2022 04:20 IST|Sakshi
కడప ఎన్జీఓ కాలనీలో విద్యామందిర్‌ స్కూల్‌ సమీపంలో కూలిన భవనం

తల్లీబిడ్డలను రక్షించిన పోలీసులు, అగ్నిమాపక రెస్క్యూ టీం  

రూ.10 లక్షల మేరకు ఆస్తినష్టం  

కడప అర్బన్‌: కడపలోని ఎన్జీవో కాలనీలో విద్యామందిర్‌ స్కూల్‌ సమీపాన బుధవారం అర్ధరాత్రి సుమారు ఒంటి గంట సమయంలో ఆధునికీకరణ చేస్తున్న ఓ భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న కుటుంబంలో తల్లి, ఆమె ఇద్దరు కుమారులను పోలీస్, అగ్నిమాపక శాఖ రెస్క్యూ టీం సమష్టిగా కృషి చేసి సురక్షితంగా బయటకు తీసుకుని వచ్చాయి.

స్థానిక ఎన్జీవో కాలనీలో విద్యామందిర్‌ స్కూల్‌ సమీపాన ఉన్న రెండు అంతస్తుల భవనంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఆధునికీకరణ పనులు చేస్తున్నారు. మొదటి అంతస్తులో రాయచోటిలో పనిచేస్తున్న ఏఆర్‌ కానిస్టేబుల్‌ సుబ్బరాజు, అతని భార్య స్వప్న, ఇద్దరు కుమారులు ఉంటున్నారు. తొలుత బుధవారం అర్ధరాత్రి గ్రౌండ్‌ఫ్లోర్‌ పూర్తిగా కిందకి పడి కూలిపోయింది. దీంతో అర్ధరాత్రి ఒంటి గంటకు ఫస్ట్‌ ఫ్లోర్‌ ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది.

ఆ సమయంలో ఇంట్లో ఉన్న సుబ్బరాజు భార్య స్వప్న, ఇద్దరు పిల్లలు శిథిలాల్లో చిక్కుకుపోయారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న చిన్నచౌక్‌ స్టేషన్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ కానిస్టేబుల్‌ బాలరాజు వెంటనే అప్రమత్తమై పోలీసులకు, ఫైర్‌ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. చిన్నచౌక్‌ సీఐ కె.అశోక్‌రెడ్డి, ఎస్‌ఐ అమర్‌నాథ్‌రెడ్డి, అగ్నిమాపక శాఖ ఇన్‌చార్జ్‌ అఫీసర్‌ షంషీర్‌ అహ్మద్, లీడింగ్‌ ఫైర్‌మెన్‌లు సంజీవరాజు, పవన్‌కుమార్‌ తదితరులు ఘటనాస్థలానికి చేరుకుని స్వప్న, ఆమె పిల్లలను రక్షించారు.

ఈ ప్రమాదంలో రూ.10 లక్షల మేర ఆస్తినష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. తమను రక్షించిన పోలీసులకు, ఫైర్‌ సిబ్బందికి సుబ్బరాజు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. 

మరిన్ని వార్తలు