భవన నిర్మాణాలు త్వరితగతిన పూర్తికావాలి

18 Sep, 2022 11:16 IST|Sakshi

గుంటూరు వెస్ట్‌: ప్రజలకు బహుళ ప్రయోజనాలు కలిగించి ప్రభుత్వ సేవలు మరింత చేరువ చేసే ప్రాధాన్యతా భవనాల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల రెడ్డి తెలిపా రు. శనివారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించిన అధికారుల సమావేశంలో మాట్లాడుతూ గత కొంత కాలంగా నిర్మాణంలో ఉన్న సచివాలయాలు, విలేజ్‌ వెల్‌నెస్‌ కేంద్రాలు, డిజిటల్‌ లైబ్రరీలు, ఆర్బీకేలు, బీఎంసీయులు నిర్మాణాల్లోని ఇబ్బందులుంటే వెంటనే పరిష్కరిస్తానన్నా రు.  నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చని భవనాలను వీలైనంత త్వరగా ప్రారంభించాలన్నారు. అధికారులు వివరాలను కలెక్టర్‌కు అందిస్తూ 154 ఆర్బీకేలకుగాను 43 పూర్తి చేశామన్నారు. వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు 164కుగాను 47, గ్రామ సచివాలయాలు 206కు గాను 110, 25 బీఎంసీయూలకు గాను 2, డిజిటల్‌ లైబ్రరీలు 92కు గాను 49 పూర్తి చేశామని చెప్పారు. ఈ ఏడాది ముగింపు నాటికి మొత్తం భవనాల నిర్మాణం పూర్తి చేస్తామని వివరించారు. సమావేశంలో పంచాయతీ రాజ్‌ ఎస్‌ఈ బ్రహ్మయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.  

మౌలిక సదుపాయాలు మెరుగుపరచండి 
పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లు వెచ్చించి నిర్మిస్తున్న జగనన్న లే అవుట్స్‌లో నిర్మాణాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌ రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించిన అధికారుల సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల వర్షాల కారణంగా నిర్మాణాల్లో కొంత ఆలస్యమేర్పడిందన్నారు. తొలి దశలో మంజూరైన 68,989 ఇళ్ల నిర్మాణాలను అధికారులు వేగంగా పూర్తిచేయాలన్నారు. ఇందులో 42,821 ఇళ్లు బీబీఎల్, 12,394 ఇళ్లు బేస్‌మెంట్‌ లెవెల్, 1200 గృహాలు రూప్‌ లెవెల్, 2430 ఇళ్లు ఆర్‌సీ లెవెల్స్‌లో ఉన్నాయన్నారు. కాలనీలకు అప్రోచ్‌ రోడ్లు, లెవెలింగ్‌ పనులు పూర్తి చేసేందుకు అధికారులు మరింత చొరవ చూపాలన్నారు. అక్టోబర్‌ చివరి నాటికి మిగతాఇళ్ల బేస్‌మెంట్‌ పూర్తి చేయాలన్నారు. నిర్మాణాలకు అవసరమైన నీరు, విద్యుత్‌లు నిరంతరాయంగా అందించాలన్నారు. అక్టోబర్‌ 2 నాటికి లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసే విధంగా చూడాలన్నారు. సమావేశంలో జీఎంసీ కమిషనర్‌ కీర్తి చేకూరి, మెప్మా పీడీలు హరిహరనాథ్, వెంకట నారాయణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.  

వృత్తి నైపుణ్యాలు పెంచుకోండి 
ప్రతి వృత్తిలో సాంకేతికత పెరుగుతోందని దాంట్లో నైపుణ్యాలను పెంపొందించుకుని ఉపాధి మార్గాలు మెరుగుపరచుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌ రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్కిల్‌ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ నిరుద్యోగులకు వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా ప్రతి నియోజకవర్గానికి ఒక హబ్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. తొలి దశలో గుంటూరు ఐటీఐ, పొన్నూరులోని చేబ్రోలు ప్రభు త్వ కళాశాలలో, తెనాలిలోని ఐటీఐ కళాశాలలో హబ్‌ను ప్రారంభించి శిక్షణ ప్రారంభిస్తారన్నారు.

ఇప్పటి వరకు జిల్లాలో సీడ్యాప్, ఎన్‌ఏసీ, ఆర్‌ఎస్టీఐ, జన శిక్షణా సంస్థలు ఎవరికి వారు నిరుద్యోగులకు శిక్షణ నిచ్చేవారన్నారు. ఇక నుంచి స్కిల్‌ హబ్‌లలో కమిటీల ద్వారా అవసరమైన శిక్షణనిస్తారన్నారు. జాతీయస్థాయి పరిశ్రమలు, జిల్లాలో ఉన్న పరిశ్రమలకు అనుగుణంగా నిరుద్యోగులను స్కిల్డ్‌ ఉద్యోగులుగా తీర్చిదిద్దాలని తెలిపారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్‌ కళాశాల  సహకారంతో వెబ్, యాప్‌ డిజైనింగ్, సెక్యూరిటీ సిస్టమ్స్, కమ్యూనికేషన్స్, సోలార్‌ ఎక్విప్‌మెంట్‌ ఇన్‌స్టాలేషన్, ఎలక్ట్రిక్, ప్లంబరింగ్‌ తదితర అంశాల్లో శిక్షణనిచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ హరిహరనా«థ్, జిల్లా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి ప్రణయ్, పరిశ్రమల శాఖ జీఎం సుధాకరరావు, అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు