ఇంధన పొదుపునకు ‘ఫిక్కీ’ సాయం

17 Mar, 2022 05:22 IST|Sakshi

ఏపీకి ‘ఫిక్కీ’ని ఎక్స్‌పర్ట్‌ ఏజెన్సీగా నియమించిన బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ 

పాట్‌ పరిధిలోకి కొత్తగా రవాణా, విమానయానం, ఆస్పత్రులు, విశ్వవిద్యాలయాలు, షిప్పింగ్‌    

సాక్షి, అమరావతి: ఏపీ అమలు చేస్తున్న ఇంధన పొదుపు చర్యలను గుర్తించిన కేంద్రం.. వాటికి మరింత ఊతమిచ్చేందుకు ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఫిక్కీ)ని ఎక్స్‌పర్ట్‌ ఏజెన్సీగా నియమించింది. పెర్ఫార్మ్‌ అచీవ్‌ అండ్‌ ట్రేడ్‌ (పాట్‌) పథకం కింద పారిశ్రామిక రంగంలో ఇంధన సామర్థ్య చర్యలను అమలు చేయడంలో ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. దీనిని గుర్తించిన బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) రాష్ట్రంలో ఇంధన పొదుపు చర్యలకు మరింత ఊతమిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం నిర్దేశించుకున్న ఇంధన సామర్థ్య లక్ష్యాలను సాధించేందుకు, పాట్‌ కార్యకలాపాల పర్యవేక్షణకు ఫిక్కీ సహకారం అందించనుంది. రాష్ట్రంపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశంగా బీఈఈ చెబుతోంది.  

లక్ష్యాన్ని చేరుకునేలా.. 
దేశవ్యాప్తంగా 2070 నాటికి కర్బన ఉద్గారాలను లేకుండా చేయాలనే లక్ష్యంలో భాగంగా 2030 నాటికి ఒక బిలియన్‌ టన్నుల ఉద్గారాలను తగ్గించాలని, అందులో మన రాష్ట్రం 2030 నాటికి 6.68 మిలియన్‌ టన్స్‌ ఆఫ్‌ ఆయిల్‌ ఈక్వలెంట్‌ ఇంధనాన్ని ఆదా చేయాలని బీఈఈ నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఉన్న రంగాలతోపాటు కొత్త రంగాల్లోని వినియోగదారులను గుర్తించడంలో ఫిక్కీకి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎనర్జీ కన్జర్వేషన్‌ మిషన్‌ (ఏపీఎస్‌ ఈసీఎం) తోడుగా నిలుస్తుంది. ఫిక్కీ ఇతర రాష్ట్రాలు, దేశాలు అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులు, కొత్త సాంకేతికతలను అధ్యయనం చేసి ఏపీకి అన్వయిస్తుంది.

రాష్ట్ర పరిశ్రమల శాఖ సహకారంతో పాట్‌ పథకం సైకిల్‌–1లో దాదాపు రూ.1,600 కోట్ల విలువైన 2,386 మిలియన్‌ యూనిట్ల ఇంధనానికి సమానమైన దాదాపు 0.20 మిలియన్‌ టన్స్‌ ఆఫ్‌ ఆయిల్‌ ఈక్వలెంట్‌ మేర ఇంధనాన్ని పొదుపు చేయగలిగింది. సైకిల్‌–2లో దాదాపు రూ.2,356.41 కోట్ల విలువైన 3,430 మిలియన్‌ యూనిట్లకు సమానమైన 0.295 మిలియన్‌ టన్స్‌ ఆఫ్‌ ఆయిల్‌ ఈక్వలెంట్‌ను ఆదా చేసింది. పాట్‌ పథకం ప్రస్తుతం 13 రంగాల్లో 1,073 డీసీల (భారీ ఇంధనం ఉపయోగించే పరిశ్రమల)ను కవర్‌ చేస్తుంది. ఇవి పారిశ్రామిక ఇంధన వినియోగంలో సగం మాత్రమే. కనీసం 80 శాతాన్ని కవర్‌ చేయడానికి ఈ పథకంలో రవాణా, విమాన యానం, ఆస్పత్రులు, విశ్వవిద్యాలయాలు, షిప్పింగ్‌ వంటి అదనపు రంగాలను బీఈఈ చేర్చింది. 

వేగంగా ‘పాట్‌’ అమలు 
దేశంలోని మొత్తం ఇంధనంలో 40 శాతం పారిశ్రామిక రంగం మాత్రమే వినియోగిస్తోంది. భవిష్యత్‌లో ఈ రంగంలో ఇంధన వినియోగం భారీగా పెరగనుంది. ఈ నేపథ్యంలో ఏపీ వంటి రాష్ట్రాల్లో వేగంగా పాట్‌ పథకాన్ని అమలు చేయడంలో సహకారం అందించేందుకు ఫిక్కీని ఎక్స్‌పర్ట్‌ ఏజెన్సీగా నియమించింది. 
– అభయ్‌ భాక్రే, డైరెక్టర్‌ జనరల్, బీఈఈ 

ఫిక్కీ సహకారం శుభపరిణామం 
పారిశ్రామిక రంగానికి నాణ్యమైన, నిరంతర విద్యుత్‌ సరఫరా అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. పరిశ్రమల్లో ఇంధన పొదుపు కార్యక్రమాల అమలులో ఏపీకి మద్దతిస్తూ.. ఫిక్కీని ఎక్స్‌పర్ట్‌ ఏజెన్సీగా బీఈఈ నియమించడం శుభపరిణామం. 
– బి. శ్రీధర్, కార్యదర్శి, ఇంధన శాఖ 

మరిన్ని వార్తలు