గంజాయి.. ఇక సాగదోయి!

29 Oct, 2020 04:56 IST|Sakshi

సాగును అడ్డుకునేందుకు ఎక్సైజ్‌ శాఖ ‘స్పెషల్‌ ఆపరేషన్‌’ 

విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో ఏజెన్సీ కేంద్రంగా సాగు చేయిస్తున్న స్మగ్లర్లు 

2019–20లో 31,360 కిలోల గంజాయి పట్టివేత 

నేడు నోడల్‌ అధికారులతో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో సమావేశం 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గంజాయి సాగు, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు ఎక్సైజ్‌ శాఖ రంగం సిద్ధం చేసింది. ఇకపై మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు కార్యాచరణను సిద్ధం చేసింది. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ కేంద్రంగా గంజాయి సాగు.. అక్రమ రవాణా జరుగుతోంది. విశాఖ ఏజెన్సీలో స్మగ్లర్లు అక్కడి గిరిజనులతో గంజాయి సాగు చేయిస్తూ..  పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారు.  

పాడేరు కేంద్రంగా ‘స్పెషల్‌ ఆపరేషన్‌’ 
► నవంబర్‌ నుంచి గంజాయి సాగు సీజన్‌ ఆరంభం కానుంది. ఈ ఏడాది సాగును అడ్డుకునేందుకు ఎక్సైజ్‌ శాఖ ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం రాష్ట్ర నోడల్‌ అధికారిగా ఎక్సైజ్‌ శాఖ అదనపు కమిషనర్‌ కేఎల్‌ భాస్కర్‌ను ప్రభుత్వం నియమించింది.  
► 2020–21లో సాగును పూర్తిగా నియంత్రించేందుకు అన్ని రాష్ట్రాలతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో గురువారం సమావేశం నిర్వహించనుంది.  
► స్పేస్‌ టెక్నాలజీ  సమాచారంతో నవంబర్‌లో మొదలయ్యే గంజాయి సాగును నిర్మూలించేందుకు విశాఖ జిల్లా పాడేరు కేంద్రంగా ‘స్పెషల్‌ ఆపరేషన్‌’ నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించారు.  

గత ఏడాది 31,360 కేజీల గంజాయి సీజ్‌ 
2019 సెప్టెంబర్‌ 1 నుంచి 2020 ఆగస్టు 31 వరకు గడచిన ఏడాది కాలంలో 31,360 కేజీల గంజాయిని సీజ్‌ చేసి.. 512 ఎకరాల్లో గంజాయి తోటలను ఎక్సైజ్‌ శాఖ ధ్వంసం చేసింది. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లోని 17 గ్రామాల్లో గంజాయి నిర్మూలన కార్యక్రమాలు నిర్వహించి 25.62 లక్షల గంజాయి మొక్కల్ని తొలగించింది. అదే గ్రామాల్లో 358 కేజీల ఎండు గంజాయిని తగులబెట్టారు. 

పోలీసుల సహకారం తీసుకుంటాం 
విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలతోపాటు నల్లమల అటవీ ప్రాంత పరిధిలోని జిల్లాల్లోనూ గంజాయి సాగును గుర్తించాం. సాగును నిర్మూలించేందుకు, అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కార్యాచరణ రూపొందించాం. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సూచనలకు అనుగుణంగా చర్యలు చేపడతాం. ఈ విషయంలో పోలీసుల సహకారం తీసుకుంటాం. 
– కేఎల్‌ భాస్కర్, నోడల్‌ అధికారి, ఎక్సైజ్‌ అదనపు కమిషనర్‌   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు