లాక్‌డౌన్‌ తర్వాత ఏపీలోనే వ్యాపార లావాదేవీలు అధికం

12 Apr, 2021 05:00 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధిక వృద్ధిరేటు నమోదు చేసిన రాష్ట్రం

అంతకుముందు ఏడాదితో పోలిస్తే వ్యాపార లావాదేవీల్లో 8.83% వృద్ధి

గత జూన్‌ నుంచి ఈ ఏడాది మార్చి వరకు రూ.24,386.66 కోట్ల జీఎస్టీ లావాదేవీలు

జీఎస్టీ కౌన్సిల్‌ గణాంకాల్లో వెల్లడి

సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌ తర్వాత ఆర్థికవ్యవస్థ వేగంగా పుంజుకున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో లాక్‌డౌన్‌ తర్వాత జూన్‌ నుంచి మార్చి వరకు జరిగిన వ్యాపార లావాదేవీల్లో వృద్ధి నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ఉన్న మహారాష్ట్రల్లో క్షీణత నమోదయితే మన రాష్ట్రంలో ఏకంగా 8.83 శాతం వృద్ధి నమోదైంది. దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధిక వృద్ధిరేటు నమోదు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది. జీఎస్టీ కౌన్సిల్‌ విడుదల చేసిన గణాంకాల ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి.

2020 జూన్‌ నుంచి 2021 మార్చి వరకు మన రాష్ట్రంలో జీఎస్టీ పరిధిలోకి వచ్చే వ్యాపార లావాదేవీలు 8.83 శాతం వృద్ధితో రూ.22,407.46 కోట్ల నుంచి రూ.24,386.66 కోట్లకు చేరినట్లు ఈ గణాంకాల్లో పేర్కొన్నారు. దీనిద్వారా రాష్ట్రంలో జీఎస్టీ ఫైలింగ్‌ ఎంత బాగా జరుగుతోందన్న విషయం కూడా తెలుస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. జీఎస్టీ వ్యాపార లావాదేవీలు కేవలం ఆ రాష్ట్రంలో జరిగిన వ్యాపార లావాదేవీలను తెలియచేస్తాయి. అంతర్‌ రాష్ట్ర జీఎస్టీ (ఐజీఎస్టీ) బదలాయింపుల తర్వాత ఆ రాష్ట్రానికి వచ్చిన తుది జీఎస్టీ ఆదాయం లెక్కిస్తారు.

ఆదుకున్న సంక్షేమం: ఇదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల్లో మన రాష్ట్రంలోనే వ్యాపార లావాదేవీల్లో వృద్ధి నమోదైంది. గత ఏడాది జూన్‌ నుంచి ఈ ఏడాది మార్చి వరకు వ్యాపార లావాదేవీలను పరిగణనలోకి తీసుకుంటే అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే కర్ణాటకలో 0.18%, తెలంగాణలో 0.81%, కేరళలో 1.07%, తమిళనాడులో 3.78% వృద్ధి మాత్రమే నమోదైంది. కోవిడ్‌ సంక్షోభ సమయంలో మన రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో ఆర్థికవ్యవస్థలో నగదు లభ్యత పెంచే విధంగా చర్యలు తీసుకోవడమే దీనికి కారణమని వాణిజ్యపన్నుల అధికారులు పేర్కొంటున్నారు. 

మరిన్ని వార్తలు