సీఎం చెప్పినవన్నీ అక్షర సత్యాలే

24 Sep, 2022 08:06 IST|Sakshi

ప్రభుత్వం చేసిన లావాదేవీల నిబద్ధతను కాగ్‌ ప్రశ్నించనేలేదు

యనమల అబద్ధాలపై మంత్రి బుగ్గన మండిపాటు

సాక్షి, అమరావతి : రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో చెప్పినవన్నీ అక్షరసత్యాలేనని ఆర్థిక, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ స్పష్టంచేశారు. వీటిని జీర్ణించుకోలేకే టీడీపీ నేత, మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రివిలేజ్‌ నోటీసు ఇవ్వాలంటూ ఆక్రోశం వెళ్లగక్కుతున్నారని బుగ్గన మండిపడ్డారు. ప్రభుత్వం చేసిన లావాదేవీలను కాగ్‌  అసలు ప్రశ్నించలేదని, కేవలం విధానపరమైన అభ్యంతరాలనే వ్యక్తంచేసిందని బుగ్గన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన ఇంకా ఏం తెలిపారంటే..  

నివేదికలో తొలి నాలుగేళ్లు టీడీపీ పాలనపైనే..
టీడీపీ హయాంలో జరిగిందేమిటో.. గత మూడున్నర ఏళ్లలో ఆర్థిక నిర్వహణ ఎలా ఉందో అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రజలందరికీ సీఎం వివరించారు. కాగ్‌ తన నివేదికలో 2020–21 సంవత్సరపు ఆర్థిక పరిస్థితిపైనా, అంతకుముందు 2015–16 నుంచి 2020–21 సంబంధించిన ఆర్థిక అంశాలపైనా వ్యాఖ్యానించింది. నివేదికలోని అంశాల్లో తొలి నాలుగేళ్ల టీడీపీ పరిపాలనలోని ఆర్థిక వ్యవహారాలపైనే అనేది గ్రహించాలి. ఇందులో టీడీపీ పాలనలో జరిగిన ఆర్థిక ఉల్లంఘనలు, అవకతవకలున్నాయి.

టీడీపీ పాలనలో ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు విరుద్ధంగా సుమారు రూ.17వేల కోట్లు అదనంగా అప్పుచేస్తే దానిని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గుర్తించి తీవ్రంగా తప్పుబట్టింది. టీడీపీ పాలనలో అతిక్రమించి చేసిన అదనపు అప్పులను కారణంగా చూపి, ఇప్పుడు మా పాలనలో అప్పులు చేయరాదని నిర్దేశించింది. ఎఫ్‌ఆర్‌బీఎంను ఉల్లంఘించి అప్పులు ఎక్కువగా ఎవరు చేశారనేది ప్రజలు గ్రహించ లేరనుకుంటున్నారా? కాగ్‌ నివేదికలో ప్రధానంగా పేర్కొన్న అంశం.. లావాదేవీల సర్దుబాట్లకు సంబంధించినది. ప్రత్యేక బిల్లులపై ఆర్థికమంత్రి హోదాలో నేను గతంలోనే దీనిపై వివరంగా సమాధానం చెప్పాను. 

ప్రత్యేక బిల్లులు యనమల సమయంలోనూ జరిగాయి..
సీఎఫ్‌ఎంఎస్‌ రిపోర్టింగ్‌ విధానంలో బుక్‌ అడ్జస్ట్‌మెంట్‌ లావాదేవీలను గుర్తించేందుకు మాత్రమే ప్రత్యేక బిల్లులు అంటారు. ఈ వ్యవహారంలో ఎలాంటి నగదు లావాదేవీలు జరగవని యనమలకు బాగా తెలుసు. కానీ, ఆయన ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు, లేనిపోని అభాండాలు వేస్తున్నారు. 2018–19లో టీడీపీ ప్రభుత్వం ఇదే విధంగా 98,049 బుక్‌ అడ్జస్ట్‌మెంట్స్‌ లావాదేవీలను ప్రత్యేక బిల్లులుగా చూపిన విషయం మర్చిపోయారా? అప్పుడు ఆర్థికమంత్రి మీరే కదా? యనమల పేర్కొంటున్న రూ.26,839 కోట్ల ప్రత్యేక బిల్లులు నగదు లావాదేవీలు కావు. అవి కేవలం బుక్‌ అడ్జస్ట్‌మెంట్‌ మాత్రమే. ఈ లావాదేవీల సర్దుబాట్లకు కారణం సీఎఫ్‌ఎంఎస్‌లో సెంట్రలైజ్డ్‌ ప్రాసెసింగ్‌ సాఫ్ట్‌వేర్‌ మాడ్యూల్‌ లేకపోవడమే.

లావాదేవీల నిబద్ధతను కాగ్‌ ప్రశ్నించలేదు..
ఇక మా ప్రభుత్వం చేసిన లావాదేవీల నిబద్ధతను కాగ్‌ ప్రశ్నించనేలేదు. కేవలం విధానపరమైన విషయంలో మాత్రమే వారు అభ్యంతరం లేవ నెత్తారు. ఈ సమస్యలన్నీ కూడా సీఎఫ్‌ఎంఎస్‌ వ్యవస్థను పటిష్టంగా రూపొందించకపోవడంవల్లే. ఈ కారణంగానే  2020–21లో ప్రత్యేక బిల్లుల ప్రక్రియను వినియోగించాం. దానిని సరిదిద్ది, గత 9 నెలలుగా కాగ్‌ సలహాల మేరకు స్పెషల్‌ బిల్లుల విధానం అనేది లేకుండా ‘నిల్‌ అడ్జస్ట్‌మెంట్‌ బిల్లుల’ పద్ధతిలో జమా ఖర్చుల నిర్వహణ జరుగుతోంది. ఇలా రూ 9,124.57 కోట్లకు సంబంధించిన 16,688 బుక్‌ అడ్జస్ట్‌మెంట్‌ లావాదేవీలు జరిగాయి.

యనమల తీరుకు చింతిస్తున్నా..
16,672 లావాదేవీల సర్దుబాట్లు ఒక పీడీ ఖాతా నుంచి మరో పీడీ ఖాతాలోకి మార్చేటపుడు తలెత్తిన లోపాలు మాత్రమే. ఏపీ ఫైనాన్స్‌ కోడ్‌ 271 (4) ఆర్టికల్‌ ప్రకారం.. ఆర్థిక సంవత్సరం ముగిసే సమయంలో ఆయా పీడీ అకౌంట్లలో ఖర్చుకాకుండా మిగిలిన నిధులను ఈ బుక్‌ అడ్జస్ట్‌మెంట్‌ లావాదేవీల ద్వారా ట్రెజరీ అధికారులు పూర్తిగా మురిగిపోయేటట్లుగా చేస్తారు. దీనికి సంబంధించి పదేపదే నేను వివరణలు ఇస్తున్నా అది విజ్ఞులైన యనమల ముందు బధిర శంఖారావంలా మారిపోయిందని చెప్పడానికి చింతిస్తున్నాను. 

కోవిడ్‌వల్లే వృద్ధి తగ్గింది
ఇక 2020–21లో అతి తక్కువ వృద్ధిరేటు నమోదైందని కాగ్‌ వెల్లడించినట్లు యనమల చెప్పారు. కరోనాతో ఆ ఆర్థిక సంవత్సరం దేశమంతా అతలాకుతలమైంది. ఇది ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ప్రభావం చూపిందనే విషయాన్ని యనమల కావాలనే విస్మరించడం సబబేనా? అలాగే, కాగ్‌ నివేదికలో ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు మన రాష్ట్రంలో బాగాలేదని, సరిచేసుకోవాల్సిన అవసరముందని వ్యాఖ్యానించింది. నిజానికి.. రాష్ట్ర విభజన, అనంతర టీడీపీ ఆర్థిక అస్తవ్యస్త పాలన, కోవిడ్‌ మహమ్మారి విలయతాండవం వంటి కారణాలవల్ల మన ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతిన్నది. అయినా మా ప్రభుత్వం మెరుగైన ఆర్థిక నిర్వహణ చేస్తూ ఇబ్బందులను చక్కదిద్దుతోంది. 2020–21 సంవత్సరానికి రెవెన్యూ వ్యయం 11 శాతం, రెవెన్యూ లోటు 34 శాతంగా ఉందని కాగ్‌ నివేదిక పేర్కొంది. ఆ సమయంలో కరోనా విలయతాండవం గురించి రాష్ట్ర ప్రజలకు తెలియని అంశంకాదు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో సుమారు రూ.8 వేల కోట్లు తగ్గింది. ఆ సమయంలో మహమ్మారి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.7,130 కోట్లు వ్యయంచేసింది. 

యనమల అప్రజాస్వామికవాది..
సభను ఏకపక్షంగా నిర్వహిస్తున్నామని యనమల విమర్శించడం విడ్డూరంగా ఉంది. యనమలా.. మీకు రాజకీయ భిక్షపెట్టి, ఒక తండ్రిగా, ఒక గురువుగా చేరదీసిన ఎన్టీ రామారావుకే మీరు స్పీకర్‌గా ఉంటూ నామం పెట్టిన మహానుభావులు. ఎన్టీ రామారావుపై చెప్పులు వేయించిన చంద్రబాబు పార్టీకి దొడ్డిదారిన సహకరించిన అప్రజాస్వామికవాది మీరు. అలాంటి మీరు కూడా ప్రజాస్వామ్యం గురించి, చట్టసభల ఔన్నత్యాన్ని గురించి 
మాట్లాడే వారే! 

మీ పాలన పుణ్యమే..
యనమలా.. మీ పాలన పుణ్యమా అని స్థానిక సంస్థలు చాలా కాలంగా డిస్కంలకు (విద్యుత్‌ సంస్థలకు) కరెంటు బిల్లులు చెల్లించడంలేదు. ఆ బకాయిలు ఇంచుమించు రూ.5,000 కోట్లకు చేరాయి. ఫలితంగా డిస్కంలు ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తున్నాయి. ఈ బకాయిలవల్ల డిస్కంలు స్థానిక సంస్థలకు కరెంటు సరఫరా నిలిపేస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆ బకాయీలన్నింటినీ 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి చెల్లించింది. కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన 14వ ఆర్థిక సంఘం మార్గదర్శకాల్లో ఉన్న సౌలభ్యాన్నే ఇందుకు వాడుకున్నాం. ఈ చెల్లింపులనూ యనమల రాద్ధాంతం చేస్తున్నారు. అయితే, మేం తీసుకున్న చర్యలను సమర్థిస్తూ అలా చేయడం సబబేనని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ బకాయిలు చెల్లించకపోతే కాగ్‌ తీవ్రంగా విమర్శించి ఉండేది.

ప్రజల ఖాతాల్లోకి రూ.57,512 కోట్లు జమ
ఆ కష్టకాలంలో రెక్కాడితే గాని డొక్కాడని ప్రజలందరూ ఉపాధి కోల్పోయి సురక్షితంగా ఉండటానికి తాపత్రయపడ్డారు. ఈ తరుణంలో వారందరి ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై పడింది. ఓ వైపు ఆదాయ వనరులు పడిపోతున్నా ఏమాత్రం జంకకుండా డీబీటీ (డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌) ద్వారా ప్రజల ఖాతాల్లోకి నేరుగా రూ 57,512 కోట్లు జమచేసి వారిని ఆదుకున్నాం. ఇంత మొత్తంలో ఓ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఖాతాల్లో జమచేసిన సందర్భం కోవిడ్‌ సమయంలో ఎక్కడాలేదు.

మరిన్ని వార్తలు