-

ఏపీ ఈఏపీసెట్‌లో ఇంటర్‌ వెయిటేజీ రద్దు

18 May, 2022 04:40 IST|Sakshi

ప్రవేశ పరీక్ష మార్కులకే వందశాతం వెయిటేజీ

సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన ఏపీ ఈఏపీసెట్‌ 2022–23లో ఇంటర్‌ మార్కుల వెయిటేజీని రద్దుచేశారు. ఈఏపీ సెట్‌లో వచ్చిన మార్కులనే పూర్తిగా వందశాతం వెయిటేజీ కింద తీసుకోనున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్‌ బి. సుధీర్‌ప్రేమ్‌కుమార్‌ మంగళవారం ప్రకటన విడుదల చేశారు.

ఏపీ ఈఏపీసెట్‌లో ఇప్పటివరకు ఇంటర్‌ మార్కులకు 25 శాతం.. ఈఏపీసెట్‌లోని మార్కులకు 75 శాతం వెయిటేజీ ఇచ్చి విద్యార్థులకు ర్యాంకులను ప్రకటించేవారు. అయితే.. కరోనా కారణంగా ఇంటర్మీడియెట్‌ తరగతుల నిర్వహణకు ఆటంకాలు ఏర్పడడం, పరీక్షల నిర్వహణ కూడా అస్తవ్యస్థంగా మారడం తెలిసిందే. దీంతో ఇంటర్‌ బోర్డు ‘ఆల్‌పాస్‌’ నిర్ణయం తీసుకుంది.

ఈ నేపథ్యంలో.. 2021–22 ఈఏపీ సెట్‌లో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీని ప్రభుత్వం రద్దు చేసింది. ప్రస్తుత సెకండియర్‌ ఇంటర్‌ విద్యార్థులకు గతేడాది పరీక్షల నిర్వహణలేక వారిని ఆల్‌పాస్‌గా ప్రకటించింది. మార్కుల బెటర్‌మెంట్‌ కోసం వారికి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించింది.

ఈ పరిస్థితుల్లో ఈ విద్యా సంవత్సరం (2022–23)లో కూడా ఈఏపీసెట్‌లో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ ఇవ్వాలా? వద్దా అనే అంశంపై ఉన్నత విద్యామండలి ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిని పరిశీలించిన ఉన్నత విద్యాశాఖ ఈసారి కూడా ఈఏపీసెట్‌లో  సెట్‌లో వచ్చిన మార్కులకే వందశాతం వెయిటేజీ ఇచ్చి వాటి మెరిట్‌ ఆధారంగా ర్యాంకులు ప్రకటించాలని ఉన్నత విద్యామండలికి సూచించింది. దీంతో మండలి తాజాగా ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

2.60 లక్షల మందికి పైగా విద్యార్థుల దరఖాస్తు
ఇక ఏపీ ఈఏపీసెట్‌కు ఉన్నత విద్యామండలి ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈనెల 10వ తేదీతో ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు గడువు ముగియగా మొత్తం 2.60 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌కు 1,88,417 మంది, బైపీసీ స్ట్రీమ్‌కు 86వేల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేశారు. ఆలస్య రుసుముతో ఈ సంఖ్య మరికొంత పెరగనుంది. జూలై 4 నుంచి 8 వరకు పది సెషన్లలో ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ విద్యార్థులకు.. అలాగే, జూలై 11, 12 తేదీల్లో నాలుగు సెషన్లలో బైపీసీ స్ట్రీమ్‌ విద్యార్థులకు  ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.  

మరిన్ని వార్తలు