నాకు అక్కడ ఓట్లు వేయించు.. నీకు ఇక్కడ ఓట్లు వేయిస్తా!

10 Feb, 2021 07:57 IST|Sakshi

పంచాయతీ వార్డుల్లో ఒప్పంద రాజకీయాలు

పరస్పరం సహకరించుకునేలా సర్దుబాట్లు

సాక్షి, అమలాపురం ‌: ‘‘నా వార్డులో మీ వాళ్ల ఓట్లు ఉన్నాయి. నేను వేరే వార్డులో పోటీ చేస్తున్నాను. ఆ వార్డులో మీ వాళ్ల ఓట్లు ఉన్నాయి. అక్కడ నువ్వు నాకు ఓట్లు వేయించు...ఇక్కడ నేను నీకు ఓట్లు వేయిస్తా. నీకూ ఇబ్బంది లేకుండా.. నాకూ ఇబ్బంది లేకుండా రెండు వార్డుల్లో పరస్పరం సహకరించుకుందాం. పార్టీలతో మనకెందుకు గొడవ.. మనిద్దరం సర్దుబాట్లతో ఎవరి ఓట్లు వారు వేయించుకుని సహకరించుకుందాం..’’ 

ఇదీ జిల్లాలో పలు పంచాయతీల్లో వార్డులకు పోటీ చేస్తున్న కొందరు అభ్యర్థుల ఒప్పంద రాజకీయాలు. తమ గెలుపునకు ఎలాంటి సమస్యలు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పంచాయతీల్లో వార్డులకు వచ్చేసరికి ఏ వార్డులో ఓటు ఉంటే ఆ వార్డులోనే పోటీ చేయాలన్న నిబంధనలేమీ లేదు. పంచాయతీలో ఓటరై ఉంటే ఆ పంచాయతీలో గెలుపునకు అవకాశం ఉన్న ఏ వార్డులోనైనా పోటీ చేయవచ్చు. దీంతో తమకు అనువుగా ఉన్న వార్డులను ఎంపిక చేసుకుని బరిలోకీ దిగుతున్నా.. తన సొంత వార్డులో ఉన్న తన వాళ్లు.. తన కుటుంబాల వారు ఉంటే తాను పోటీ చేసే వేరే వార్డు అభ్యరి్థతో ఒప్పందం చేసుకుంటున్నారు. నా వార్డులో నీకు మా వాళ్ల చేత ఓట్లన్నీ వేయిస్తాను. నీ వార్డులో మీ వాళ్లతో నాకు ఓట్లు వేయించి గెలిపించు అంటూ పరస్పర అవగాహనతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. అదే సర్పంచి అభ్యరి్థత్వానికి వచ్చే సరికి ఈ ఒప్పందాలు, సర్దుబాట్లు ఉండవు.

సర్పంచ్‌ అభ్యర్థులు తమ గ్రామంలో ఉన్న అన్ని వార్డుల నుంచి తమ తరపున వార్డుల్లో అభ్యర్థులను నిలబెట్టి ఓ ప్యానల్‌ తయారు చేసుకుంటారు. అయితే ఈ ప్యానల్‌లో ఉన్నట్టే ఉండి లోపాయికారీ ఒప్పందాలతో కొందరు వార్డు అభ్యర్థులు పరస్పర అవగాహనతో నాకు నువ్వు....నీకు నేను అన్నట్లుగా చాప కింద నీరులా వ్యవహారాలను చక్కబెట్టేస్తున్నారు. తన వార్డులో తనకు అనుకూలమైన ఓట్లు ఉన్నా, ఎప్పటి నుంచో ఓ నాయకుడు కరీ్చఫ్‌ వేసినట్టుగా అదే వార్డులో పోటీ చేయడంతో తమకు అనుకూలమైన పక్క వార్డును ఎంచుకుని కొందరు పోటీకి సై అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఒప్పంద రాజకీయాలు జరుగుతున్నాయి. ఉదాహరణకు మేజర్‌ పంచాయతీ  అంబాజీపేట (మాచవరం)లో నాలుగైదు వార్డుల్లో ఈ తరహా ఒప్పందాలు జరిగాయి. పి.గన్నవరం, మలికిపురం, ఉప్పలగుప్తం, అల్లవరం, అమలాపురం రూరల్, ముమ్మిడివరం మండలాల్లోని పలు పంచాయతీల వార్డుల్లో ఈ పరస్పర అవగాహనలు జరుగుతున్నాయి.  
చదవండి: ‘పవర్‌’ ఫుల్‌ ఏపీ ..‘రియల్‌ టైమ్‌’ హీరో 
చిత్తూరు జిల్లాలో టీడీపీ అడ్డదారులు

>
మరిన్ని వార్తలు