‘కృష్ణా’లో ఫలితం తేల్చిన ఒక్క ఓటు..

14 Feb, 2021 08:21 IST|Sakshi
సత్యనారాయణ

రెండో విడతలో గండేపూడి..

తొలి విడతలో కందలంపాడు

అతి చిన్న పంచాయతీల్లో ఒక్క ఓటుతో గెలుపొందిన అభ్యర్థులు

సాక్షి, అమరావతిబ్యూరో: కృష్ణా జిల్లాలోని అతిచిన్న పంచాయతీ అయిన నందివాడ మండలం గండేపూడి గ్రామ పంచాయతీకి శనివారం ఎన్నిక జరిగింది. అక్కడ బరిలో నిలిచిన సర్పంచి అభ్యర్థి ఒకే ఒక్క ఓటుతో విజయం సాధించారు. ఈ గ్రామ జనాభా 196 కాగా ఓటర్లు 150 మంది. సర్పంచి పదవి కోసం వైఎస్సార్‌సీపీ మద్దతుదారు కర్నాటిక సత్యనారాయణ, టీడీపీ బలపరచిన భీమవరపు పార్వతిలు పోటీ పడ్డారు.

150 ఓట్లలో 142 ఓట్లు పోలయ్యాయి. వీటిలో సత్యనారాయణకు 71 ఓట్లు, పార్వతికి 70 ఓట్లు పోలవగా నోటాకు ఒక ఓటు వేశారు. దీంతో సత్యనారాయణ ఒక్క ఓటు మెజారిటీతో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. అతి తక్కువ ఓట్లున్న ఈ గ్రామ ఫలితమే జిల్లాలో తొలిసారిగా వెలువడింది. కాగా, తొలివిడతలో విజయవాడ డివిజన్‌లోకెల్లా చిన్న గ్రామమైన కంకిపాడు మండలం కందలంపాడు పంచాయతీ సర్పంచ్‌ అభ్యర్థి బాయిరెడ్డి నాగరాజు ఒక్క ఓటుతోనే గెలుపొందారు. నాగరాజుకు 103, ప్రత్యర్థి సుబ్రహ్మణ్యంకు 102 ఓట్లు వచ్చాయి. దీంతో నాగరాజు ఒక్క ఓటు మెజార్టీతో సర్పంచి పదవి దక్కించుకున్నారు.
(చదవండి: ఎన్టీఆర్‌ అత్తగారి ఊళ్లో టీడీపీ ఓటమి)
మూడో విడత ఏకగ్రీవాల జోరు 

మరిన్ని వార్తలు