ఏవోబీలో భారీ మావోయిస్ట్‌ డంప్‌ స్వాధీనం

29 Oct, 2020 20:15 IST|Sakshi

భీమారం: ఆంధ్రప్రదేశ్‌- ఒడిశా సరిహద్దులోని స్వాభిమాన్‌ అంచల్‌లోని పేపర్‌మెట్ల పోలీసులు భీమారం రిజర్వ్‌ ఫారెస్ట్‌లో మావోయిస్టుల భారీ డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇంటెలిజెన్స్‌ సమాచారం మేరకు.. భీమారం అటవీ సమీపంలోని గుణమాముడి గ్రామ సమీపంలో బుధవారం భద్రతా బలగాలు నక్సల్స్‌ కోసం ఆపరేషన్‌ను ప్రారంభించాయి. ఈ క్రమంలో మావోయిస్టులకు పోలీసులు తారపడడంతో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. సంఘటనా స్థలం నుంచి నక్సల్స్‌ తప్పించుకున్నారు. గురువారం సంఘటనా స్థలంలో పోలీసులు తనిఖీలు చేపట్టగా.. పేలుడుకి వినియోగించే ఐఈడీలు, 7.62 మిమీ ఎస్‌ఎల్‌ఆర్ లైవ్ రౌండ్లు 11, నాలుగు 7.62 మిమీ ఏకే రౌండ్లు, ఒక 5.56 మిమీ ఇన్‌సాస్ రౌండ్లు, ఎస్‌ఎల్‌ఆర్ మ్యాగజైన్, 32 డిటోనేటర్లు, ఒక ఫ్లాష్ కెమెరా, రేడియో, 11 కిట్ బ్యాగులు, మూడు మావోయిస్టు యూనిఫాంలు, విప్లవ సాహిత్యంతో పాటు రోజు వారి అవసరాలకు వినియోగించే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. (చదవండి: మావోయిస్ట్‌ గడ్డపై తిరుగుబాటు)

పోలీసులే లక్ష్యంగా దాడులకు దిగి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు పోలీస్‌ అధికారులు తెలిపారు. ఇంతకు ముందు సోమవారం భద్రతా దళాలు స్వాభిమాన్‌ అంచల్‌లోని జోడాంబో పోలీస్‌స్టేషన్‌ పరిదిలోని గురాసేటు, బీజింగ్‌, జంప్లూర్‌, పర్లుబంధ గ్రామాల నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండును స్వాధీనం చేసుకున్నారు.


 

మరిన్ని వార్తలు