తట్టులాగే.. మంకీపాక్స్‌ కూడా

28 Jul, 2022 04:47 IST|Sakshi

కోవిడ్‌లా వేగంగా వ్యాప్తి చెందదు

ప్రాణాంతకం కూడా కాదు..

సాధారణ మందులతోనే తగ్గుతుంది

కార్డియోథొరాసిక్‌ సర్జన్‌ డాక్టర్‌ సి.ప్రభాకర్‌రెడ్డి

కర్నూలు (హాస్పిటల్‌): ‘ఇంట్లో ఎవ్వరికైనా ఒంటిపై పొక్కులు వస్తే పెద్దవారు తట్టు పోసిందనో, ఆటలమ్మ వచ్చిందనో చెప్పి వెంటనే ఓ గదిలో ఉంచుతారు.  తేలికపాటి ఆహారం ఇస్తూనే తెల్లటి వస్త్రంపై పడుకోబెట్టి చుట్టూ వేపాకు మండలు పెడతారు. వేపాకు నూరి శరీరమంతా పూసి స్నానం చేయిస్తారు. ఇప్పుడు మంకీపాక్స్‌లో కూడా ఇదే జరుగుతుంది. దీనికి భయపడాల్సిన పనిలేదు. ఆటలమ్మ, తట్టు మాదిరిగానే ఇది కూడా ప్రాణాంతకం కాదు. కోవిడ్‌లా వేగంగా వ్యాప్తి చెందదు’ అని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల డిప్యూటీ సూపరింటెండెంట్, కార్డియోథొరాసిక్‌ సర్జన్‌ డాక్టర్‌ సి.ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. మంకీపాక్స్‌ గురించి ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని బుధవారం ఆయన ‘సాక్షి’కి వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

అరికట్టడం కష్టం కాదు
ఈ వైరస్‌ ఏమీ చేయదు. దీనిని అరికట్టడం పెద్ద కష్టమేమీ కాదు. మాస్క్, ఐసోలేషన్‌ ముఖ్యం. పారాసిటమాల్, సిట్రిజన్, ఆంపిక్లాక్స్‌ 500 ఎంజీ మాత్రలు రోజుకు రెండు చొప్పున పది రోజులు వేసుకోవాలి. మ్యూపరసిస్‌ లేదా బిటాడిన్‌ ఆయింట్‌మెంట్, కొబ్బరి నీళ్లు, తేలికపాటి ఆహారం తీసుకుంటూ  విశ్రాంతి తీసుకుంటే చాలు. బయట తిరగకూడదు. ఇంట్లో వారికీ దూరంగా ఉండాలి. ఒంటిపై పొక్కుల్లో నీరు చేరితే కొంచెం నొప్పి ఉంటుంది. త్వరగానే తగ్గిపోతుంది. మరీ పెద్దగా నొప్‌పైతే నీడిల్‌తో గుచ్చి బాక్ట్రోబాన్‌ ఆయింట్‌మెంట్‌ రాయాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. ఇలా ఓ పది రోజులుంటే అంతా సర్దుకుంటుంది. 

జాగ్రత్తగా ఉండాలి
మంకీపాక్స్‌ వైరస్‌ ఎవరిలో ఉందో తెలుసుకోవడం కష్టం. జలుబు వస్తే జాగ్రత్తగా ఉండాలి. ఇది తుమ్ముల తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఎక్కువసేపు కాంటాక్టులో ఉన్నా వస్తుంది. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు పొక్కులు ఉంటే వెంటనే అధికారులకు సమాచారం ఇస్తే ఐసోలేషన్‌లో ఉంచి మందులు ఇస్తారు. ప్రజలు సైతం ఇలాంటి వ్యక్తులను గుర్తించి ఆరోగ్య కార్యకర్తలకు, వాలంటీర్లకు తెలపాలి. ప్రజలు సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తే వ్యాప్తి ఆగిపోతుంది. 

ఇవీ లక్షణాలు
‘మంకీ పాక్స్‌’కు, మన దేశంలో అంతరించిన స్మాల్‌పాక్స్‌(తట్టు)కు, అడపాదడపా కనిపించే ఆటలమ్మ, చికెన్‌పాక్స్‌కు దగ్గర సంబంధం ఉంది. వారియోలా, వారిసెల్లా అనే వైరస్‌ల వల్ల వచ్చిన జబ్బులివి. ఇవంత ప్రాణాంతకం కావు. మంకీపాక్స్‌ సోకితే 5 నుంచి 21 రోజుల్లో శరీరంపై పొక్కులు వస్తాయి. జ్వరం, జలుబు, కండరాల నొప్పులు, నీరసం వస్తుంది. లింఫు గ్రంధుల వాపుంటుంది. గజ్జలు, చంకలో, మెడలో గడ్డలు వస్తాయి. పొక్కుల్లో కొన్నిసార్లు ద్రవం చేరి లావుగా మారి పగిలిపోతాయి. ఒక్కోసారి ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ వల్ల, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో సమస్యలు వస్తాయి. ఆయాసం, దగ్గు ఎక్కువగా ఉంటే ఆసుపత్రిలో చేరాలి.

మరిన్ని వార్తలు