ప్రమాదాల వేళ గోల్డెన్‌ అవర్‌లో స్పందించండి.. పోలీసుల సూచనలివీ 

12 Nov, 2022 09:29 IST|Sakshi

క్షతగాత్రులకు సాయం చేయడం సామాజిక బాధ్యతగా భావించండి 

ప్రజల్లో చైతన్యం తెచ్చే దిశగా కోనసీమ జిల్లా పోలీసు శాఖ

కేసులు, సాక్ష్యాల వంటి ఒత్తిళ్లు ఉండవని భరోసా

ఆస్పత్రికి తీసుకు వెళ్లి కాపాడిన వారికి రూ.5 వేల నజరానా

అమలాపురం టౌన్‌: రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు క్షతగాత్రులు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంటారు. కళ్లెదుటే ప్రమాదం జరిగినా రోడ్డుపై వెళ్లే ఎందరో అయ్యో పాపం! అంటూ నిట్టూర్చుతారు. ఆ కీలక సమయంలో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తే బతుకుతారనే చైతన్యం చూపేవారు అరుదుగా ఉంటారు. ప్రమాద స్థలం నుంచి ఆస్పత్రికి తరలిస్తే ఆ కేసులో తమనూ పెడతారేమో.. లేదా సాక్ష్యంగా నమోదు చేస్తారేమోననే భయాలే కారణం. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు క్షతగాత్రులు 108 అంబులెన్స్‌ వచ్చే వరకూ రోడ్డు పైనే విలవిలలాడుతున్నారు.

అలా కాకుండా ప్రమాదం జరిగిన మరుక్షణమే ఎవరో ఒకరు స్పందించి, ఆస్పత్రికి తరలిస్తే సకాలంలో వైద్యం అంది వారు బతుకుతారు. ఇలా క్షతగాత్రులను కాపాడినవారిని ‘సమారిటన్‌’ అని అంటున్నారు. ప్రమాదాలు జరినప్పుడు క్షతగాత్రులను రక్షించడంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేలా రాష్ట్ర పోలీసు శాఖ అవగాహన పెంచే ప్రయత్నం చేస్తోంది. కీలక సమయాల్లో ప్రజలను కాపాడిన వారికి గౌరవ సూచకంగా రూ.5 వేల నజరానా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ప్రమాద సమయాల్లో ప్రజలను కాపాడేందుకు ప్రజలు ఎందుకు వెనకడుగు వేస్తున్నారో తెలియజేస్తూ.. ఆ ఆపద సమయంలో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడం వల్ల ప్రాణాలను ఎలా కాపాడవచ్చో వివరిస్తూ ఐదు అంశాలతో కూడిన సందేశాత్మక బోర్డులను ప్రతి పోలీసు స్టేషన్లు, ముఖ్య కూడళ్లలో ఏర్పాటు చేసి, ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని 25 పోలీసు స్టేషన్లు, ఏడు సర్కిల్‌ కార్యాలయాలు, డీఎస్పీ కార్యాలయాల వద్ద ఆ బోర్డులను జిల్లా పోలీసు శాఖ ఏర్పాటు చేసింది. 

పోలీసుల సూచనలివీ.. 
ప్రమాదాల్లో చిక్కుకున్న క్షతగాత్రులను కాపాడిన వారిని పోలీసులు విచారణ, దర్యాప్తులో చేర్చరు. 
చెప్పాలనుకుంటే స్వచ్ఛందంగా సాక్ష్యం చెప్పవచ్చు. పోలీసుల నుంచి ఎటువంటి ఒత్తిడీ ఉండదు. ఆస్పత్రిలో ప్రథమ చికిత్సకు డబ్బులు వసూలు చేయరు. చికిత్స చేయడానికి వైద్యులు నిరాకరించరు. 
కాపాడిన వారు తమ గుర్తింపును వెల్లడించాల్సిన అవసరం లేదు. కాపాడిన వ్యక్తిని పోలీసు శాఖ గుర్తించి, రూ.5 వేల నజరానాకు ఎంపిక చేస్తుంది. కలెక్టర్‌ ఆ బహుమతి మంజూరు చేస్తారు. 
ప్రమాదానికి కారణమైన వారు కూడా క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించవచ్చు. అలా చేస్తే వారికి ప్రమాదం చేసి, తప్పించుకున్నారనే నేరం నుంచి మినహాయింపు లభిస్తుంది. 

పోలీసుల నుంచి పూర్తి సహకారం 
రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారిని కీలక సమయం(గోల్డెన్‌ అవర్‌)లో ఎవరైనా స్పందించి ఆస్పత్రికి తరలిస్తే వారి ప్రాణాలను కాపాడిన వారవుతారు. అలా చేసిన వారికి పోలీసు శాఖ నుంచి పూర్తి సహకారం ఉంటుంది. ప్రజల్లో ఈ చైతన్యం పెరగాలి. కేసులు, సాక్ష్యాలు అనే అపోహలు, భయాల నుంచి ప్రజలు బయటపడాలి. క్షతగాత్రుల ప్రాణాలను రక్షించడమే ప్రథమ కర్తవ్యం కావాలి. దీనిని సామాజిక బాద్యతగా భావించాలి. 
– సీహెచ్‌ సుధీర్‌కుమార్‌రెడ్డి, ఎస్పీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా

మరిన్ని వార్తలు