వరద బాధితులకు నగదు సాయం 

26 Jul, 2022 03:58 IST|Sakshi
కోనసీమ జిల్లా లంక ఆఫ్‌ ఠానేల్లంకలో ఇళ్లను చుట్టేసిన వరదనీరు

93,745 కుటుంబాలకు బ్యాంకు ఖాతాలో జమ 

బాధితులు ఇబ్బందులు పడకుండా అడుగడుగునా చర్యలు 

నగదు పంపిణీ గతంలో కాగితాలకు మాత్రమే పరిమితం 

మరో లక్ష కుటుంబాలకు నిత్యావసర వస్తువులు  

25 కిలోల బియ్యం, సరుకులు ఇంటింటికి వెళ్లి పంపిణీ 

సాక్షి, అమరావతి: వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూత ఇస్తోంది. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని రీతిలో బాధిత కుటుంబాలకు పెద్ద ఎత్తున నగదు సాయాన్ని అందించింది. ఇప్పటివరకు ఒక్కో కుటుంబానికి గరిష్టంగా రూ.2 వేల చొప్పున అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 93,745 కుటుంబాలకు పంపిణీ చేసింది. ఈ సాయాన్ని నేరుగా ఆ కుటుంబ పెద్ద బ్యాంకు ఖాతాలో జమచేశారు.

ఖాతాలో డబ్బులు జమచేసిన తర్వాత వలంటీర్లు, వీఆర్వోలు, తహసీల్దార్లు, ప్రత్యేక అధికారుల ద్వారా ప్రతి ఒక్కరికి డబ్బులు చేరాయో లేదో తనిఖీ చేయించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి గ్రామంలోను డబ్బులు వేసిన వారి జాబితాను త్వరలో ప్రదర్శించనున్నారు. గతంలో వరద బాధితులకు ఏ ప్రభుత్వం ఇలా నగదు సాయాన్ని అందించలేదు. విపత్తుల సమయంలో నగదు సాయం చేసినట్లు కాగితాల్లో చూపించడమే తప్ప ఎప్పుడూ ఇచ్చిన పాపాన పోలేదు. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం బాధితులకు ఆ సొమ్ము ఇవ్వడమే కాకుండా.. అది వారికి నిజంగా అందిందో లేదో కూడా విస్తృతంగా తనిఖీలు చేయిస్తోంది.  

విస్తృతంగా నిత్యావసరాల పంపిణీ 
అలాగే నిత్యావసర వస్తువుల పంపిణీ విస్తృతంగా జరుగుతోంది. ఇప్పటివరకు 98,982 కుటుంబాలకు 25 కిలోల బియ్యం, కిలో చొప్పున కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, లీటర్‌ నూనె, బ్రెడ్‌ ప్యాకెట్లు, బిస్కెట్‌ ప్యాకెట్లను ప్రభుత్వం బాధితులకు అందించింది. మొత్తం 150 టన్నుల కందిపప్పు, 152 టన్నుల ఉల్లిపాయలు, 159 టన్నుల బంగాళాదుంపలు, 1,28,933 లీటర్ల ఆయిల్, 1,36,800 లీటర్ల పాలు బాధితులకు అందజేశారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా వరద తగ్గకుండానే బాధితులకు సాయాన్ని పంపిణీ చేసిన ఉదంతాలు లేవు.

వరద వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయినప్పటి నుంచి ప్రభుత్వ యంత్రాంగం విరామం లేకుండా పనిచేసింది. ముంపు గ్రామాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అక్కడి నుంచి సహాయక శిబిరాలకు తీసుకెళ్లడం, అక్కడ వారికి భోజన సౌకర్యాలు కల్పించడం వరకు ప్రతి పనిని పకడ్బందీగా నిర్వహించింది. సహాయక చర్యలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 14.50 లక్షల ఆహార పొట్లాలు, 40 లక్షలకుపైగా వాటర్‌ ప్యాకెట్లను బాధిత గ్రామాల్లో పంపిణీ చేసింది.  

విస్తృతంగా పారిశుధ్య పనులు 
ప్రతి గ్రామంలో పారిశుధ్య పనులు పెద్దఎత్తున చేయిస్తున్నారు. గ్రామాల్లో పేరుకుపోయిన సిల్ట్, గార్బేజ్‌ను యంత్రాల సాయంతో తొలగించారు. నీళ్ల ట్యాంకులు శుభ్రం చేయడం, పైపులైన్లు క్లియర్‌ చేయడం, మోటార్లు రిపేరు చేసి పరిశుభ్రమైన మంచినీరు అందించే పనుల్ని పూర్తిచేశారు. 555 వైద్య శిబిరాలు నిర్వహించడంతోపాటు ప్రతి ఇంటికి వెళ్లి ఫీవర్‌ సర్వే చేస్తున్నారు. ఎవరికైనా అనారోగ్య లక్షణాలుంటే వెంటనే చికిత్స అందిస్తున్నారు.  

నగదు సాయం, నిత్యావసరాల పంపిణీ, సహాయక చర్యల కోసం ప్రభుత్వం ఆగమేఘాల మీద రూ.43.50 కోట్లు విడుదల చేసింది. అత్యధికంగా బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాకు రూ.14 కోట్లు, అల్లూరి జిల్లాకు రూ.10.50 కోట్లు, ఏలూరు జిల్లాకు రూ.9 కోట్లు, పశ్చిమగోదావరికి రూ.6 కోట్లు, తూర్పుగోదావరి జిల్లాకు రూ.4 కోట్లు విడుదల చేసింది. దెబ్బతిన్న తాగునీటి సరఫరా వ్యవస్థలు, విద్యుత్, రోడ్లు, చిన్నతరహా తాగునీటి పథకాలను వెంటనే పునరుద్ధరించేలా చేసింది. ఇందుకోసం రూ.18 కోట్లు అదనంగా విడుదల చేసింది. 

మరిన్ని వార్తలు