తొలిసారి ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా నగదు

1 Jun, 2021 04:22 IST|Sakshi

రెండేళ్ల వైఎస్‌ జగన్‌ పాలనలో 1.53 కోట్ల మంది ఎస్సీలకు రూ.22,529.58 కోట్ల లబ్ధి

46.82 లక్షల మంది ఎస్టీలకు రూ.6,646 కోట్ల ప్రయోజనం

రాష్ట్ర చరిత్రలో ఇంతమంది ఎస్సీ, ఎస్టీలకు లబ్ధి చేకూర్చిన తొలి సర్కారు ఇదే

గత సర్కారులో కార్పొరేషన్ల ద్వారా ప్రయోజనం ఎండమావిగానే..

గతంలో సిఫార్సులున్న, లంచాలిచ్చిన వారికే అరకొర సబ్సిడీ రుణాలు

ఇప్పుడు సిఫార్సులు, లంచాలు లేకుండా అర్హులందరికీ బ్యాంకు ఖాతాలకు నేరుగా లబ్ధి

గతంలో బ్యాంకు రుణాలు.. ఇప్పుడు నవరత్నాల ద్వారా నగదు        

ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ అవమానించిన గత సీఎం చంద్రబాబు  

సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు ప్రభుత్వ ఖజానా నుంచి నేరుగా నగదు బదిలీ జరిగింది. ఇది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండేళ్ల పాలనలోనే సాధ్యమైంది. గత చంద్రబాబు ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలకు బ్యాంకు రుణాలే గతిగా ఉండేవి. అలాంటి పరిస్థితులను ముఖ్యమంత్రి జగన్‌ మార్చేశారు. అర్హులైన ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి ప్రభుత్వ ఖజానా నుంచే నేరుగా నగదు బదిలీ చేశారు. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి, సంక్షేమంలో గత సర్కారుకు ఈ ప్రభుత్వానికి స్పష్టమైన మార్పు కొట్టిచ్చినట్లు కనిపిస్తోంది. గత ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలకు బ్యాంకు రుణాలే. అదీ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ విడుదల చేసిన వారికే బ్యాంకులు రుణాలు మంజూరు చేసేవి. గత ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు మంజూరు కావాలంటే సిఫార్సులతో పాటు దళారులకు లంచాలు ఇవ్వాల్సి వచ్చేది. అంతేకాకుండా వందిమాగదులకే అంటే మంత్రులు, అధికార పార్టీకి చెందిన పలుకుబడి గల వ్యక్తులకు చుట్టూ ఉండే వారికే బ్యాంకు రుణాలు మంజూరయ్యేవి.

చంద్రబాబు ఐదేళ్ల పాలనలో కార్పొరేషన్ల ద్వారా లక్షమంది ఎస్సీ, ఎస్టీలకు కూడా బ్యాంకు రుణాలు ఇవ్వలేదంటే ఆ వర్గాల సంక్షేమం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతోంది. గత సీఎం చంద్రబాబు ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ అవమానించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నవరత్నాలతోపాటు ఇతర పథకాల ద్వారా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రెండేళ్ల పాలనలోనే 1.53 కోట్ల మంది ఎస్సీలకు రూ.22,529.58 కోట్ల లబ్ధిచేకూర్చారు. 46.82 లక్షల మంది ఎస్టీలకు రూ.6,646 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం కలిగించారు. ఇందులో 1.06 కోట్ల మంది ఎస్సీలకు రూ.15,374.58 కోట్లు నేరుగా నగదు బదిలీ చేయగా మరో 47.67 లక్షల మందికి  నగదేతర బదిలీ పథకాల ద్వారా రూ.7,155.01 కోట్ల ఆర్థిక ప్రయోజనం చేకూరింది. 29.71 లక్షల ఎస్టీలకు రూ.4,915.86 కోట్లు నేరుగా నగదు బదిలీ చేయగా మరో 17.11 లక్షల మందికి  నగదేతర బదిలీ పథకాల ద్వారా రూ.1,731.02 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం కలిగింది.

► వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నవరత్నాల లబ్ధి పొందడానికి గత సర్కారు మాదిరిగా సిఫార్సులు, లంచాలు అవసరం లేకుండానే తరతమ భేదం లేకుండా అర్హులైన ఎస్సీ, ఎస్టీలందరినీ ఎంపిక చేశారు.
► మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేల సిఫార్సులతో సంబంధం లేకుండా, వివక్షలేకుండా వైఎస్సార్‌ నవశకం పేరుతో వలంటీర్ల ద్వారా అర్హులైన ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులను గుర్తింపచేశారు.
► కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా ఎస్సీ, ఎస్టీ వర్గాల ఇళ్లకే వలంటీర్లు వెళ్లి మరీ నవరత్నాల గురించి చెప్పడమే కాకుండా వారినుంచి దరఖాస్తులను తీసుకుని అర్హులను గుర్తించారు. ఇదంతా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో పాటు ఇచ్చిన మాటకు కట్టుబడే నైజం వల్లే సాధ్యమైందని అధికారవర్గాలతో పాటు లబ్ధిదారులు బాహాటంగా చెబుతున్నారు.
► గత సర్కారు ఈ వర్గాలను బ్యాంకు రుణాలకే పరిమితం చేయగా ఇప్పుడు ఈ సర్కారు ప్రభుత్వ నిధులతో ఉచితంగానే లబ్ధి చేకూర్చుతోంది. తద్వారా ఎస్సీ, ఎస్టీ వర్గాలు అర్థికంగా, సామాజికంగా మరింత మెరుగైన జీవనం సాగించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది.
► గత సర్కారులో ఎస్సీ, ఎస్టీలకు కొద్దిపాటి పొలం ఉండి వ్యవసాయం చేసినా లేదా పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసినా వారికి బ్యాంకు రుణాలు అందేవి కాదు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వడ్డీ వ్యాపారుల నుంచి ఎక్కువ వడ్డీకి వ్యవసాయ పెట్టుబడికి అప్పులు చేసేవారు.
► ఇప్పుడు ప్రభుత్వం కౌలుకు వ్యవసాయం చేసే ఎస్సీ, ఎస్టీ రైతులకు పెట్టుబడి సాయాన్ని వైఎస్సార్‌ రైతు భరోసా పేరుతో అందిస్తోంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు