వ్యాక్సిన్‌ పేరుతో నగదు బదిలీ మోసం

29 Aug, 2021 04:45 IST|Sakshi
నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన సీఐ ముక్తేశ్వరరావు

‘ర్యాపీ పే’ యాప్‌ను ఉపయోగించి నిరక్షరాస్యులు, వృద్ధుల అకౌంట్‌ల నుంచి సొమ్ము బదలాయింపు 

కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఇద్దరి అరెస్ట్‌

ఉయ్యూరు: వ్యాక్సిన్‌ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని ఉయ్యూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో నిందితులను సీఐ ముక్తేశ్వరరావు మీడియా ముందు హాజరుపరిచి కేసు వివరాలను శనివారం వెల్లడించారు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం దేవరపల్లికి చెందిన దేవరపల్లి అశోక్, కంకిపాడు మండలం కోలవెన్నుకి చెందిన కొడాలి విజయసాగర్‌లు తోట్లవల్లూరుకి చెందిన ఓ మహిళ వ్యాపారికి రుణం వస్తుందని మాయమాటలు చెప్పి ఆమెతో ఓ బ్యాంక్‌ అకౌంట్‌ను తెరిపించారు. దానికి సంబంధించిన పాస్‌బుక్, ఏటీఎం కార్డుని వీరి దగ్గరే ఉంచుకుని ఆమె బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌ను ‘ర్యాపీ పే’ యాప్‌కు లింక్‌ చేశారు. రెండు డోసుల కోవిడ్‌ టీకా తీసుకున్న వారికి ప్రభుత్వం నెలకు రూ.900ను బ్యాంక్‌ ఖాతాలో జమ చేస్తుందని నమ్మబలికి తోట్లవల్లూరు, పమిడిముక్కల, నూజివీడు, ఉయ్యూరు మండలాల్లోని నిరక్షరాస్యులు, వృద్ధుల నుంచి ఆధార్‌ కార్డు నంబర్‌లు తీసుకున్నారు.

అలాగే వారి వేలిముద్రలను సేకరించి వాటిని భద్రపరిచారు. వీరు తీసుకున్న ఆధార్‌ నంబర్లను ‘ర్యాపీ పే’ యాప్‌లో నమోదు చేయగా వాటికి అనుసంధానమైన బ్యాంకు అకౌంట్‌లు వీరికి కనిపించాయి. వెంటనే భద్రపరిచిన ఆయా వ్యక్తుల వేలిముద్రల ఆధారంగా వారి అకౌంట్‌ నుంచి సొమ్ముని మహిళ అకౌంట్‌కు బదిలీ చేసుకున్నారు. ఇలా ఇప్పటివరకు రూ.73 వేలను మహిళ అకౌంట్‌కు బదలాయించారు. ఇలా మోసం చేస్తున్న క్రమంలో తన అకౌంట్‌ నుంచి డబ్బులు కట్‌ అయినట్లు ఓ మహిళకు మొబైల్‌ మెసేజ్‌ వచ్చింది.

తన ప్రమేయం లేకుండానే తన అకౌంట్‌ నుంచి సొమ్ము వేరే అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ అయ్యిందని తన బంధువుల సాయంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలా రెండు కేసులు నమోదవడంతో సీఐ ముక్తేశ్వరరావు పర్యవేక్షణలో ఎస్‌ఐ శ్రీనివాస్‌ కేసు దర్యాప్తు చేపట్టారు. దేవరపల్లి, కలవపాములలో ఇద్దరు చొప్పున, నూజివీడులో ఒకరు, పమిడిముక్కలలో నలుగురు మోసపోయినట్లు విచారణలో గుర్తించారు. సాంకేతిక అంశాల ఆధారంగా నిందితులను గుర్తించారు. వీరిని పమిడిముక్కలలో శనివారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులు ఇద్దరూ గతంలో ఇదే తరహా నగదు మోసాలకు పాల్పడ్డారని సీఐ తెలిపారు. 

మరిన్ని వార్తలు