వాహన మిత్ర లబ్ధిదారులకు నేడు నగదు బదిలీ

9 Nov, 2020 05:50 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పథకాలను (సంతృప్త స్థాయిలో) అర్హత గల ప్రతి ఒక్కరికీ అందించాలన్న లక్ష్యంలో భాగంగా వైఎస్సార్‌ వాహనమిత్ర పథకం కింద లబ్ధిదారులను రాష్ట్ర ప్రభుత్వం మరోమారు ఎంపిక చేసింది. సొంతంగా నడుపుకునే ఆటో/క్యాబ్‌ డ్రైవర్లకు ఏడాదికి రూ.10 వేల చొప్పున సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా సోమవారం మరో 11,501 మంది లబ్ధిదారులకు రవాణా శాఖ మంత్రి పేర్ని నాని రూ.10 వేల చొప్పున నగదు బదిలీ చేయనున్నారు. వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం కింద తొలి ఏడాది 2,39,957 మందికి సాయం అందించారు.

రెండో ఏడాది అక్టోబరులో అందించాల్సిన నగదును కోవిడ్‌ కారణంగా నష్టపోయిన ఆటో డ్రైవర్లను ఆదుకోవాలనే లక్ష్యంతో నాలుగు నెలలు ముందుగానే సీఎం వైఎస్‌ జగన్‌ రెండో విడతగా ఈ ఏడాది జూన్‌లో 2,62,493 మందికి సాయం అందించారు. పొరపాటున ఎవరైనా మిగిలిపోయి ఉంటే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించిన ప్రభుత్వం.. వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలన చేయించి మరో 11,501 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేసింది. వారందరికీ సోమవారం రూ.11.50 కోట్లు నగదు బదిలీ చేయనుంది. ఇప్పటివరకు రెండు విడతల్లోనూ రూ.502.43 కోట్ల  సాయాన్ని లబ్ధిదారులకు అందించింది.  

మరిన్ని వార్తలు