జీడిమామిడి పండు.. పోషకాలు మెండు

20 Jun, 2022 19:49 IST|Sakshi

రాజానగరం(తూర్పుగోదావరి జిల్లా): మెట్ట ప్రాంతంలో రైతులకు అధిక ఆదాయాన్ని సమకూర్చే పంటలలో జీడిమామిడి ప్రధానమైనది. ఈ పంటలో జీడిగింజల ద్వారానే ఆదాయం వస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే జీడిగింజల ఉత్పత్తికి ప్రధాన కారణంగా ఉన్న జీడి మామిడి పండ్లను మాత్రం పెద్దగా పట్టించుకోరు. అవి తోటల్లో చెట్ల కింద రాలిపోతూ, కుళ్లిపోతూ ఉంటాయి. ఈ విధంగా దేశంలో సాలీనా 40 లక్షల టన్నుల జీడిమామిడి పండ్లు తోటల్లో వృథా అవుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి.  

మంచి రంగు, రుచి 
మంచి రంగు, రుచి, ఘాటైన వాసన కలిగివున్న జీడిమామిడి పండు తినగానే గొంతులో ఒక రకమైన జీర వస్తుంది. అందుకే చాలామంది దీనిని తినడానికి ఆసక్తిని చూపించరు. ఒకటి, రెండు రోజులకు మించి నిల్వ చేసుకునేందుకు అవకాశం లేని పండు కావడం, త్వరగా కుళ్లిపోయే స్వభాగం కలిగివుండంతో జీడిమామిడి పండ్లు ఎక్కువగా తోటల్లో రాలిపోతూ, భూమిలోనే కలిసిపోతున్నాయి. వాస్తవానికి వీటిలో అనేక రకాల పోషక విలువలు, ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకనే వీటి వినియోగం పై దేశవ్యాప్తంగా ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాలు (కెవికె) గ్రామీణ రైతు మహిళలకు శిక్షణ ఇస్తూ, కుటీర పరిశ్రమగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాయి.  


పలు రకాల ఆహార ఉత్పత్తులు 

జీడిమామిడి పండ్లతో పలురకాల ఆహార పదార్థాలను తయారు చేసుకోవచ్చు. వీటి రసంతో శీతల పానీయాలు, గుజ్జుతో జామ్, మిక్స్‌డ్‌ ఫ్రూట్‌ జామ్, చట్నీ, ఊరగాయ, కాండీ, టూటీ ఫ్రూటీ, టాఫీ, వినిగర్, తయారు చేయవచ్చు. గోవాలో లభించే ‘ఫెన్నీ’ అనే మత్తు పానీయం జీడిమామిడి పండ్ల రసం నుంచి తయారవుతుంది.   

రసం తీసే విధానం 
బాగా ముగ్గిన జీడిమామిడి పండ్లను సేకరించి, నీటితో శుభ్రం చేసిన తరువాత చేతులతోగాని, ప్రత్యేక మెషీన్‌తోగాని రసాన్ని తీస్తారు. ఇందుకు జ్యూస్‌ ఎక్స్‌ట్రాక్టరుని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీనివల్ల పండు నుంచి 70 శాతం రసాన్ని తీయడమే కాకుండా గంటకు 150 కిలోల పండ్ల నుంచి రసాన్ని తీసేందుకు అవకాశం ఉంటుంది. ఈ రసంలో ఉన్న టెనిన్స్‌ని (గొంతులో జీరను కలిగించే వగరు) తొలగించడానికి సగ్గు బియ్యంతో తయారు చేసిన గంజిని ఉపయోగిస్తుంటారు. జీడిమామిడి పండ్లతో మామిడి కాయల మాదిరిగా ఆవకాయ పెట్టవచ్చు. తీరిక సమయంలో తినేందుకు పొటాటో చిప్స్‌ మాదిరిగా చిప్స్‌ కూడా తయారు చేసుకోచ్చు.  

పిప్పితో ఉపయోగాలు 
► రసం తీసిన తరువాత వచ్చే పిప్పిని ఎండబెట్టి పశువులకు, కోళ్లకు దాణాగా ఉపయోగించుకోవచ్చు. 
►వర్మీ కంపోస్టుగాను ఉపయోగపడుతుంది. ఈ కంపోస్టులో 1.60 శాతం నత్రజని, 0.44 శాతం భాస్వరం, 0.58 శాతం పొటాషియం ఉంటాయి.  
►గోవా రాష్ట్రంలో ఈ పిప్పిని లిక్కర్‌ తయారీకి వాడతారు. 
►ఈ పిప్పి నుంచి ‘పెక్టిన్‌’ అనే ముఖ్యమైన ఉత్పత్తిని తయారు చేయవచ్చు. ఇది జామ్, చాస్, జెల్లీ, కెచప్‌ తయారీలలో చిక్కదనం రావడానికి తోర్పడుతుంది. పలు రకాల మందుల తయారీలోను, పౌడర్లు, పేస్టుల తయారీలోను కూడా వాడతారు.  

ఔషధకారిగా.. 
►ఈ పండులో లభ్యమయ్యే సి–విటమిన్‌ నిమ్మ జాతుల కంటే సుమారు 5 రెట్లు అధికంగా ఉంటుంది. పసుపు, ఎరుపు, గులాబి రంగులలో దొరికే ఈ పండ్లలో 85 శాతం రసం, 10 శాతం చక్కెర ఉంటాయి. రసంలో ఫ్రక్టోజు, గ్లూకోజు, సుక్రోజు, మాల్టోజు, మాలిక్‌ ఆమ్లం ఉంటాయి.  
►జిగట, నీళ్ల విరోచనాల నివారణకు, స్కర్వీ వ్యాధిని అరికట్టడానికి ఉపయోగపడుతుంది.  
►మూత్ర పిండాల సమస్యలు, కలరా, డ్రాప్సీ వ్యాధి నివారణకు ఉపకరిస్తుంది. జీడిమామిడి పండు ఆరగించడం ద్వారా అరికాళ్ల పగుళ్లను నివారించవచ్చు. 
►జీడిమామిడి రసంతో తయారు చేసిన ‘ఫెన్నీ’ అనే మత్తు పానీయం పెద్దలకు, పిల్లలకు అనేక వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది.  
►వీటి విత్తనాలతో తయారు చేసిన పొడి పాము కాటుకు విరుగుడుగా కూడా ఉపయోగిస్తుంటారు. 

యువతకు ఉపాధి 
ఫుడ్‌ ప్రాసెంగ్‌ యూనిట్ల ద్వారా జీడిమామిడి పండ్లను కూడా ఉపయోగంలోకి తీసుకువచ్చే ప్రొసెస్‌ని చేపడితే మెట్ట ప్రాంతాలలో నిరుద్యోగులకు ఉపాధిని చూపవచ్చు. ఈ పండ్ల నుంచి తీసిన రసాన్ని యాప్సీ, ఫ్రూటీ, మాజాల మాదిరిగా టెట్టా ప్యాకింగ్‌ చేసి విక్రయించే ప్రక్రియ ద్వారా యువతకు ఉపాధి లభిస్తుంది. కేరళలో ఇప్పటికే జీడిమామిడి పండ్లతో తయారుచేసిన రసాన్ని శీతల పానీయంగా విక్రయిస్తున్నారు. 

పచ్చడి పెట్టుకోవచ్చు 
కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా జీడిమామిడి పండ్లతో ఏఏ రకాల ఆహార పదార్థాలను, రసాలను, జ్యూస్‌లను, జామ్‌లను తయారు చేయవచ్చునో గ్రామీణ ప్రాంతాలలో మహిళలకు శిక్షణ ఇస్తున్నాం. వీటితో పచ్చడి కూడా పెట్టుకోవచ్చు. అదెలాగో శిక్షణలో తెలియజేస్తున్నాం.  
– డాక్టర్‌ వీఎస్‌జీఆర్‌ నాయుడు, ప్రధానాధికారి, కృషి విజ్ఞాన కేంద్రం, కలవచర్ల, తూర్పుగోదావరి జిల్లా

600 మందికి శిక్షణ ఇచ్చాం 
కేరళ, గోవాలో మాదిరిగా జీడిమామిడి పండ్లను వినియోగం లోకి తీసుకువచ్చేందుకు డీసీసీడీ కొచ్చిన్‌ (కేరళ) సహకారంతో కేవీకేలో బ్యాచ్‌ల వారీగా గత ఆరు సంవత్సరాల నుంచి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 600 మంది మహిళలకు శిక్షణ ఇచ్చాం.   
– జేవీఆర్‌ సత్యవాణి, గృహ విజ్ఞాన విభాగం అధికారి, కేవీకే, కలవచర్ల, తూర్పుగోదావరి జిల్లా  

మరిన్ని వార్తలు