బహుముఖ ప్రజ్ఞాశాలి కట్టమంచి రామలింగారెడ్డి 

24 Feb, 2021 16:13 IST|Sakshi

నేడు కట్టమంచి వర్ధంతి

కట్టమంచి రామలింగారెడ్డి గొప్ప విద్యావేత్త, ఆధునిక విమర్శకులు.. బహుముఖ ప్రజ్ఞాశాలి. 1880 డిసెంబర్, 10న చిత్తూరు జిల్లా కట్టమంచిలో సుబ్రహ్మణ్య రెడ్డి, నారాయణమ్మ దంపతుల ఇంట జన్మించారు. మద్రాసు క్రైస్తవ కళాశాలలో రాజకీయ, ఆర్థిక, తత్వ శాస్త్రాలలో విద్యనభ్యసించి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. కొంత కాలం కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. స్వదేశం వచ్చాక బరోడా కళాశాలలో ఆచార్యునిగా తొలి ఉద్యోగం ప్రారంభించారు.  

ఆ తర్వాత మైసూరు విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా, ప్రిన్సిపాల్‌గా, విశ్వవిద్యాలయ రూపకర్తగా, విద్యాశాఖాధికారిగా పలు బాధ్యతలు నెరవేర్చారు.  1926లో స్థాపించిన ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ప్రథమ వైస్‌ చాన్స్‌లర్‌గా నియమితులై వర్సిటీకి మంచి పేరు సంపాదించి పెట్టారు. పాతకొత్తల మేలు కలయికకు ఆయన వారధి రథసారథి. కవిగా కట్టమంచి వారిది విశిష్టమైన శైలి. 19 ఏళ్ల వయసులోనే ఖండకావ్యంగా ‘ముసలమ్మ మరణం‘ రచించారు. 

అనంతపురం జిల్లాలోని బుక్కరాయ సముద్రంలో చెరువుకు గండి పడినప్పుడు ఒక ముసలమ్మ గండికి  అడ్డం పడి ప్రమాదాన్ని నివారించిన ఘటనను ఇతివృత్తంగా తీసుకుని రామలింగారెడ్డి ‘ముసలమ్మ మరణం‘ కావ్యాన్ని అద్భుతంగా మలిచారు.  ఇంకా వీరు సరికొత్త భావాలకు, నూతన ఆలోచనా రీతులకు, మనోవికాసాత్మకమైన రచనలకు అద్దంపడుతూ అద్భుతమైన కావ్యాలను రాశారు. అన్ని తరాలకు ఆదర్శంగా నిలిచిన కట్టమంచి రామలింగారెడ్డి 1951 ఫిబ్రవరి 24న కన్నుమూశారు.

పింగళి భాగ్యలక్ష్మి, గుంటూరు
మొబైల్‌ : 97047 25609  

మరిన్ని వార్తలు