మాజీ ఎమ్మెల్యే యరపతినేనికి బిగుస్తున్న ఉచ్చు!

22 Nov, 2020 09:30 IST|Sakshi

యరపతినేని అక్రమ మైనింగ్‌ కేసుల్లో సీబీఐ విచారణ వేగవంతం 

శాటిలైట్‌ సర్వే ద్వారా మైనింగ్‌ మాఫియా దోపిడీ అంచనా   

2014–18 మధ్య సుమారు 1.50 కోట్ల మెట్రిక్‌ టన్నుల లైమ్‌ స్టోన్‌ దోపిడీ?  

అదంతా బయటపడితే తమ పరిస్థితి ఏమిటని టీడీపీ నాయకుల్లో ఆందోళన

సాక్షి, గుంటూరు: టీడీపీ నాయకుడు, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని, ఆయన అనుచరులకు అక్రమ మైనింగ్‌ ఉచ్చు మెల్లమెల్లగా బిగుస్తోంది. అక్రమ మైనింగ్‌పై నమోదు చేసిన కేసుల విచారణలో కేంద్ర దర్యాప్తు సంస్థ సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(సీబీఐ) దూకుడు పెంచింది. గుంటూరులోని యరపతినేని నివాసం, ఆఫీస్‌తో పాటు, దాచేపల్లి, నడికుడి, పిడుగు రాళ్లకు చెందిన నిందితుల ఇళ్లు, హైదరాబాద్‌ సహా 25 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు గురువారం మెరుపు దాడులు చేపట్టారు. శాటిలైట్‌ సర్వే ద్వారా మైనింగ్‌ మాఫియా ఏ మేరకు సహజ వనరులను కొల్లగొట్టిందో అంచనా వేస్తామని వెల్లడించారు. అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో సీబీఐ 17 మందిపై కేసు నమోదు చేయగా నిందితుల్లో 13 మంది యరపతినేని బినామీలు, అనుచరులే. సీబీఐ లోతైన విచారణ దిశగా అడుగులు వేస్తుండటంతో మైనింగ్‌ మాఫియా, టీడీపీ నాయకుల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి.  

గతంలో సాక్ష్యాలతో హైకోర్టు ముందుంచిన మాజీ ఎమ్మెల్సీ టీజీవీ 
అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యే నేతృత్వంలో నడుస్తున్న అక్రమ మైనింగ్‌పై వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ టి.జి.వి. కృష్ణారెడ్డి 2016లో హైకోర్టులో పిల్‌ వేశారు. విచారణ జరిపిన హైకోర్టు 2018లో అక్రమ మైనింగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో అప్పటి ప్రభుత్వం తూతూ మంత్రంగా విచారణ చేపట్టి పిడుగురాళ్ళ మండలం సీతారామపురం, దాచేపల్లి మండలం కేశానుపల్లి, నడికుడి ప్రాంతాల్లో మైనింగ్‌ మాఫియా కేవలం 31 లక్షల మెట్రిక్‌ టన్నుల సున్నపురాయిని దోచేసినట్లుగా చూపారు. దీంతో తాము ఒడ్డున పడ్డామని మైనింగ్‌ మాఫియా ఊపిరి పీల్చుకుంది. అయితే అప్పట్లో అధికారులను మేనేజ్‌ చేసి దోచి, దాచేసిన లెక్కలు శాటిలైట్‌ సర్వే ద్వారా బయటపడనున్నాయి. టీజీవీ కృష్ణారెడ్డి నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) ద్వారా సేకరించిన శాటిలైట్‌ సర్వే ప్రకారం కేసానుపల్లి, నడికుడిల్లో 2015 జూలై నుంచి 2017 జనవరి వరకూ,  సీతారామపురంలో 2015 సెప్టెంబర్‌ నుంచి 2017 మార్చి నాటికి 68.53 లక్షల మెట్రిక్‌ టన్నుల తెల్లరాయిని దోచేసినట్లు అంచనా.  (అక్రమ కట్టడాలపై జీవీఎంసీ కొరడా)

కోనంకి వద్ద అక్రమ మైనింగ్‌ జరిగిన ప్రాంతానికి సంబంధించిన శాటిలైట్‌ చిత్రం

2017 జూలై నెలలో ఈ సాక్ష్యాలను ఆయన హైకోర్టుకు సైతం అందించారు. 2016లో దాఖలు చేసిన పిల్‌లో 2014–15 మధ్య 34లక్షల మెట్రిక్‌ టన్నులు దోచేసినట్టు పేర్కొన్నారు. కోర్టులో దాఖలు చేసిన శాటిలైట్‌ సర్వే ఆధారాలకు, 2017 జనవరి నుంచి 2018 జూలైల మధ్య జరిగిన అక్రమ మైనింగ్‌ శాటిలైట్‌ అంచనాలు తోడైతే సుమారు 1.50 కోట్ల మెట్రిక్‌ టన్నుల వరకూ లైమ్‌ స్టోన్‌ను మైనింగ్‌ మాఫియా దోచేసినట్టు తెలుస్తోంది. సీబీఐ శాటిలైట్‌ సర్వే అంచనాల ఆధారంగా చేపట్టే లోతైన విచారణలో మనీ లాండరింగ్, అక్రమ ఆస్తుల ఆర్జన, ఇతర ఆర్థిక నేరాలు బయటపడతాయేమోనని మాజీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ఆందోళన చెందుతున్నారు. వేల కోట్ల అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర, అధికారుల సహకారం తదితర అంశాలు కూడా సీబీఐ వెలుగులోకి తీయాలని రాజకీయంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.   

దాడులు... వేధింపులు 
గత ప్రభుత్వ హయాంలో యరపతినేని కనుసన్నల్లో నడిచిన అక్రమ మైనింగ్‌పై కోర్టులను ఆశ్రయించిన వైఎస్సార్‌సీపీ నాయకుడు కుందుర్తి గురువాచారిని చిత్రహింసలకు గురిచేశారు. మాజీ ఎమ్మెల్సీ కృష్ణారెడ్డిపై అక్రమ కేసులను బనాయించారు. 

అందరి పాత్రలూ వెలికితీయాలి 
పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో మాజీ ఎమ్మెల్యే యరపతినేని తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.వేల కోట్ల సహజ సంపదను కొల్లగొట్టారు. అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో గత టీడీపీ ప్రభుత్వ పెద్దలు, జిల్లా అధికారుల పాత్ర ఉంది. సామాన్యుడు ట్రాక్టర్‌ మట్టి సొంత అవసరాల కోసం తీసుకెళ్తే కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెట్టే  అధికారులు రూ.వేల కోట్ల సహజ సంపదను దోచేస్తుంటే అప్పట్లో కళ్లు మూసుకుని కూర్చున్నారు. కోర్టుకు తప్పుడు అఫిడవిట్‌లు సమర్పించారు. ఇలా అక్రమ మైనింగ్‌కు సహకరించిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలి.  – టి.జి.వి. కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ

మరిన్ని వార్తలు