‘గీతం’పై సీబీఐ విచారణ జరపాలి

27 Oct, 2020 02:46 IST|Sakshi
సీబీఐ ఎస్పీకి అందజేసిన వినతిపత్రాన్ని చూపుతున్న ఏపీ ప్రజా సంఘాల జేఏసీ ప్రతినిధులు

ఆస్తులన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి

ఆర్థిక నేరాలపై అంతర్గత ఆడిట్‌ విచారణతో నిగ్గుతేల్చాలి

సీబీఐ ఎస్పీకి ఏపీ ప్రజా సంఘాల జేఏసీ వినతిపత్రం

సంస్థ బాగోతాలపై విద్యార్థి, ప్రజా సంఘాల్లో పెద్ద ఎత్తున చర్చ

సీతమ్మధార (విశాఖ ఉత్తరం): విశాఖలో గీతం యూనివర్సిటీ అక్రమాల పర్వంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆక్రమిత భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే అనే డిమాండ్‌ పెరుగుతోంది. 71 ఎకరాలకు పైగా చేజిక్కించుకున్నది చాలక పక్కనున్న ప్రభుత్వ భూమి 40 ఎకరాలనూ కాజేయాలనుకోవడం దుర్మార్గమని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని పలు ప్రజా సంఘాలు నినదిస్తున్నాయి. ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జా చేస్తుంటే ఉపేక్షించరాదని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ అండతో కబ్జాల పర్వం కొనసాగించారని, ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారో పూర్తి స్థాయిలో విచారణ జరగాలని ఆయా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. చట్టవిరుద్ధంగా నిర్మించిన భవనాలన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నాయి.

ఈ నేపథ్యంలో విద్య, వైద్య వ్యాపారం ద్వారా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న గీతం యూనివర్సిటీపై సీబీఐ, ఈడీతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ ప్రజా సంఘాల జేఏసీ సోమవారం ఆందోళన నిర్వహించింది. యాజమాన్యాన్ని అరెస్టు చేసి, సంస్థను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరింది. ఈ మేరకు జేఏసీ అధ్యక్షుడు జేటీ రామారావు ఎంవీపీ కాలనీలోని సీబీఐ కార్యాలయంలో ఎస్పీ విమల్‌ ఆదిత్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ ఎత్తున విదేశాల నుంచి రూ.కోట్లాది నిధులు, విరాళాలు పొందుతూ.. అక్రమంగా ఆస్తులు సంపాదిస్తూ తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడిన గీతంపై అంతర్గత ఆడిట్‌ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

గతంలో సంస్థ అధినేత విశాఖ ఎంపీగా పనిచేసిన సమయంలో విశాఖ నగరాభివృద్ధికి కేటాయించిన నిధులను సైతం గీతం వర్సిటీకి దారి మళ్లించారని, గీతం ఇచ్చిన నకిలీ డిగ్రీలతో అనేకమంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. నిబంధనల ప్రకారం సముద్ర తీర ప్రాంతంలో భారీ కట్టడాలు, భవంతులు ఉండరాదని హైకోర్టు ఉత్తర్వులుండగానే అదే హైకోర్టులో అరగంటలో అక్రమ కట్టడాలను కూల్చివేయరాదని ఏవిధంగా స్టే తెచ్చుకున్నారో విచారణ జరపాలన్నారు. గీతం వ్యవహారాలపై హైకోర్టు, కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన వెంటనే పూర్తి స్థాయి విచారణ చేస్తామని సీబీఐ ఎస్పీ తెలిపారన్నారు. 

మరిన్ని వార్తలు