నెల్లూరు కోర్టులో కేసు ఫైళ్ల దొంగతనంపై సీబీఐ దర్యాప్తు

25 Nov, 2022 05:10 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వం, కాకాణి అభ్యంతరం లేదనడంతో సీబీఐకి అప్పగిస్తున్నామన్న ధర్మాసనం 

సీబీఐకి సహకరించాలని జిల్లా ఎస్పీకి ఆదేశం

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దాఖలు చేసిన ఫోర్జరీ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలు నెల్లూరు జిల్లా కోర్టు నుంచి దొంగతనానికి గురైన వ్యవహారంలో హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. నెల్లూరు కోర్టులో జరిగిన దొంగతనం కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తే ఎలాంటి అభ్యంతరం లేదని అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు మంత్రి కాకాణి చెప్పడంతో హైకోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

సమర్థమైన అధికారి సరైన రీతిలో దర్యాప్తు జరిపి వీలైనంత త్వరగా చార్జిషీట్‌ దాఖలు చేయాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. దొంగతనంపై నమోదైన కేసుకు సంబంధించిన ఫైళ్లను, కేసు డైరీని సీబీఐకి అప్పగించాలని నెల్లూరు చిన్నబజార్‌ పోలీసులను ఆదేశించింది. సీబీఐకి సహకరించాలని నెల్లూరు జిల్లా ఎస్పీని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు చెప్పింది. 

సీబీఐకి ఇస్తే అభ్యంతరం లేదన్న ప్రభుత్వం, కాకాణి 
మంత్రి కాకాణిపై సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దాఖలు చేసిన కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలు నెల్లూరు నాలుగో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు నుంచి మాయమైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి నెల్లూరు ప్రిన్సిపల్‌ జిల్లా జడ్జి (పీడీజే) సి.యామిని పంపిన నివేదికను పరిశీలించిన హైకోర్టు ఈ వ్యవహారంపై సుమోటోగా విచారణ జరపాలని నిర్ణయించింది.

ఆ నివేదికను సుమోటో పిటిషన్‌గా మలిచింది. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సీబీఐ డీజీ, జిల్లా కలెక్టర్, ఎస్‌పీ, హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్, హైకోర్టు రిజిస్ట్రార్‌ (విజిలెన్స్‌), నెల్లూరు ప్రిన్సిపల్‌ జిల్లా జడ్జి, మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితోపాటు మరికొందరిని ప్రతివాదులుగా చేర్చింది.

విచారణ çసందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. ఈ దొంగతనం కేసుపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి న్యాయవాది కె.రతంగపాణిరెడ్డి సైతం సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తే తమకూ ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కోర్టు ఆదేశాలిస్తే దర్యాప్తు చేస్తామని సీబీఐ తెలిపింది. దీంతో గతంలో ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది.

తాజాగా తన నిర్ణయాన్ని వెలువరించిన సీజే ధర్మాసనం.. ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న వ్యక్తి నిందితుడిగా ఉన్న కేసుకు సంబంధించిన ఫైళ్లు మాయమయ్యాయని తెలిపింది. ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడంతోపాటు ఆ కేసుల విచారణను శీఘ్రగతిన పూర్తిచేయాలని, ఆ విచారణను హైకోర్టు పర్యవేక్షించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందని గుర్తుచేసింది.

ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణకు సుప్రీంకోర్టు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో.. నెల్లూరు కోర్టు, యంత్రాంగం, పోలీసులు కేసు ఫైళ్లను భద్రపరిచే విషయంలో మరింత అప్రమత్తతతో వ్యవహరించి ఉండాల్సిందని అభిప్రాయపడింది. నేరారోపణలను రుజువుచేసే ఆధారాలను కోర్టు ముందుంచనిపక్షంలో ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసు వీగిపోయే ప్రమాదం ఉందంది. నిందితులను చట్టంముందు నిలబట్టే విషయంలో సమయానుగుణ, సరైన చర్యలు చేపట్టని పక్షంలో ప్రజలు న్యాయప్రక్రియపై విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపింది.

ప్రస్తుత కేసులో పలుకుబడి కలిగిన వ్యక్తులు నిందితులుగా ఉన్న నేపథ్యంలో.. కేసు ఫైళ్ల దొంగనతం వెనుక ఎవరున్నారన్న మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని ధర్మాసనం పేర్కొంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఫైళ్ల దొంగతనం కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగిస్తున్నట్లు తెలిపింది.

వాస్తవాలు వెలుగులోకి వస్తాయి: కాకాణి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. నెల్లూరు కోర్టులో దొంగతనం కేసు విచారణ సీబీఐకి అప్పగించడానికి అభ్యంతరం లేదని చెప్పాం..’ అని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీబీఐ విచారణ ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, టీడీపీ నేతల నోళ్లు మూతపడతాయని పేర్కొన్నారు.

ప్రజా జీవితంలో ఉన్నవాళ్లు సత్యంగా ఉండాలని, అందుకే సీబీఐ విచారణకు అభ్యంతరం తెలపలేదని చెప్పారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే ఆయనపై వచ్చిన ఆరోపణల మీద సీబీఐ విచారణ కోరాలని సవాల్‌ చేశారు. సీబీఐ విచారణ అంటే కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకున్న నీచ సంస్కృతి చంద్రబాబుదని ఎద్దేవా చేశారు.  

మరిన్ని వార్తలు