విజయవాడ పశ్చిమలో టీడీపీ నాలుగు స్తంభాలాట.. నానితో నిప్పు రాజేయిస్తున్న బాబు

30 Jan, 2023 10:31 IST|Sakshi

సాక్షి, కృష్ణా: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ అధినేత మరో నాయకుడికి రంగప్రవేశం కల్పిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు నాయకులతో మూడుముక్కలాట ఆడిస్తున్న చంద్రబాబు.. తాజాగా నాలుగు స్తంభాలాటకు తెరతీయిస్తున్నారు. విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని శ్రీనివాస్‌ (నాని)కు పశ్చిమ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించి అక్కడి నాయకుల మధ్య పొగ ఆరనీయకుండా నిప్పు రాజేస్తూనే ఉన్న బాబు తాజాగా ఎం.ఎస్‌. బేగ్‌ను రంగంలోకి దించారు.

టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం సందర్భంగా కేశినేని, బేగ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను వెంటపెట్టుకెళ్లి చంద్రబాబు అపాయింట్‌మెంట్‌ ఇప్పించారు. ఈ సందర్భంగా బేగ్‌కు బాబు బలమైన హామీ ఇచ్చారనే చర్చ నియోజకవర్గ టీడీపీ నాయకుల్లో జరుగుతోంది.  ఎంపీ కేశినేని నానికి పశ్చిమ నియోజకవర్గంలోని టీడీపీ నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. బుద్దా వెంకన్న, నాగుల్‌మీరాలు ఓ వర్గంగా వ్యవహరిస్తూ ఎంపీని తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నది బహిరంగ రహస్యమే. కార్పొరేషన్‌ ఎన్నికల సమయంలో పతాకస్థాయికి చేరిన రగడ ఎప్పటికప్పుడు రగులుకుంటూనే ఉంది.

ఇటీవలే కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ నడిపే వారు, భూ కబ్జాదారులు, రౌడీలు నగరంలో నాయకులుగా చెలామణి అవుతామంటే ససేమిరా అంగీకరించేది లేదంటూ బుద్దా, మీరా, బొండా తదితర నేతలను ఉద్దేశించి ఎంపీ పరోక్షంగా కుండబద్దలు కొట్టారు.  పశ్చిమ మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ కేశినేని వైపే మొగ్గుచూపుతుండేవారు. కొన్ని నెలల కిందట ఎంకే బేగ్‌ కార్యాలయాన్ని నాని ప్రారంభించినప్పటి నుంచి జలీల్‌ఖాన్‌ కూడా ఎంపీ పట్ల గుర్రుగా ఉంటున్నారు.

గత సాధారణ ఎన్నికల్లో జలీల్‌ కుమార్తె షబానాఖాతూన్‌ టీడీపీ తరఫున పోటీచేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ పర్యాయం కూడా తమ కుటుంబానికే టికెట్టు దక్కుతుందనే ఆశలో ఉన్న జలీల్‌ఖాన్‌కు ఆదివారం నాటి పరిణామాలు మింగుడుపడనీయడం లేదని ఆయన వర్గీయులు గుర్తుచేస్తున్నారు.  

నాలుగు పర్యాయాలు పోటీ చేసినా.. 
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్, జనరల్‌ అభ్యర్థిగా ఎం.ఎస్‌.బేగ్‌ తండ్రి ఎం.కె. బేగ్‌ 1985, 1989, 1994, 2004 ఎన్నికల్లో పోటీచేసి మూడు పర్యాయాలు సీపీఐ అభ్యర్థుల చేతిలో ఓటమి చవిచూశారు. 1989లో మాత్రమే బేగ్‌ విజయం సాధించారు. చంద్రబాబును కలిసిన బేగ్‌.. విదేశాల్లో ఉంటూ రాజకీయాల్లో తనవంతు ప్రయత్నాలు ఎన్నికల వేళ కొనసాగిస్తుంటారనే గుర్తింపు ఉంది. గత ఎన్నికలప్పుడు కూడా విభిన్న పార్టీల నుంచి టికెట్‌ను ఆశించినట్లు స్థానిక నాయకులు గుర్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు