ఏపీ సర్కారీ స్కూళ్లలో సీబీఎస్‌ఈ సిలబస్‌.. 1000 పాఠశాలలు ఇవే..

10 Dec, 2022 02:39 IST|Sakshi

తొలి దశలో 1,000 పాఠశాలలకు అనుమతి

ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే 8వ తరగతి నుంచి ఆరంభం

దశల వారీగా అన్ని స్కూళ్లలోనూ సీబీఎస్‌ఈ విధానం

విద్యార్థులకు రెండు భాషల్లో పాఠ్యపుస్తకాల పంపిణీ

83,466 మంది టీచర్లకు శిక్షణ కూడా పూర్తి

రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) ప్రవేశానికి అడు­గులు ముందుకు పడ్డాయి. మొదటి దశలో 1,000 ప్రభుత్వ స్కూళ్లకు సీబీఎస్‌ఈ బోర్డు అనుమతులిచ్చింది. దీంతో ఈ స్కూళ్ల­న్నిటిలో రాష్ట్ర ప్రభుత్వం 8వ తరగతి నుంచి సీబీఎస్‌ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ విద్యా సంవత్సరం నుంచే 8వ తరగతి విద్యార్థులంతా సీబీఎస్‌ఈ విధా­నంలో చదువుతారు. అత్యున్నత మూ­ల్యాంకన, బోధనా విధానాలున్న సీబీ­ఎస్‌ఈ విధానాన్ని రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లన్నిటిలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన సంగతి తెలిసిందే.

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో అత్యధిక శాతం బడుగు, బలహీనవర్గాల పిల్లలే. వీరంతా ప్రపంచ స్థాయి ప్రమాణా­లను అందిపుచ్చుకునేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పాఠశాల విద్యలో అనేక విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది. అన్ని రాష్ట్రాలకన్నా ముందుగా ఫౌండేషనల్‌ విద్యావిధానానికి బాటలు వేసింది. మరోవైపు సీబీఎస్‌ఈ విధానాన్ని ప్రభుత్వ స్కూళ్లలో అమలు చేస్తే విద్యార్థులు అత్యున్నత ప్రమాణాలు అందుకోగలుగుతారని కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో సీబీఎస్‌ఈ నిబంధనలకు అనుగుణంగా ఉన్న పాఠశాలలను ముందుగా గుర్తించింది. మొదటి దశలో మొత్తం 1,308 ప్రభుత్వ స్కూళ్లకు అనుమతుల కోసం సీబీఎస్‌ఈ బోర్డుకు ప్రతిపాదనలు పంపింది. ఈ స్కూళ్లలో 8వ తరగతి నుంచి సీబీఎస్‌ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.

వీటిలో జిల్లా పరిషత్‌ స్కూళ్లు 417, మునిసిపల్‌ స్కూళ్లు 71, ఏపీ గురుకుల విద్యా సంస్థలు 39, ఏపీ మోడల్‌ స్కూళ్లు 164, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు 352, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థలు 179, బీసీ గురుకుల సంక్షేమ విద్యా సంస్థలు 26, గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థలు 45, ఆశ్రమ్‌ స్కూళ్లు 15 ఉన్నాయి. వీటికి సీబీఎస్‌ఈ అనుమతుల కోసం రూ.5.88 కోట్లను విద్యా శాఖ సీబీఎస్‌ఈ బోర్డుకు చెల్లించింది. గుర్తింపునకు అవసరమైన పత్రాలను కూడా ఆన్‌లైన్‌లో సమర్పించింది. ఈ స్కూళ్లలో 1,229 స్కూళ్లకు అఫ్లియేషన్‌ నంబర్‌ వచ్చినా చివరకు 1,000 ప్రభుత్వ స్కూళ్లకు సీబీఎస్‌ఈ బోర్డు అనుమతులు ఇచ్చింది. దీంతో ఈ స్కూళ్లల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే ఎనిమిదో తరగతి నుంచి సీబీఎస్‌ఈ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ విద్యార్థులకు సీబీఎస్‌ఈ సిలబస్‌కు అనుగుణంగా పాఠ్యపుస్తకాలను కూడా పంపిణీ చేసింది. వీటిని తెలుగు, ఆంగ్లం రెండు భాషల్లో ఉండేలా మిర్రర్‌ ఇమేజ్‌లు రూపొందించి అందించింది. 

మిగతా స్కూళ్లకు చర్యలు వేగవంతం..
కాగా రాష్ట్రంలో మిగతా ప్రభుత్వ స్కూళ్లలోనూ సీబీఎస్‌ఈ విధానాన్ని దశలవారీగా అమల్లోకి తెచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్, పాఠశాల విద్య కమిషనర్‌ సురేష్‌కుమార్‌ తదితరులు చర్యలు వేగవంతం చేశారు. శుక్రవారం సీబీఎస్‌ఈ బోర్డు అధికారులతో వెబ్‌ఎక్స్‌ సమావేశంలో వీటిపై చర్చించారు. సీబీఎస్‌ఈ విధానానికి అనుగుణంగా సిద్ధం చేసేందుకు ఇప్పటికే రాష్ట్రంలో 83,466 మంది టీచర్లకు శిక్షణ కూడా ఇచ్చారు. 

సీబీఎస్‌ఈ విధానంతో విద్యార్థులకు ప్రయోజనాలు ఇవే..
సీబీఎస్‌ఈ విధానం అమలుతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుతుందని విద్యావేత్తలు, నిపుణులు చెబుతున్నారు. 
– సీబీఎస్‌ఈ.. కేంద్ర ప్రభుత్వ సంస్థ. అత్యున్నత విద్యా విధానాలు అమలు చేస్తున్న సీబీఎస్‌ఈకి అంతర్జాతీయ స్థాయిలో పేరుంది. 
– ఈ విద్యా విధానంలో చదివిన విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మంచి గుర్తింపు లభిస్తోంది.
– దేశంలో ప్రముఖ విద్యా సంస్థలైన ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఎయిమ్స్, జిప్‌మర్, సీఎంసీ వంటి సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ, నీట్‌ వంటివి సీబీఎస్‌ఈ సిలబస్‌తోనే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాల దశ నుంచే సీబీఎస్‌ఈ విధానంలో చదివినవారు జాతీయ స్థాయి ప్రవేశపరీక్షల్లో మంచి ర్యాంకులు కొల్లగొడుతున్నారు.
– సీబీఎస్‌ఈ విధానం విద్యార్థుల్లో బలమైన పునాదులు వేస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ విధానంలో విద్యార్థి తన ఆసక్తిని అనుసరించి చదువులు కొనసాగించే స్వేచ్ఛ ఉంటుందని పేర్కొంటున్నారు. దీనివల్ల విద్యార్థులు ఒత్తిడికి లోనయ్యే పరిస్థితి ఉండదని వివరిస్తున్నారు. 
– దేశవ్యాప్తంగా సీబీఎస్‌ఈ విధానం ఉండటం వల్ల విద్యార్థులు ఏ రాష్ట్రానికి వెళ్లినా ఇబ్బంది లేకుండా చదువులు కొనసాగించవచ్చు.
– సీబీఎస్‌ఈ విద్యావిషయక అంశాల్లోనే కాకుండా విద్యార్థి సమగ్రాభివృద్ధికి బాటలు వేసేలా ఉంటుందని విద్యావేత్తలు చెబుతున్నారు. అంతేకాకుండా సమస్యను తనంతట తాను పరిష్కరించుకోగలిగే సామర్థ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందిస్తుందని స్పష్టం చేస్తున్నారు. అలాగే విద్యార్థులు తమంతట తాముగా చదువుకోగలిగే నైపుణ్యాలను కూడా అందిస్తుందని పేర్కొంటున్నారు. 

జిల్లా        సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలల సంఖ్య    
శ్రీకాకుళం            64    
విజయనగరం        64    
పార్వతీపురం మన్యం        40    
విశాఖపట్నం        19    
అనకాపల్లి            41    
అల్లూరి సీతారామరాజు    35    
కాకినాడ            33    
కోనసీమ            12    
తూర్పు గోదావరి        15    
పశ్చిమ గోదావరి        16    
ఏలూరు            34    
కృష్ణా            9    
ఎన్టీఆర్‌            27    
గుంటూరు            11    
బాపట్ల            21    
పల్నాడు            66    
ప్రకాశం            63    
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు    40    
చిత్తూరు            22    
తిరుపతి            30    
వైఎస్సార్‌            30    
అన్నమయ్య            49    
కర్నూలు            90    
నంద్యాల            69    
అనంతపురం        51    
శ్రీసత్యసాయి            49.

మరిన్ని వార్తలు