నిరంతరం నిఘా

19 Aug, 2020 08:28 IST|Sakshi
సీసీ కెమెరాలకు అనుసంధానంతో పర్యవేక్షణ (ఇన్‌సెట్‌) ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా

కోవిడ్‌ ఆసుపత్రుల్లో రోగుల భద్రతకు ప్రాధాన్యం 

సీసీ కెమెరాలతో పర్యవేక్షణ 

సత్వర సేవలు అందేలా ఏర్పాట్లు 

స్వర్ణ ప్యాలెస్‌ ఘటనతో అప్రమత్తం 

మచిలీపట్నం: విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ ఘటనతో కోవిడ్‌ ఆసుపత్రులపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్‌ పెట్టింది. కోవిడ్‌ ఆసుపత్రులుగా ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడంతో పాటు, వారి భద్రతకు పెద్దపీట వేసేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది.  

ఆసుపత్రులపై పర్యవేక్షణ పెంచడంతో పాటు, నిఘాను పట్టిష్టం చేసేలా చర్యలకు ఉపక్రమించింది. కోవిడ్‌ ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ జారీచేసిన ఉత్తర్వుల మేరకు జిల్లా అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. కరోనా పాజిటివ్‌ రోగులకు వైద్య సేవలు అందించేందుకు జిల్లాలో ఎంపిక చేసిన 13 ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా దృష్టి సారించారు. ఇప్పటికే 11 ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. విజయవాడలోని లిబర్టీ ఆసుపత్రి, మచిలీపట్నం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రుల్లో నిర్వహిస్తున్న కోవిడ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సి ఉందని అధికారులు గుర్తించారు. మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో ఇందుకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బుధవారం నాటికి సీసీ కెమెరాలు పనిచేసేలా చర్యలు చేపట్టారు. లిబర్టీ ఆసుపత్రిలో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆదేశించారు. 

పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి 
కోవిడ్‌ ఆసుపత్రుల్లో పర్యవేక్షణ పెంచేలా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆసుపత్రుల్లోని కోవిడ్‌ కేంద్రం మొత్తం సీసీ కెమెరాలతో అనుసంధానం చేస్తున్నారు. ప్రధాన గేటు మొదలుకొని కేంద్రంలోని అన్ని గదులు, పరీక్షలు నిర్వహించే ప్రదేశం, వైద్య సేవలు అందించే వార్డులు, నమోదు కేంద్రం ఇలా అన్ని చోట్లా సీసీ కెమెరాలను అమర్చాలని ఆదేశాలు అందాయి.  వీటిని కోవిడ్‌ విభాగం ఉన్నతాధికారులు తరచూ పర్యవేక్షణ చేయడంతో పాటు భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా సీసీ పుటేజీలను భద్రపరచాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు విముఖత చూపే ఆసుపత్రుల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు, కోవిడ్‌ నిబంధనల మేరకు కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.

జిల్లాలో కరోనా తగ్గుముఖం   
జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఐసీఎంఆర్‌ తాజా నివేదికల మేరకు 2,89,290 లక్షల మందికి జిల్లాలో కరోనా పరీక్షలు నిర్వహించారు. 12,760 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇందులో 9,665 మంది పూర్తి స్థాయిలో కోలుకున్నారు. ఇంకా 2,863 మంది కరోనా పాజిటివ్‌తో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజా గణాంకాల మేరకు ఇతర జిల్లాలతో పోలిస్తే కృష్ణాలోనే తక్కువ పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. రికవరీ శాతం కూడా జిల్లాలో బాగానే ఉండటం అధికారులకు ఊరటనిస్తోంది. రానున్న రోజుల్లో మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం ద్వారా జిల్లాలో కరోనా వైరస్‌ను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ నేతృత్వంలోని అధికార యంత్రాంగం రేయింబవళ్లు పనిచేస్తున్నారు. 

జిల్లాలో కోవిడ్‌ ఆసుపత్రులు: 13 
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినవి: 11 
కరోనా పరీక్షల సంఖ్య: 2,89,290 
పాజిటివ్‌ కేసులు:  12,760 
కోలుకున్న వారు:  9,665 
చికిత్స పొందుతున్న వారు: 2,863 

మరిన్ని వార్తలు