ట్రాన్స్‌జెండర్ల రక్షణకు సెల్‌ ప్రారంభం

24 Nov, 2022 04:12 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సీఐడీ విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు

నోడల్‌ అధికారిగా ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ ఎస్పీ జి.వి.సరితకు బాధ్యతలు

త్వరలో ఇదే తరహాలో ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఏర్పాటుకు చర్యలు

సాక్షి, అమరావతి: పోలీస్‌ శాఖ రాష్ట్రంలో ట్రాన్స్‌జెండర్ల రక్షణ సెల్‌ను ఏర్పాటు చేసింది. సీఐడీ విభాగం ఆధ్వర్యంలో మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ఈ సెల్‌ను అదనపు డీజీ(సీఐడీ) పి.వి.సునీల్‌ కుమార్‌ బుధవారం ప్రారంభించారు. ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ ఎస్పీ జి.వి.సరిత ఈ ట్రాన్స్‌జెండర్ల రక్షణ సెల్‌కు నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తారు. ఇదే తరహాలో ప్రతి జిల్లా కేంద్రంలోనూ ట్రాన్స్‌జెండర్ల రక్షణ సెల్‌లను త్వరలో ఏర్పాటు చేయనున్నారు.

ఈ సందర్భంగా అదనపు డీజీ సునీల్‌ కుమార్‌ మాట్లాడుతూ ట్రాన్స్‌జెండర్లను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. ట్రాన్స్‌జెండర్ల హక్కుల పరిరక్షణ కోసం జిల్లా స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రత్యేకప్రతిభావంతులు, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ శాఖ డైరెక్టర్‌ ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఓటుహక్కు కలిగిన ట్రాన్స్‌జెండర్లు 3,800 మంది ఉన్నారన్నారు.

కానీ జనాభా లెక్కల ప్రకారం దాదాపు 28 వేలమంది ఉన్నారని చెప్పారు. ట్రాన్స్‌జెండర్లకు ప్రభుత్వం నెలకు రూ.3వేలు పింఛన్‌ ఇస్తుండటంతోపాటు ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వనుందన్నారు. ఎస్పీ సరిత మాట్లాడారు. 

మరిన్ని వార్తలు