ఏపీ నైపుణ్య కాలేజీగా ‘సెమ్స్‌’ 

20 Oct, 2022 07:16 IST|Sakshi

తొలి విడతగా 3 కోర్సులు మంజూరు

ఈ నెలాఖరు నుంచి బీటెక్‌ విద్యార్థులకు ఉచిత శిక్షణ

ఉపాధి శిక్షణకు సరైన అవకాశమంటున్న సెమ్స్‌

సాక్షి, విశాఖపట్నం: డిగ్రీ, ఇంజినీరింగ్‌ పట్టాపుచ్చుకొని బయటికి వస్తున్న వారికి ఉచిత శిక్షణతో పాటు ఉపాధిబాట చూపించేందుకు నైపుణ్య కళాశాలల్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా.. విశాఖలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ మారిటైమ్‌ అండ్‌ షిప్‌ బిల్డింగ్‌ (సెమ్స్‌) సంస్థని నైపుణ్య కళాశాలగా ప్రభుత్వం గుర్తించింది. ఇందులో ఇంజినీరింగ్‌ విద్యార్థులకు తొలివిడతగా 3 కోర్సుల్ని ప్రారంభించనున్నారు. సాగరమాల ప్రాజెక్టులో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశలో రెండు ప్రాంతాల్లో సెమ్స్‌ను ఏర్పాటు చేసింది.

ఒకటి ముంబైలో ఉండగా.. మరొకటి విశాఖపట్నంలో నెలకొల్పారు. క్లాస్‌ రూంలో పాఠ్యాంశాలు చదివిన విద్యార్థులకు సెమ్స్‌ ద్వారా ప్రాక్టికల్స్‌లో శిక్షణ అందించనున్నారు. బీఈ, బీటెక్‌ (మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్‌) ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు శిక్షణ అందించేందుకు తొలివిడతగా మూడు స్కిల్‌ కోర్సుల్ని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. మెకాట్రోనిక్స్‌ డిజైనర్‌ అండ్‌ సిస్టమ్‌ ఇంటిగ్రేటర్, ప్రొడక్ట్‌ డిజైన్‌ ఇంజినీర్‌–మెకానికల్‌తో పాటు ఆటోమేషన్‌ అండ్‌ రోబోటిక్స్‌ ఇంజినీరింగ్‌ కోర్సుల్లో 3 నుంచి 5 నెలల పాటు ఉచితంగా వసతితో కూడిన శిక్షణ అందించనున్నారు. ఈ నెలాఖరు నుంచి తరగతులు ప్రారంభించేందుకు సెమ్స్‌ ఏర్పాట్లు చేస్తోంది. 

సెమ్స్‌లో అందరూ జెమ్స్‌... 

సెమ్స్‌ భవనం

శిక్షణ పొందే ప్రతి వంద మందిలో 90 నుంచి 100 శాతం మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు అందించడమే సెమ్స్‌ నిపుణుల లక్ష్యం. అభ్యర్థుల సమయానికి అనుగుణంగా శిక్షణ తరగతుల్ని విభజించారు. ఇందులో విద్యార్థులకు పూర్తిస్థాయి శిక్షణతో పాటు వీకెండ్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్స్, ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్స్, డిప్లొమా, సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్, పూర్తిస్థాయి డిప్లొమా సర్టిఫికెట్‌ కోసం స్ట్రక్చర్డ్‌ లెర్నింగ్‌ పాత్, ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ మొదలైన శిక్షణ తరగతుల్ని అందిస్తున్నారు. ఇప్పటి వరకూ విశాఖలో 103 స్టూడెంట్‌ బ్యాచ్‌లు, 21 కార్పొరేట్‌ బ్యాచ్‌లకు శిక్షణ అందించారు. మొత్తం 45 పరిశ్రమలతో ఎంవోయూలు చేసుకున్నారు. 

గ్రామీణ విద్యార్థులకు ప్రాధాన్యమిస్తూ... 
గోపీకృష్ణ శివ్వం, సెమ్స్‌ సీవోవో 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో గ్రామీణ విద్యార్థులకు ఈ శిక్షణలో ప్రాధాన్యమివ్వనున్నాం.  పరిశ్రమలకు, సంస్థలకు అవసరమైన నైపుణ్యాలతో కూడిన శిక్షణని సెమ్స్‌లో అందిస్తాం. ఇప్పటి వరకూ ఇక్కడ శిక్షణ తీసుకున్నవారిలో 2 వేల మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సొంతం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు 3 కొత్త కోర్సులకు విద్యార్థుల్ని ఆహ్వానిస్తున్నాం. 21 నుంచి 27 ఏళ్లలోపు విద్యార్థులు ఈ కోర్సులకు అర్హులు. సెమ్స్‌ కార్యాలయంలో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. ఈ నెల 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. సందేహాలుంటే 9948183865, 7794840934, 08912704010 నంబర్లలో సంప్రదించాలి. 

18 ల్యాబ్‌ల ద్వారా సాంకేతిక నైపుణ్యత 
వైజాగ్‌ సెమ్స్‌లో మొత్తం 18 ల్యాబ్‌ల ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో ప్రొడక్ట్‌ డిజైన్‌ అండ్‌ వేలిడేషన్‌ ల్యాబ్, అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ల్యాబ్, టెస్ట్‌ అండ్‌ ఆప్టిమైజేషన్‌ ల్యాబ్, నెస్టింగ్‌–ప్రొడక్టివిటి ఇంప్రూవ్‌మెంట్‌ ల్యాబ్, డైమెన్షనల్‌ ఆక్యురసీ కంట్రోల్‌ సిస్టమ్‌ ల్యాబ్, హల్‌ డిజైన్‌ ల్యాబ్‌లు ముంబై, వైజాగ్‌ సెమ్స్‌లో ఉన్నాయి. అయితే.. రీసెర్చ్‌ మెషీన్‌ షాప్‌ అండ్‌ సీఎన్‌సీ ల్యాబ్, ఆటోమేషన్, మెకట్రానిక్స్, వెల్డింగ్‌ టెక్నాలజీ, రోబోటిక్స్, ప్రాసెస్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, హైడ్రాలిక్స్, పంప్స్, పైపింగ్, వర్చువల్‌ రియాలిటీ, రాడార్‌ సిస్టమ్‌ వంటి 12 ల్యాబ్‌లు కేవలం వైజాగ్‌ సెమ్స్‌లోనే ఉండటం విశేషం. 

మరిన్ని వార్తలు