ప్రాజెక్టుల భద్రతపై కేంద్రం కసరత్తు 

4 Sep, 2021 07:41 IST|Sakshi

కృష్ణా, గోదావరి బోర్డులు అధీనంలోకి తీసుకునే ప్రాజెక్టుల వద్ద సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందిని నియమించేందుకు సిద్ధమైన కేంద్ర హోంశాఖ

భద్రతా చర్యలు, సహకారంపై కృష్ణా, గోదావరి, బోర్డులకు లేఖ

డీఐజీ ర్యాంకు అధికారి, సీనియర్‌ కమాండెంట్‌తో పర్యవేక్షణ

జీతభత్యాలు, వసతుల కల్పనపై ముసాయిదా ఒప్పంద పత్రాలను రెండు రాష్ట్రాలకు పంపిన బోర్డులు

సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి బోర్డులు తమ అధీనంలోకి తీసుకుని నిర్వహించే ప్రాజెక్టులకు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాలతో (సీఐఎస్‌ఎఫ్‌) భద్రత కల్పించేందుకు కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగింది. బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ జూలై 15న కేంద్రం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌లోని షెడ్యూల్‌–2లో పేర్కొన్న ప్రాజెక్టులకు సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందితో భద్రత ప్రక్రియను త్వరగా చేపట్టాలని జల్‌ శక్తి శాఖ కోరింది. ఈ మేరకు సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది నియామకానికి కేంద్ర హోంశాఖ చర్యలు చేపట్టింది. బోర్డులు, రాష్ట్రాల నుంచి అందించాల్సిన సహకారం, ఒప్పందాలు తదితరాలపై వివరణ ఇస్తూ గోదావరి, కృష్ణా బోర్డులకు లేఖ రాసింది. సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందికి వసతి సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు, వాహనాలు, కార్యాలయాల ఏర్పాటు, జీతభత్యాలకు సంబంధించి ముసాయిదా పత్రాన్ని రెండు బోర్డులకు పంపింది. 

షెడ్యూల్‌–2 ప్రాజెక్టులకు భద్రత.. 
కృష్ణా, గోదావరి బేసిన్‌లలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాలతో ముడిపడిన ప్రాజెక్టులను కేంద్ర జల్‌ శక్తి శాఖ షెడ్యూల్‌–2లో చేర్చింది. ఈ ప్రాజెక్టులు, వాటి కాలువల వ్యవస్థ, విద్యుదుత్పత్తి కేంద్రాలు, సరఫరా వ్యవస్థలు, కార్యాలయాల ప్రాంగణాలు, సమగ్ర ప్రాజెక్టు నివేదికలు, ఫర్నిచర్‌తో సహా అన్నింటినీ బోర్డులు తన అధీనంలోకి తీసుకుని రోజు వారీ నిర్వహణ బాధ్యతలను నిర్వర్తిస్తాయి. వాటి పరిధిలోని రెండు రాష్ట్రాల ఉద్యోగులు, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది సహా అంతా బోర్డు పర్యవేక్షణలోనే పని చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టులకు సీఐఎస్‌ఎఫ్‌ బలగాలతో భద్రత కల్పిస్తారు. ఉమ్మడి ప్రయోజనాలతో ముడిపడని ప్రాజెక్టులను షెడ్యూల్‌–2 నుంచి తప్పించాలని, జూరాల, శ్రీశైలం, సాగర్, పులిచింతలను మాత్రమే కృష్ణా బోర్డు తన అధీనంలోకి తీసుకుని నిర్వహిస్తే సరిపోతుందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. గోదావరిపై ఎగువన ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని కోరింది. దీనిపై కేంద్ర జల్‌ శక్తి శాఖ స్పందించాల్సి ఉంది. బోర్డుల పరిధిని నిర్ణయించడం కోసం రెండు బోర్డులు ఉప సంఘాన్ని నియమించాయి. 

డీఐజీ స్థాయి అధికారితో పర్యవేక్షణ.. 
షెడ్యూల్‌–2లోని ప్రాజెక్టుల భద్రతను పర్యవేక్షించే డీఐజీ ర్యాంకు అధికారి మొదలు సీనియర్‌ కమాండెంట్, డిప్యూటీ కమాండెంట్, కమాండెంట్, ఇన్‌స్పెక్టర్, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌లతో సహా ఇతర సిబ్బంది జీతభత్యాలు, బ్యారక్‌లు, కార్యాలయాలు, నిర్వహణకు చెల్లించాల్సిన మొత్తాలు, తదితరాలపై సవివరంగా ముసాయిదాలో పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ రూపొందించిన ముసాయిదా కాపీని బోర్డులు శుక్రవారం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు పంపాయి.

ఇవీ చదవండి:
Andhra Pradesh : 27 నెలల్లో 68 మెగా పరిశ్రమలు    
వయసు చిన్నది.. బాధ్యత పెద్దది: ఎనిమిదేళ్లకే ఆటో నడుపుతూ..

మరిన్ని వార్తలు