వరదల కారణంగా రూ.6,368 కోట్లు నష్టం: నీలం సాహ్ని

9 Nov, 2020 14:09 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇటీవల భారీ వర్షాల కారణంగా సంభవించిన నష్టాలపై సమీక్షించేందుకు గాను రెండు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర బృందం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో సమావేశమయ్యింది. వివిధ శాఖల వారీగా అధికారులు జరిగిన నష్టంపై కేంద్ర బృందానికి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. భారీ వరదల కారణంగా రాష్ట్రంలో 6,368 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అధికారులు కేంద్ర బృందానికి నివేదిక ఇచ్చారు. ఈ సందర్భంగా నీలం సాహ్ని మాట్లాడుతూ.. ‘2లక్షల 12వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. 24వేల 515 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బ తిన్నాయి. రాష్ట్రంలో 5వేల 583 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. తాత్కాలిక పునరుద్ధరణ చర్యలకు గాను తక్షణమే 840 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. శాశ్వత పునరుద్ధరణ చర్యలకు రూ.4,439 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. తడిసిన, రంగు మారిన ధాన్యం కొనుగోలుకు కేంద్రం సడలింపులు ఇవ్వాలి. దెబ్బతిన్న వేరుశెనగ పంటకు కూడా నిబంధనలు సడలించాలి. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చి ఉపశమనం కల్పించాం. ప్రభుత్వం తక్షణ చర్యలతో ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించాం’ అని తెలిపారు. (చదవండి: సంక్షోభం నుంచి సంక్షేమంలోకి..)

వరద నష్టం ఫోటో ఎగ్జిబిషన్‌ సందర్శన
సాక్షి,విజయవాడ: నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలోవరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ని సౌరవ్ రే నేతృత్వంలోని కేంద్ర బృందం సందర్శించింది. జిల్లాలో సంభవించిన నష్టంపై కలెక్టర్ ఇంతియాజ్ కేంద్ర బృందానికి వివరించారు. వరదనష్టంపై కలెక్టర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రాధమికంగా అగ్రికల్చర్‌లో 17000 హెక్టార్లు, హార్టీ కల్చర్‌లో 8,000 హెక్టార్ల పంటనష్టం జరిగిందని తెలిపారు. దెబ్బతిన్న ఆర్ అండ్ బీ, పంచాయితీ రాజ్ రోడ్ల అంచనాలను కూడా వివరించారు. జిల్లాలోని మూడు మండలాల్లో కేంద్రకమిటీ పంట నష్టాన్ని పరిశీలించనుందని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు.

మరిన్ని వార్తలు