తిరుపతి ఉప ఎన్నికల్లో కుడిచేతి వేలికి సిరా

27 Mar, 2021 04:50 IST|Sakshi

రిటర్నింగ్ ‌అధికారులకు సీఈసీ ఆదేశాలు 

ఇంకా చెరగని మునిసిపోల్స్‌ సిరా 

సాక్షి, తిరుపతి: తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటు వేసిన వారికి కుడిచేతి చూపుడువేలికి సిరా వేయనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. వైఎస్సార్‌సీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ మరణంతో ఖాళీ అయిన లోక్‌సభ స్థానానికి వచ్చే నెల 17న జరగనున్న ఉప ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రతి ఎన్నికల్లో ఓటేసే ఓటరుకు అధికారులు ఎడమచేతి చూపుడు వేలికి సిరా వేయటం ఆనవాయితీగా వస్తోంది. ఇటీవల జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఆ సమయంలో ఓటర్ల ఎడమచేతి వేలికి వేసిన ఇండెలిబుల్‌ సిరా ఇంకా కొందరికి చెరిగిపోలేదు. అటువంటి వారు ఓటు వేసేందుకు వెళితే పోలింగ్‌ అధికారులు వెనక్కుపంపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పోలింగ్‌ సిబ్బందికి ఆదేశాలు జారీ చేయాలని రిటర్నింగ్ ‌అధికారులకు కేంద్ర ఎన్నికలసంఘం నుంచి ఉత్తర్వులు అందాయి. 

29న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నామినేషన్‌ 
వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా డాక్టర్‌ గురుమూర్తిని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన ఈనెల 29న నామినేషన్‌ దాఖలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. టీడీపీ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి నామినేషన్‌ వేశారు. బీజేపీ అభ్యర్థిగా రత్నప్రభ, కాంగ్రెస్‌ అభ్యర్థిగా చింతా మోహన్‌ బరిలో ఉన్నారు. జనసేన మాత్రం తటస్థంగా ఉంది. పవన్‌కళ్యాణ్‌ బీజేపీపై అసంతృప్తిగా ఉండటంతో జనసేన వర్గాలు లోపాయకారీగా టీడీపీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.   

మరిన్ని వార్తలు