పొరబడిన ‘ప్రాప్తి’: నిషేధానికి గురైన రాష్ట్రాల జాబితా నుంచి ఏపీ పేరు తొలగింపు

20 Aug, 2022 03:34 IST|Sakshi

ఏపీ డిస్కమ్‌లు రూ.412 కోట్లు బకాయిలు ఉన్నట్లు చూపిన కేంద్ర విద్యుత్‌ పోర్టల్‌ 

ఆ సమాచారం ఆధారంగానే ఎనర్జీ ఎక్స్ఛేంజ్‌లో కొనుగోళ్లు, అమ్మకాలపై నిషేధం

వాస్తవానికి ఈ నెల 5నే తొలి వాయిదా రూ.1,407 కోట్లు చెల్లించిన ఏపీ.. రెండో వాయిదాకు సెప్టెంబరు 5 వరకూ గడువు

ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తెచ్చిన రాష్ట్ర ఇంధన శాఖ

బకాయిల కారణంగా నిషేధానికి గురైన రాష్ట్రాల జాబితా నుంచి ఏపీ పేరు తొలగింపు

గురు, శుక్ర వారాల్లో రాష్ట్రంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా విద్యుత్‌ సరఫరా

సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) ఇండియన్‌ ఎనర్జీ ఎక్స్ఛేంజ్‌ (ఐఈఎక్స్‌)లో విద్యుత్‌ కొనుగోలు, విక్రయాలు నిర్వహించకుండా నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. కేంద్ర విద్యుత్‌ శాఖకు చెందిన ‘ప్రాప్తి’ వెబ్‌ పోర్టల్‌ సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకుని దేశవ్యాప్తంగా ఏపీ సహా 13 రాష్ట్రాల్లోని 29 డిస్కమ్‌లపై గురువారం కేంద్రం నియంత్రణ విధించిన సంగతి తెలిసిందే.

బకాయిలను ఏపీ డిస్కమ్‌లు సకాలంలో చెల్లిస్తున్నప్పటికీ ప్రాప్తి పోర్టల్‌లో బకాయిదారుల జాబితాలో చేర్చటాన్ని రాష్ట్ర ఇంధన శాఖ కేంద్రం దృష్టికి తెచ్చింది. దీంతో పొరపాటును గుర్తించిన కేంద్రం నిషేధిత రాష్ట్రాల జాబితా నుంచి ఏపీని  తొలగిస్తూ విద్యుత్‌ కొనుగోళ్లు, విక్రయాలను యధావిధిగా నిర్వహించేందుకు అనుమతించాలని ఐఈఎక్స్‌ను ఆదేశించింది.

తొలి వాయిదా చెల్లించాం.. రెండో దానికి టైముంది
కేంద్ర విద్యుత్తు శాఖ ఈ ఏడాది జూన్‌ 3న లేట్‌ పేమెంట్‌ సర్‌చార్జ్‌ (ఎల్‌పీఎస్‌) స్కీం కింద బకాయిల వసూలుకు సర్‌చార్జ్‌ రూల్స్‌ 2022 రూపొందించింది. విద్యుత్‌ ఉత్పాదక సంస్థలు, ఇంటర్‌–స్టేట్‌ ట్రాన్స్‌ మిషన్‌ లైసెన్సీలు, ఎలక్ట్రిసిటీ ట్రేడింగ్‌ లైసెన్సీల బకాయిలకు ఈ నియమాలు వర్తిస్తాయి. వీటి ప్రకారం ఉత్పత్తి సంస్థల నుంచి కొనుగోలు చేసిన విద్యుత్‌కు సంబంధించిన బిల్లులను 45 రోజుల్లోగా డిస్కంలు చెల్లించాలి. లేదంటే విద్యుత్‌ క్రయ విక్రయాలపై నిషేధం విధిస్తారు. ఈ నేపథ్యంలో ఎల్‌పీఎస్‌ పథకం కింద మే 30 వరకు బకాయిలన్నీ ఏపీ డిస్కంలు చెల్లిస్తున్నాయి. పథకం పరిధిలోకి వచ్చిన  బకాయిలు రూ.17,074.90 కోట్లు కాగా ఈ మొత్తాన్నీ రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌(ఆర్‌ఈసీ), పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(పీఎఫ్‌సీ)ల ద్వారా 12 వాయిదాలలో చెల్లించేందుకు ఏపీ అంగీకరించింది. మొదటి విడతగా ఈ నెల 5న రూ.1,407 కోట్లను చెల్లించింది. రెండో విడత వాయిదా చెల్లించేందుకు సెప్టెంబర్‌ 5 వరకు గడువు ఉంది.

నిరంతరాయంగా సరఫరా..
నిషేధం విధించే సమయానికి రాష్ట్రంలో డిమాండ్‌ 211.22 మిలియన్‌ యూనిట్లు ఉండగా ఆ మేరకు సరిపడా విద్యుత్‌ను ఎటువంటి అంతరాయాలు లేకుండా వినియోగదారులకు అందించారు. ఏపీ జెన్‌కో థర్మల్‌ నుంచి 55.94 మిలియన్‌ యూనిట్లు, ఏపీ జెన్‌కో హైడల్‌ నుంచి 23.46 మి.యూ, సెంట్రల్‌ గ్యాస్‌ స్టేషన్ల నుంచి 44.07 మి.యూ, ఇండిపెండెంట్‌ పవర్‌ ప్రొడ్యూసర్స్‌ నుంచి 21.20 మి.యూ, పవన విద్యుత్‌ 31.87 మి.యూ, సౌర విద్యుత్‌ 22.27 మిలియన్‌ యూనిట్లు చొప్పున సమకూరగా ఎనర్జీ ఎక్సేంజ్‌ ద్వారా 11.96 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను యూనిట్‌కు రూ.7.69 చొప్పున చెల్లించి రూ.9.52 కోట్లతో కొనుగోలు చేశారు. మన రాష్ట్రం నుంచి ఎక్సేంజ్‌లో 0.41 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను విక్రయించారు. శుక్రవారం 208 మిలియన్‌ యూనిట్ల డిమాండ్‌ ఉంటుందని అంచనా వేసి ఆ మేరకు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు ఇంధన శాఖ వెల్లడించింది. బిహార్‌లో 6.18 మి.యూ, ఉత్తర్‌ప్రదేశ్‌లో 3.49 మి.యూ, జార్ఖండ్‌లో 2.06 మి.యూ, మధ్యప్రదేశ్‌లో 1.39 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ కొరత ఏర్పడినప్పటికీ మన రాష్ట్రంలో ఎలాంటి లోటు లేకుండా విద్యుత్‌ సరఫరా చేసినట్లు తెలిపింది.

యధావిధిగా ట్రేడింగ్‌
‘‘ఏపీ డిస్కంలు విద్యుదుత్పత్తి దారులకు రూ.412.69 కోట్లు బకాయి ఉన్నట్లు ప్రాప్తి పోర్టల్‌లో పొరపాటుగా చూపడం వల్ల ఆ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని నేషనల్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ విద్యుత్‌ మార్కెట్లకు స్వల్పకాలిక అనుమతిని నియంత్రించింది. వాస్తవానికి ఈ బకాయిలను ఏపీ డిస్కంలు ఇప్పటికే చెల్లించాయి. ఈ విషయాన్ని ప్రాప్తి పోర్టల్‌ దృష్టికి తెచ్చాం. అంతేకాకుండా కొన్ని బకాయిలు ఎల్‌పీసీ పథకం కింద ఇప్పటికే చెల్లించేశాం. అయినప్పటికీ బకాయిలున్నట్లు చూపడంపై పోర్టల్‌ అధికారులకు సమాచారం అందించాం. దీంతో యాక్సెస్‌ పరిమితిని తొలగించారు. గురువారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఏపీ డిస్కంలు ఎనర్జీ ఎక్సేంజీలో ట్రేడింగ్‌ కార్యకలాపాలను యధావిధిగా కొనసాగిస్తున్నాయి’’
–కె.విజయానంద్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
చదవండి: గ్రామ, వార్డు సచివాలయాలకు రూ.3,000 కోట్లు

మరిన్ని వార్తలు