దేశ వ్యాప్తంగా కనకదుర్గా ఫ్లైఓవర్‌ అందాలు

31 Aug, 2020 20:54 IST|Sakshi

ఫ్లైఓవర్‌ను దేశమంతా చూపించేందుకు కేంద్రం నిర్ణయం

సాక్షి, విజయవాడ : దేశంలోనే అతి పొడవైన కనకదుర్గా ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవానికి కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ అయింది. ఇందుకు సన్నాహక ఏర్పాట్లకు ఆదివారం అడుగులు పడ్డాయి. దేశంలోనే అత్యద్భుత ఫ్లై ఓవర్‌ కావటంతో ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. సెప్టెంబరు 4వ తేదీన వర్చువల్‌ ప్రారంభోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ఈ ఫ్లై ఓవర్‌ ఇంజనీరింగ్‌ అద్భుతాన్ని పరిచయం చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీని కోసం ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా డ్రోన్‌ బృందాన్ని విజయవాడకు పంపించింది.ఈ బృందం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఫ్లైఓవర్‌ అందాలను చిత్రీకరించింది. 

చిత్రీకరణలో ఆర్‌అండ్‌బీ స్టేట్‌ హైవేస్‌ విభాగం అధికారులతో పాటు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ (మోర్టు) అధికారులు కూడా పాల్గొన్నారు. సెప్టెంబరు 4వ తేదీన ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవానికి ముందు దేశవ్యాప్తంగా జాతీయ మీడియాలో ఫ్లైఓవర్‌కు సంబంధించిన డాక్యుమెంటరీని ప్రదర్శించనున్నారు. స్పైన్‌ అండ్‌ వింగ్స్‌  టెక్నాలజీతో ఒంటి స్తంభంపై ఆరు వరసలతో నిర్మించిన ఫ్లై  ఓవర్‌ కావటం చేత దీనికి  ప్రాధాన్యత  ఏర్పడింది. దేశంలో ఢిల్లీ, ముంబయిల్లో మాత్రమే ఈ తరహా ఫ్లై ఓవర్లు ఉన్నాయి. అయితే ఆ రెండింటి కంటే అడ్వాన్స్‌ టెక్నాలజీతో ఈ ఫ్లైఓవర్‌ను నిర్మిస్తున్నారు.పైగా దేశంలోనే అతి పొడవైనది. ఈ టెక్నాలజీలో వై పిల్లర్స్‌  ఉండటం, వీటి నిడివి ఎక్కువగా ఉండటం కూడా ప్రత్యేకమని  చెప్పుకోవాలి.  ఈ టెక్నాలజీలో దేశంలోని అతి పొడవైన ఆరు వరసల ఫ్లై ఓవర్‌ కావటంతో దేశానికి గర్వకారణమైన విషయంగా  కేంద్రం భావిస్తోంది.
 

మరిన్ని వార్తలు