తిరుపతి బండికి ఎగనామం  

19 Oct, 2020 09:14 IST|Sakshi

సాక్షి, మచిలీపట్నం: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతికి మచిలీపట్నం నుంచి గడిచిన పుష్కర కాలంగా నడుస్తున్న ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేయాలని కేంద్ర రైల్వే బోర్డు నిర్ణయించింది. ఈమేరకు ఆ శాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది.  మచిలీపట్నం నుంచి హైదరాబాద్‌ మీదుగా బీదర్‌కు సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌తో పాటు, మచిలీట్నం–యశ్వంత్‌పూర్‌ మధ్య కొండవీడు ఎక్స్‌ప్రెస్, మచిలీపట్నం నుంచి వయా తిరుపతి మీదుగా ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తున్నాయి. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో కేంద్రంపై తీసుకొచ్చిన ఒత్తిడి కారణంగా బీదర్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌తో పాటు ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌ అందుబాటులోకి వచ్చాయి. తాజాగా బోర్డు నిర్ణయంతో ఇక నుంచి నర్సాపురం– ధర్మవరం మధ్య ఈ రైలును నడపనున్నారు. బందరు– గుడివాడ మధ్య తిరిగే లింక్‌ బండినొకదాన్ని ధర్మవరం ఎక్స్‌ ప్రెస్‌కు అనుసంధానం చేస్తారు. తిరుపతి వెళ్లాలనుకునే బందరు పరిసర వాసులు ఈ లింక్‌ ద్వారా గుడివాడ జంక్షన్‌కు చేరుకుని అక్కడ ధర్మవరం ట్రైన్‌ ఎక్కాల్సి ఉంది. 

ఎక్స్‌ప్రెస్‌ కానున్న విశాఖ పాసింజర్‌  
ఇక నుంచి మచిలీపట్నం– విశాఖ పాసింజర్‌ను ఎక్స్‌ప్రెస్‌గా అప్‌గ్రేడ్‌ చేస్తున్నారు. నర్సాపురం నుంచి భీమవరం మధ్య నడిచే లింక్‌ ప్యాసింజర్‌ను పూర్తిగా రద్దు చేస్తున్నారు.« విశాఖ ప్యాసింజర్‌ను ఎక్స్‌ప్రెస్‌గా అప్‌గ్రేడ్‌ చేయడాన్ని స్వాగతిస్తున్న బందరు వాసులు తిరుపతి మీదుగా నడిచే ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌ రద్దు చేయడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.  

రైల్వే ఉన్నతాధికారులతో చర్చిస్తా 
ధర్మవరం ఎక్స్‌ప్రెస్‌ రద్దు చేయాలని బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించేలా ఒత్తిడి తీసుకొస్తా.  అవసరమైతే కేంద్ర రైల్వే శాఖ మంత్రితో మాట్లాడతా. మచిలీపట్నం నుంచి ఈ ట్రై¯న్‌ రద్దు కాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటా. –వల్లభనేని బాలశౌరి, ఎంపీ, మచిలీపట్నం.

చదవండి: జిల్లాలో చర్చనీయాంశంగా బ్రాస్‌లైట్‌ వ్యవహారం

మరిన్ని వార్తలు