అప్పన్న ఆలయానికి అపూర్వ గౌరవం

30 Jul, 2020 06:26 IST|Sakshi

సింహాచలం అభివృద్ధికి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌

‘ప్రసాద్‌’ స్కీమ్‌లో చోటు

దేశంలో ఐదు దేవాలయాల్లో అప్పన్నకు స్థానం

రూ.53 కోట్లు నిధులు మంజూరుకు అంగీకారం

కృతజ్ఞతలు తెలిపిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి 

దొండపర్తి (విశాఖ దక్షిణ): సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి  దేవస్థానం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రభుత్వం, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు లేఖ మేరకు రాష్ట్రంలో ప్రసిద్ధ దేవస్థానాల్లో ఒకటైన సింహాచలాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి  చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ‘పిలిగ్రిమేజ్‌ రెజువెనేషన్, స్పిరిచ్యువల్‌ ఆగ్మెంటేషన్‌ డ్రైవ్‌’ (ప్రసాద్‌) స్కీమ్‌లోకి ఈ చారిత్రాత్మక ఆలయాన్ని చేర్చింది. 11వ శతాబ్దానికి చెందిన సింహాచలం దేవస్థానంతో పాటు అనుబం«ధంగా ఉన్న ఆలయాల్లో సకల సౌకర్యాలను కల్పించాలని నిర్ణయించింది. దేవాలయ పర్యాటకంలో భాగంగా సింహాచలానికి రూ.53 కోట్లు కేంద్రం మంజూరు చేసింది. ‘ప్రసాద్‌’ స్కీమ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని పలు ప్రఖ్యాత తీర్థయాత్ర స్థలాలను ఎంపిక చేసి అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా 2015–16లో అమరావతి ఆలయం అభివృద్ధికి రూ.28.36 కోట్లు, శ్రీశైలం దేవస్థానం అభివృద్ధికి రూ.47.45 కోట్లు మంజురు చేసింది. 

దేశంలో ముఖ్యమైన పర్యాటక, ఆధ్యాత్మిక, ధార్మిక, ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు కేంద్రం ‘ప్రసాద్‌’ పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మూడు దేవాలయాల పేర్లను సూచిస్తూ రాష్ట్ర పర్యాటక మంత్రిత్వ శాఖ కేంద్రానికి లేఖ రాసింది. అయితే కేంద్రం దేశంలో ఉన్న దేవాలయాల్లో ఐదింటిని మాత్రమే ఎంపిక చేసింది. వాటిలో సింహాచలం దేవస్థానం ఉండడం విశేషం. 

రూ.53.69 కోట్లతో ప్రతిపాదనలు 
కేంద్రం సూచనలు మేరకు రాష్ట్ర పర్యాటక శాఖ సింహాచలం అభివృద్ధి, చేపట్టాల్సిన పనులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సింహాచలం మెట్ల మార్గం అభివృద్ధికి రూ.27.86 కోట్లు, కొండపైనే వివిధ అభివృద్ధి పనులకు రూ.18,21,50,000, పాన్‌ ఏరియా కాంపొనెంట్స్‌కు రూ.3,87,50,000, కన్సల్టెన్సీ, ఇతర ఛార్జీలతో కలిపి మొత్తంగా రూ.53.69 కోట్లతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక  (డీపీఆర్‌)ను సిద్ధం చేసి కేంద్రానికి పంపించింది.  దీనికి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ సింహాచలం దేవస్థానాన్ని ‘ప్రసాద్‌’ స్కీమ్‌లో చేరుస్తున్నట్లు ప్రకటించింది.  కాగా, దేవాలయ పర్యాటకంలో భాగంగా సింహాచలం దేవస్థానాన్ని ‘ప్రసాద్‌’ స్కీమ్‌లో చేర్చడం పట్ల రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పథకంలో మంజూరైన రూ.53 కోట్లతో ఆలయంలో పర్యాటక రంగ అభివృద్ధికి తగిన విధంగా ఖర్చు చేస్తామన్నారు.  

మరిన్ని వార్తలు